Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''విప్లవాలకు మరణం ఉండద''న్నాడో కవి! సుందరయ్య ఒక నడయాడే విప్లవం. భౌతికంగా మనల్ని వీడి మూడున్నర దశాబ్దాలు దాటినా ఆయన బోధనలు, ఆయన కార్యాచరణ మనకు వెలుగునిస్తూనే ఉన్నాయి. అందుకే ఆయన అమరుడు. 1934లో 22సంవత్సరాల వయస్సులో కేంద్ర కమిటీలో కాలిడిన సుందరయ్య 1985 మే 19న అస్తమించే వరకు ఆయన ఆలోచన, తపన, తపస్సు భారత విప్లవం కోసమే.
అందుకే...
''పువ్వుల్లో కూడుకుంటున్న తేనంత నిశ్శబ్దంగా, మధురంగా..
మీరు ప్రజల్లో ఇమిడిపోయారు.
ఆకుల మీద చినుకులు వాలుతున్నంత ఆర్ద్రంగా
అమేయంగా అల్లుకు పోయారు.
తొలిపొద్దు పొగమంచు మీద కదులుతున్న
సూర్యకిరణాల్లో కదిలిపోయారు.
మరణించాక కూడా ప్రజల మనసుల్లో సంచరిస్తారు మీరు
మీరెక్కడున్నారని పిల్లలడిగితే
ఎర్రజాజుల రంగులా మెరుస్తున్న మట్టికేసి చూయిస్తాం.
విత్తుని పగలకొట్టి బయటికి తొంగి చూస్తున్న
మొలక కేసి చూయిస్తాం.
ఆయుధాకారంలో పెరుగుతున్న మోదుగుచెట్టు కేసి చూయిస్తాం!'' అని కె.శివారెడ్డి అన్న మాటలు బహుశా సుందరయ్యకు, మనందరయ్యకు అమరినంతగా మరెవరికీ అమరవు. సుందరయ్యకు చెందినంతగా మరొకరికి చెందవుకూడ! ''సమానత్వం సాధించాలనే కోరిక, మనవ సేవ కోసం అహరహం తపన, కులరహిత, వర్గరహిత సమాజం కోసం ఆలోచన'' సుందరయ్య సహజ గుణాలు. బ్రిటిష్ సామ్రాజ్యవాదంపైనా, దాని దోపిడీపైనా నిలువెల్లా ద్వేషంతో రగిలిపోయే గుణముంది. అల్లూరి సీతారామరాజుకున్నంత ఈ ఫైర్ చాలదా అమీర్ హైదర్‌ఖాన్ దృష్టినాకర్షించడానికి? దక్షిణ భారతదేశంలో పార్టీ నిర్మాణ బాధ్యతల్లో ఉన్న ఆయన అరెస్టు తర్వాత ఆ బాధ్యత మీదేసుకున్న సుందరయ్య కేరళలో ఏర్పాటు చేసిన మొదటి శాఖలో కామ్రేడ్స్ కృష్ణపిళ్ళై ఇఎంఎస్ మొదలైనవారు, మద్రాసులో పి.రామ్మూర్తి, జీవానందం మొదలైనవారున్నారు.
