Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విమర్శలొస్తే చాలు వీరంగమాడుతూ విపరీతకాండకు తెగబడటం మోడీ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. విమర్శ ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువని న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నా, ఏ మాత్రం నిరసనను సహించలేని సర్కారు తీరుపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నా తన వైఖరిని మార్చుకోకపోగా మరింత పటిష్టపర్చుకునే దిశలోనే ప్రయాణిస్తోంది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానాన్ని నిరసిస్తూ ఢిల్లీలో వెలసిన వాల్పోస్టర్లపై మోడీ ప్రభుత్వం కన్నెర్ర చేయడమే కాకుండా ఏకంగా నగరంలోని పలు పోలీస్స్టేషన్లలో 17 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి పాతికమంది అనుమానితులను అరెస్టు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. సూత్రధారుల అంతు తేలుస్తామని కఠిన చర్యలు తప్పవని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు. సీసీటీవీ ఫుటేజీలను ఉపయోగించి కేసులు బనాయించేందుకు నానా హైరానా పడుతున్నారు. మోడీ ప్రభుత్వం కేంద్రంలో రెండవసారి వచ్చాక నయా-ఉదారవాద విధానాలను, హిందూత్వ సిద్ధాంతాలను రెండింటినీ మేళవించి అమలు చేసే క్రమంలో విమర్శను తట్టుకోలేక నిరంకుశత్వానికి తెగబడుతోంది. ప్రభుత్వ విధానాల్లో తప్పులను ఎత్తిచూపినా, నిరసన వ్యక్తపరిచినా బెంబేలెత్తిపోతోంది. రాజద్రోహం సహా కఠినాతి కఠిన సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయిస్తోంది. అక్కడితో ఆగకుండా ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రభుత్వ వ్యతిరేక, వాస్తవిక కథనాలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలపై ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టించి బెదిరింపులకు పాల్పడటం నిత్యకృత్యమైంది.
ఢిల్లీలో వాల్‌పోస్టర్లలో ప్రభుత్వాన్ని, ప్రధానిని కించపర్చే వ్యాఖ్యలేమీ లేవు. ఉన్నదల్లా ప్రభుత్వ విధానంలోని లోపభూయిష్టతే. 'ప్రధాన మంత్రీ, మన బిడ్డల టీకాలను విదేశాలకు ఎందుకు పంపించారు?' అనే ప్రశ్న బీజేపీ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. ఆ ఫలితమే కేసులు, అరెస్టులు. కోవిడ్ వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతికి దేశం అల్లకల్లోలంగా తయారైంది. ప్రతి రోజూ నాలుగు వేల మరణాలు సంభవిస్తున్నాయి. మూడున్నర లక్షలకు అటు ఇటుగా పాజిటివ్ కేసులొస్తున్నాయి. వైరస్ దాడికి జనం భీతిల్లుతుండగా కరోనా కట్టడిపై మోడీ సర్కారు నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తోంది. లాక్డౌన్లు, కర్ఫ్యూలతో ఉపాధి కోల్పోయిన పేదలకు అత్యవసర సహాయం చేయమంటే చేతులు కట్టుకూర్చుంది. ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ వంటి ప్రాణాధార మందుల కొరత కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ విధానం అస్తవ్యస్తం, వ్యాపారమయం. రాష్ట్రాలకు నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపుతోంది. అందరికీ ఉచితంగా టీకా, కరోనా కట్టడి చర్యలు, పేదలకు ఆర్థిక సహాయం, ఆక్సిజన్ సరఫరా, రాష్ట్రాలకు నిధులు, అఖిలపక్ష సమావేశం తదితర డిమాండ్లతో కాంగ్రెస్, వామపక్షాలు, ఎన్డీఏ యేతర ప్రాంతీయ పార్టీలు సంయుక్తంగా లేఖ రాసినా మోడీ ప్రభుత్వంలో చలనం లేదు. ఇంత బాధ్యతారహితంగా ఉన్న ప్రభుత్వాన్ని, పాలకుల వైఫల్యాలను ప్రశ్నిస్తే, విమర్శిస్తే, నిరసిస్తే మాత్రం పట్టలేని ఉక్రోషంతో అక్రమ కేసులకు కాలుదువ్వడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి తూట్లు పొడవడమే.
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? తమ నాయకుడు మోడీ విమర్శకులపై కేసులు పెడుతుండగా బీజేపీ ఏలుబడిలోని రాష్ట్రాలు అంతకు రెట్టించిన ఉత్సాహంతో ప్రజాతంత్ర హక్కుల హననానికి సై అంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు, ఆస్పత్రిలో బెడ్, ఆక్సిజన్ కోసం సోషల్ మీడియా ద్వారా ప్రాధేయపడ్డందుకు కేసులు పెట్టడం బీజేపీ విపరీతధోరణికి పరాకాష్ట. గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ తదితర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఉదంతాలెన్నో. ఇప్పటికే మోడీ వచ్చాక భారతదేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని పలు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా స్వీడన్‌కు చెందిన 'వి-డెన్' సంస్థ మొన్న మార్చిలో కూడా ఇదే వెల్లడించింది. తమ వ్యాక్సిన్ వైఫల్యాలపై ఒక్క వాల్‌పోస్టర్ వేసినంతనే ఇంత ఉలికిపాటుకు గురవుతున్న తీరు చూస్తుంటే ఈ ప్రభుత్వానికి విమర్శంటే ఎంత భయమో అర్థమవుతోంది. ఒక వైపు ఈ నిరంకుశత్వం, మరోవైపు రాష్ట్రాలపట్ల వివక్షత రోజురోజుకూ పెరుగిపోతున్న నేపథ్యంలో.. ప్రజాస్వామ్య విలువల కోసం, రాష్ట్రాల హక్కుల కోసం పోరాడటంలో ప్రజలే కాదు, ప్రభుత్వాలు నడుపుతున్న ప్రాంతీయపార్టీలు ముందుండాలి. అలాగాక కేంద్ర నిరంకుశత్వాన్ని అనుకరిస్తే ఆ ప్రాంతీయ పార్టీలకూ ముప్పు తప్పదు. దేశంలో ప్రజాస్వామ్య చైతన్యం బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను పరిస్థితులు సూచిస్తున్నాయి.