Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు, పదిలంగా అల్లూకున్నా పొదరిల్లు మాది, పొదరిల్లు మాది' అని పూర్వం ఓ సినీగీతం విన్నాము. ఇల్లు అనేది మానవ పరిణామక్రమంలో ఒక స్థిర నివాసం ఏర్పడిన నాటి నుంచి ఆరంభమయింది. మనుషుల్లోనే కాదు, పశుపక్షాదులకు, అడవుల్లో జీవించే మృగాలకు కూడా గూడుంటుంది, గుహ ఉంటుంది. అదే వాటి ఇల్లు. ఇల్లనేది ఈనాటి మానవుని అస్థిత్వ ఆనవాలుగా మారిపోయింది. ఇంటికీ కుటుంబానికీ ఒక విడదీయరాని సంబంధం ఏర్పడింది.
చిన్నప్పుడు 'ఇ' అక్షరాన్ని పరిచయం చేస్తూ 'ఇల్లు' అని చెప్పేవారు. ఆ ఇల్లు అనేది చాలామందికి ఒక కల. ఇంటిని ఓ సుందర బృందావనంగా నిర్మించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇంటిని నిర్మించుకోవడమంటే జీవితంలో ఒక గొప్ప ఘనకార్యం చేసినట్టు, లక్ష్యాన్ని సాధించినట్టు. అందుకే పెండ్లి చేసి చూడు, ఇల్లు కట్టిచూడు అన్నారు పెద్దలు. ఆధునిక యుగంలో అనేక సౌకర్యాలతో నూతన టెక్నాలజీతో, అధిక వ్యయం చేసేట్లయితే కొత్త కొత్త సౌకర్యాలను ఇంట్లోనే పొందగలుగుతాము. అయితే ఒకప్పుడు మట్టిగోడలతో బెంగుళూరు పెంకుతో నాన్న నిర్మించిన మూడు గదుల ఇల్లే మహాసౌధంగా అనిపించేది. కానీ ఈనాడు కాంక్రీటుతో అధునాతనంగా నిర్మించుకున్నా సంవత్సరానికో కొత్త సౌకర్యాత్మకమైనవి మార్కెట్లోకి వస్తూవుంటే, ఉన్న ఇల్లు పాతగానే తోస్తుంది. ఏదో ఇంకా సమకూర్చుకోవాలనే కోర్కె వెంటాడుతూ ఉంటుంది.
మొదట ఇల్లు నీడా, నివాసం కోసమే. ప్రాథమికంగా ఇప్పుడూ అంతే. కానీ ఆ ఇల్లూ, నీడా లేని జనులు ప్రపంచంలో చాలామందే ఉన్నారు. ఇప్పటికీ మనం ఫుట్‌పాత్‌లపై, సిమెంటు పైపులలో, ఊరవతల చెట్టుక్రింద గుడారాలలో నివాసముంటున్న వాళ్ళు, పని చేసేచోట, టీకొట్లలోమార్కెట్ బల్లపై తోపుడు బండ్లపైనే కాలం వెళ్ళదీస్తున్న అనాథలకు ప్రపంచమే ఇల్లుగా మారిపోవటం చూస్తున్నాం కదా! ఇల్లు కోసం, యాభై గజాల జాగాకోసం ఎన్ని లక్షలమంది ప్రజలు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఈ భూమిపై నీడను కల్పించలేకపోతున్నది. అందరికీ కూడూ గూడూ గుడ్డ అనేది కనీస ఏర్పాటుకు చేస్తున్న డిమాండుగానే ఉంటున్నది. ముంబాయిలో వేల గదులతో ఆకాశహార్మ్యాన్ని నిర్మించిన ముఖేష్ అంబానీ 'అంటిల్లా' పక్కనే రేకులతో, చాపలతో, సందులలో కాలువ ప్రక్కన నీడను పరచుకునే జనాభా చాలామందే ఉంటారు. ఈ రకమైన తేడాలు మన వ్యవస్థల లక్షణాలను ప్రస్ఫుటం చేస్తాయి. ఇల్లు కావాలని ఆందోళనలు చేస్తే లాఠీలు లేస్తాయి. తూటాలు పేలుతాయి. ఆ మధ్య ముదిగొండలో ఇంటికోసం చేసిన పోరాటంలోనే ఏడుగురి ప్రాణాలను ప్రభుత్వం బలితీసుకున్నది. మనిషికి నివసించే హక్కుంటుంది. అందుకు ఇల్లు కనీస షరతు. ఇల్లేకాదు, నీకు దేశమేలేదని గాజాలో ఇండ్లపై బాంబులు కురిపిస్తూ కూలగొడుతున్నారు. ఇండ్లు కూలి, ఆశలు శిథిలమై, కన్నీళ్ళ నీడన బతుకీడుస్తున్న పాలస్తీనా సామాన్య ప్రజలను నిర్వాసితులుగా చూస్తూ ఒక్కమాటయినా మాట్లాడలేకపోతున్నాము. పదిలమైన ఇంటికోసం పరితపించే వారందరికీ చేయూతనివ్వాల్సిన తరుణమిది. ఇళ్ళులేని వాళ్ళ కన్నీళ్ళు తుడవాల్సిన సమయమిది.
