Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మా ఉద్యోగాలు మాకు కావాలి' తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర యువత, నిరుద్యోగులు, విద్యార్థుల ప్రధాన డిమాండ్ ఇది. స్వరాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని విద్యార్థులు, నిరుద్యోగులు ప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యజించారు. తెలంగాణ వచ్చిన ఏడేండ్ల తర్వాత కూడా నిరుద్యోగులు ఇదే డిమాండ్ చేస్తుండటం రాష్ట్రంలోని దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. సర్కారు ఉదాసీన ధోరణితో నిరుద్యోగుల బలవన్మరణాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఏడేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో యువత మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగం లేదన్న మనస్తాపంతో మొన్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ బలిదానాన్ని మరువక ముందే నిన్న మెదక్‌లో వెంకటేష్ డీఎస్సీ నోటిఫికేషన్ రావడం లేదని మనస్తాపంతో ఉరి వేసుకున్నాడు. వీటిపై ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్టుగా ఉన్నది.
తెలంగాణ వస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని సునీల్, వెంకటేష్ లాగా ఎంతో మంది ఆశించారు. కానీ, రాష్ట్ర సాధన కోసం పోరాడిన యువకులు ఇప్పుడు ఉద్యోగాలకు అప్లయి చేసుకునే వయసును కూడా దాటిపోయారు. ఇంకొందరు దాటిపోతున్నారు. వీరిలో చాలా మంది కుటుంబాలను పోషించుకోలేని దుర్భర స్థితిలో జీవితాలు గడుపుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసీ చూసీ యువత ఆగమైపోతున్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, పది మందిలో తలెత్తుకుని తిరగలేక మనో వేదనకు గురవుతున్నారు.
రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల గోస.. వారి కుటుంబాల ఆవేదన.. నిరుద్యోగుల ఎదురుచూపులు.. వెరసి కొత్త రాష్ట్రంలోనూ యువత ఆత్మబలిదానాలు కొనసాగుతుండటం దురదృష్టకరం. తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఉద్యోగాలపై ప్రకటన చేశారు. రాష్ట్రంలో లక్షా 7 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేస్తామని ఆయన ఇచ్చిన హామీ నేటికీ వెక్కిరిస్తూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్లలో మొత్తం 1,91,126 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ఇటీవలే ఇచ్చిన పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసింది. టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ చేసుకోని వారితో కలిపితే తెలంగాణలో మొత్తం 35లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని అంచనా. టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల కోసం పేరు రిజిస్టర్ చేసిన వారిలో 85శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతే. అయినా సరే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా గ్రూప్1 నోటిఫికేషన్ ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వానికి ఉద్యోగాల భర్తీ మీద, నిరుద్యోగ సమస్య మీద ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతోంది.
'టీఎస్పీఎస్సీ మూసేయాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా? అసలు ఛైర్మన్ నియమించే ఉద్దేశం ఉందా?' అంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నాలుగు వారాల్లో చైర్మన్, సభ్యులను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆగమేఘాల మీద సీనియర్ ఐఏఎస్ డాక్టర్ బి.జనార్థన్‌రెడ్డిని ఛైర్మన్‌గా ఇతరులను సభ్యులను సర్కార్ నియమించింది. నిన్ననే ఛార్జీకూడ తీసుకున్నారు. ఇది ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచిచూడాలి. సంవత్సరాలుగా ఖాళీలు భర్తీ చేయకపోవడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగులపై పని భారం పెరుగుతోంది. ఆర్థికశాఖ గణంకాల ప్రకారమే 32 డిపార్ట్మెంట్లలో పాత కేడర్ ఉద్యోగుల సంఖ్య 1.48లక్షలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఉద్యోగాల భర్తీకి ఇంకెన్నేండ్లు? ఇవికాక కొత్త జిల్లాల్లో ఏర్పడిన ఉద్యోగాలెన్ని? అందులో ప్రస్తుతం ఉన్న ఖాళీలెన్ని? కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకునే సర్కారు వాటిలో పాలన సక్రమంగా నడవాలంటే ఉద్యోగాలు భర్తీ చేయాలన్న విషయం మాత్రం మర్చిపోయింది.
తెలంగాణలో నిరుద్యోగం రేటు 33.9శాతంగా ఉంది. గతంలో టీఎస్పీఎస్సీ విడుదల చేసిన అర కొర నోటిఫికేషన్లు కూడా వివాదాలమయమే. పైగా కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉపాధి హామీ, మిషన్ భగీరథ, హార్టికల్చర్ శాఖల్లో 10వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్, విద్యా శాఖలలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న మరో పది వేల మందిని 'నో వర్క్ నో పే' పేరుతో రోడ్డున పడేసింది. తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాలే ఉండవని, అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీలు గుప్పించిన కేసీఆర్.. నేడు వారిని ఉద్యోగాల నుంచి తొలగించారే తప్ప ఎక్కడా పర్మినెంట్ చేసిన దాఖలాలు లేవు.
అసెంబ్లీలోనో, పార్టమెంటులోనో ఖాళీలు ఏర్పడితే ఉపఎన్నికలు నిర్వహించి ఆరునెలల్లో ఆ ఖాళీని భర్తీచేస్తున్నారే.. మరి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పడిన ఖాళీలను మాత్రం ఏండ్ల తరబడి అలా ఖాళీగానే ఉంచుతారా? రాష్ట్ర యువతలో అభద్రతా భావాన్ని తొలగిస్తూ మరో నిరుద్యోగి బలి కాకముందే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపట్టాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా చర్యలు తీసుకోవాలి. కొత్తగా ఏర్పడిన టీఎస్పీఎస్సీతోనైనా నిరుద్యోగుల ఆశలు తీరేనా..?