సుందరయ్యకున్న సకల గుణాలూ ఆయన ''కష్టార్జితం!'' ఆయన్ని మనీషిని చేసింది, ఎందరో కమ్యూనిస్టు నేతల కన్నా అగ్రగణ్యుడిగా నిలిపింది ఆయన చేసిన కఠోర శ్రమే! పుస్తక పఠనం చిన్ననాటి నుంచే అలవడింది. వీధిబడిలో ఉన్నప్పుడే పెద్దబాలశిక్ష, రామాయణ, భారతాలను చదివిన సుందరయ్య (తన బావగారికి మున్సిఫ్ మేజిస్ట్రేట్‌గా రాజమండ్రి బదిలీ కావడంతో) రాజమండ్రిలో గ్రంథాలయం మూసేవరకు అక్కడ అధ్యయనం చేసేవారు. ఆ తర్వాత మద్రాసులో హెచ్.డి.రాజా పరిచయంతో కమ్యూనిస్టు సాహిత్యం వంటబట్టింది. కేవలం పుస్తక పఠనానికే సుందరయ్య ప్రాధాన్యత నివ్వలేదు. చైనా రైతాంగంలో ఏర్పడ్డ విభజనపై మావో అధ్యయనమంత ప్రామాణికమైన అధ్యయనాన్ని నాటి ఆంధ్రప్రదేశ్‌లో స్వయంగా జరిపిన సుందరయ్య రైతాంగ ఉద్యమానికి ఒక మార్గం చూపారు. నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అధ్యయనం చేయాలన్న లెనినిస్టు సూత్రానికి ఒక ఆచరణ రూపం ఇది. నిరంతరం ప్రజా ఉద్యమాల్లో ఉండే వారికి అధ్యయనం మరింత ప్రాధాన్యతున్న అంశమని కామ్రేడ్ పి.ఎస్. జీవితం మనకు నేర్పుతుంది.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రత్యక్ష నాయకత్వం వహించడం రైతాంగ సమస్యలపై ఆయన సమగ్ర అవగాహనకు తోడ్పడటమే కాదు, భారత విప్లవంలో వ్యవసాయ విప్లవ ప్రాధాన్యతపై యావత్ పార్టీలో చర్చకూ తోడ్పడింది. ఇది 1948-64 మధ్య పార్టీలో రివిజనిస్టు అతిక్రమణలపై సమరభేరికి, చివరికి సీపీఐ(ఎం) ఏర్పాటుకు దారితీసిన సంగతి మనకు తెలిసిందే. భారత విప్లవానికి వ్యవసాయ విప్లవం ఇరుసువంటిదని సీపీఐ(ఎం) కార్యక్రమం 1964లోనే పేర్కొంది.
నిరాడంబరతకు, క్రమశిక్షణకు మారుపేరుగా సుందరయ్యను కమ్యూనిస్టులే కాదు, యావత్ దేశమూ పరిగణిస్తుందనడం అతిశయోక్తి కాదు. కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు సుందరయ్య అత్యధిక ప్రాధాన్యత నిచ్చేవారు. ''ప్రతి విప్లవ పోరాటమూ, అంతకు ముందు గెలుపొందిన విప్లవాన్ని నమూనాగా తీసుకుని సాగుతుంది. కానీ ఆ నమూనాను అధికమించ గలిగినప్పుడే అది విజయం సాధిస్తుంద''ని జర్మన్ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు రోజా లగ్జంబర్గ్ రాసింది సుందరయ్యకు సంబంధించినంత వరకు అక్షరసత్యం. 1948లో జరిగిన రెండవ పార్టీ కాంగ్రెస్ తర్వాత భారత విప్లవానిది చైనా మార్గమా? రష్యా మార్గమా'' అనే చర్చ, కామ్రేడ్ స్టాలిన్‌తో సమాలోచన తర్వాత భారత విప్లవానిది భారతదేశ ప్రత్యేక మార్గమేనని తేల్చిన నాయకత్వంలో సుందరయ్యదీ ప్రధానపాత్రే.
''నాయకులు కదిలితే చాలదు. ప్రజలు కదలాలి. మన కార్యకర్తల విజ్ఞాన స్థాయి అనేక రెట్లు పెరగాలి. కొద్దిమంది విప్లవం తీసుకురాగలరనో, కొన్ని పార్లమెంటరీ విజయాలతో లక్ష్యం చేరువవుతుందనో భావించడం, దగ్గరి దోవలు వెతకడం చాలా తప్పు. ప్రజల్లో చైతన్యం మొత్తంగానే పెరగాల్సి ఉంది. అందుకు మనం నిరంతరం కృషి చేయాలి''. తన ఆత్మకథలో పి.ఎస్. అన్న మాటలు నేడు మనకు దీపధారలు.