'ఇల్లే ఇలలో స్వర్గమని ఇల్లాలే ఇంటికి దేవతని' ఓ అందమైన సినీగీతముంది. ఇల్లు అనేది భౌతిక నిర్మాణం మాత్రమే. ఇంటితో మనుషులకుండే అనుబంధమే ఇంటికి ఆ విలువను తెచ్చిపెట్టింది. ఇల్లంటే గోడలు, పైకప్పు, నున్నని పాలరాయిబండలు, సకల సౌకర్యాలు ఉండటం కాదు. ఇంట్లో మనుషులుండటం, మనుషుల మధ్య ఆత్మీయ అనుబంధాలుండటం. ప్రేమలుండటం. అమ్మా, నాన్నా, పిల్లలు, తాత, నాన్నమ్మ, అమ్మమ్మ, అక్కా, అన్న, చెల్లి, తమ్ముడు ఇదీ కదా ఇంటికి అర్థం. ఈ అనుబంధాలు లేని ఇల్లు ఇల్లేకాదు.
ఇప్పుడు ఈ కరోనా కాలంలో ఇల్లు అనేది ప్రధాన భూమికను పోషిస్తున్నది. లక్షలాది మందికి కరోనా సోకటంతో వాళ్ళంతా ఎక్కడ ఉండాలి. 'ఐసోలేషన్'లో ఉండాలన్న నిబంధన అవసరంగా మారిన సందర్భంలో ఇల్లు, ఇంటిలోని గదులు ప్రాణాలను రక్షిస్తున్నాయి. పరులకు రక్షణ కల్పిస్తున్నాయి. లేకుంటే బయట ఆసుపత్రులు, పడకలు ఏమూలకొస్తాయి! ఇల్లుండటం, ఇంటిలో తనకంటూ ఓ గది ఏర్పాటు చేసుకోగలగటం, ఈ ఆపద సమయంలో ఎంతో ప్రాధాన్యత కలిగి అపురూపమైన అంశంగానే కనపడుతోంది. ఇల్లు ఒక్కరి, ఇద్దరి లేదా ఆ ఇంటివారి ప్రాణాలకే కాదు, అనేకమంది ప్రాణాలకు రక్షణగా నిలిచే వ్యవస్థ. ఇల్లుండటం ఇప్పుడందరికీ అవసరం. ఇల్లులేని వాళ్ళ చేరదీయటం అత్యంతావశ్యకం.
బీరుగడ్డిపై కప్పుగా అలికిన అమ్మ చేతుల ఇంటి వాసన, మెరిసే మార్బుల్ నేల గదులలో రావడంలేదు. ఇంట్లోని వాతావరణమే మారిపోయింది. ఇప్పుడు ఇల్లు ఉన్నా ఇంటిలో నుంచి ఎప్పుడు ఎవరు ఖాళీ చేసిపోతారోననే భయం వెన్నాడుతోంది. ఈ కాలంలోనే ఖాళీ అయిన ఇండ్లు, ఇండ్లలోని గదులూ ఎన్నో ఎన్నెన్నో. ఇండ్లు మానవ సంబంధాల జ్ఞాపక చిహ్నాలు. ఇల్లు, ఇంటిల్లిపాదికీ ఓ చిరునామా. సమాజానికి నమూనా. అందుకే గుడికన్నా ఇల్లు పదిలం. రక్షణ కవచంలాంటి ఇంట్లోనే ఉండండి. ఇప్పుడు ఇల్లు ఒక యుద్ధస్థావరం. సవాళ్ళ నెదుర్కొనేందుకు సమాయత్తమయ్యే ప్రాంగణం. బతుకుపోరులో ఇంటినొదిలినా, వెంటనే ఇంటికి చేరండి. ఈ విపత్తులో ఇల్లే ఒక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం.