Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గిరీశం 'గాయిత్రి' మీద ప్రమాణం చేసేటప్పటికి బాకీ వసూలుకొచ్చిన బంట్రోతు అది నిజమని నమ్మేశాడు. ''అన్నాళ్ల తర్వాత జంఝప్సోస ఉపయోగపడ్డందు''కు ఆనందంతో ''ఓల్డు కష్టమ్స్ అన్నింటికీ ఏదో ఒక ప్రయోజనం ఆశించే మనవాళ్లు ఏర్పాటు చేశార''నుకుంటూ ''ఆత్మానుభవం అయితేనే గాని తత్వం బోధపడదం''టాడు గిరీశం. ''పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట!'' అని పోతనగారన్నది మనదేశ పాలకులకు సరిగ్గా అమరుతుంది. పీవీ నుంచి మోడీ వరకు ఏమాత్రం తేడాల్లేకుండా ప్రభుత్వరంగం తెల్లఏనుగన్నారు. అన్నది వీళ్ళైనా అనిపించింది మాత్రం ఐ.ఎం.ఎఫ్., ప్రపంచబ్యాంకులే! అవునని తలలాడించినవారున్నారు. కాకి బావ గొంతిప్పి పాటందుకుంటే దాన్నోట్లోని ముక్క తనకే గదా దక్కేదని కార్పొరేట్ నక్కనుకోవడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాని పైపై పటాటోపాలు చూసి అర్జంటుగా నిచ్చెన మెట్లెక్కి పైఅంతస్తుకెగబాకచ్చనుకున్న అనేకమంది మధ్య తరగతి ఈ విధానాలకు వాహకులైనారు. ఒపీనియన్ బిల్డర్స్ అయినారు. వెరసి, ఈ విధానాలకు గత ముప్పయ్యేండ్లుగా ప్రిజర్వేటివ్స్ అయినారు. వంద తప్పులైపోయాయి. శిశుపాల వథకు టైమైంది. ఎల్ఐసీ అయితే పాలసీదార్లు, బ్యాంకులైతే కష్టమర్లు, ఆర్టీసీ అయితే ప్రయాణీకులు, విద్యుత్ అయితే వినియోగదార్లు.. ఇలా సమాజంలోని ప్రతి తరగతి ప్రజలూ పంజాబ్, హర్యానా రైతుల బాటపట్టకుండా ఆపగలిగే శక్తి మోడీ సర్కార్కుందా?!
జీవిత బీమా రంగంలోకొచ్చే పెట్టుబడి దీర్ఘకాలికమైనది. అది ప్రభుత్వానికి, తద్వారా ప్రజలకూ ఉపయోగపడాలి కాని కార్పొరేట్ల జేబుల్లోకి పోవడమేంటని 1950వ దశకంలో మన పాలకులాలోచించారు. ఆర్థిక వ్యవస్థ నడవడానికి అవసరమైన పెట్టుబడి 1969 నాటికి కీలకమైంది. అందుకే 14 బ్యాంకుల జాతీయికరణ జరిగింది. అంతకు ముందే అధ్వాన్నమైన ట్రాక్ రికార్డున్న 245 దేశ, విదేశీ ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలను కలిపి ఎల్‌ఐసీగా ఏర్పరిచారు. రెండు చర్యలూ ప్రజలాశలను తీర్చాయి. 34 లక్షల కోట్ల రూపాయలతో ఎల్ఐసీ ఒక బలమైన సంస్థగా రూపుదిద్దుకోవడమేగాక, తాజాగా ప్రభుత్వానికి రూ.26వేల కోట్లు డివిడెండ్ ఇచ్చింది. ఒక్క 12వ ప్రణాళికా కాలంలోనే 14లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి బాండ్లలోగాని, మౌలిక సదుపాయాల కోసం గాని ఎల్ఐసీ పెట్టుబడిపెట్టింది. ప్రభుత్వరంగ బ్యాంకుల వద్ద నేడున్న రూ.140లక్షల కోట్లలో సుమారు రూ.105 లక్షల కోట్ల అడ్వాన్సులున్నాయి. దాన్లో ప్రాధాన్యత రంగాలకు అప్పుల రూపంలో చెల్లించాయి. పైచర్యలేవైనా ప్రయివేటు సంస్థలు చేస్తాయా అని 43 కోట్ల మంది ఎల్ఐసీ పాలసీదార్లు, కోట్లాది బ్యాంకు డిపాజిటర్ల ప్రశ్నలకు మోడీ సర్కార్ సమాధానం చెప్పగలదా? సామాన్యులకు అప్పులివ్వకుండా ఫోన్‌పే, ఇన్స్టమోలాంటి కార్పొరేట్లకు అప్పులిచ్చి మునిగింది యస్ బ్యాంకు. ఎస్బీఐ లాంటి కొన్ని బ్యాంకులను రంగంలోకి దింపి రూ.7వేల కోట్ల ఊపిరూదింది కేంద్ర సర్కార్. పంజాబ్, మహారాష్ట్ర కో ఆపరేటీవ్ బ్యాంకు బ్యాంకింగ్ నియమాలకు విరుద్ధంగా ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీకి రూ.2500కోట్లు అప్పు ఇచ్చింది. దీన్ని కప్పి పెట్టడానికి 21,000మందికి గృహరుణాలిచ్చినట్టు దొంగఖాతాలు సృష్టించింది. 2018 వరకు విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా కీర్తించబడ్డ మహిళా కార్పొరేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ చందాకొచార్. ఆమె భర్తకు చెందిన పవర్ ప్రాజెక్టు, వీడియోకాన్ అధినేతతో కలసి పాల్పడ్డ నేరానికి నేడు సీబీఐ, ఈడీ విచారణలో ఉంది. ఇవన్నీ తాజా ఉదాహరణలే. 1994లో పుట్టి 2004లో పాడెక్కిన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు వంటివి కలిపితే లేదా 1969లో 14 బ్యాంకుల జాతీయికరణ వరకు దేశంలో సుమారు రెండు వేల బ్యాంకులు బోర్డు తిప్పేశాయి. మళ్ళీ ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ ప్రయివేటీకరించేందుకు మోడీ సాబ్ ప్రయత్నిస్తే జనం చూస్తూ ఊరుకుంటారా?
ప్రస్తుతం జల, వాయు, భూమార్గ రవాణానంతటినీ ప్రయివేటువారి చేతుల్లోకి తిలార్పణం చేస్తోంది మోడీ సర్కార్. చెప్పే సాకు నష్టాలొస్తున్నాయని. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ప్రజా రవాణా నష్టాల్లోనే ఉంది. ప్రజల కోసం ఆయా దేశాల ప్రభుత్వాలు భారీ సబ్సిడీతో నడిపిస్తున్నాయి. మోడీగారి పెద్దక్క మార్గరేట్ థాచర్ 1979లో ప్రయివేటీకరించిన రైల్ వ్యవస్థను తిరిగి ప్రభుత్వమే జాతీయం చేయాలన్న డిమాండ్ ఆ దేశంలో ఊపందుకుంటోంది. అర్జెంటైనాలో తిరిగి జాతీయమే చేశారు.
ప్రయివేటు కబంధ హస్తాల్లో ఆరోగ్య వ్యవస్థ ఉంటే ఏమవుతుందో 'కరోనా' భారతీయ ప్రజల కండ్లముందుంచింది. ''మనవాడైన'' సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి మన రాష్ట్రంలోని 47మంది వైద్యులు రాసిన లేఖలో వైరస్ విలయతాండవం చేస్తుంటే, సిబ్బంది నియామకం, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ల ఉత్పత్తి మొదలైన వాటిలో ప్రభుత్వాల ఘోర వైఫల్యం గురించి రాశారు. కార్పొరేట్ మాఫియాను అరికట్టి ఆసుపత్రులన్నింటినీ జాతీయం చేయాలన్నారు. క్రమంగా ప్రజల్లో 'ప్రభుత్వరంగమే ముద్దు, కార్పొరేట్ వద్దు' అనే చైతన్యం పెరుగుతున్నది. పశ్చిమదేశాల్లో, అమెరికాతో సహా, 1999 నాటి డబ్ల్యూటిఓ వ్యతిరేక ప్రదర్శనల కాలం నుంచి ''డౌన్విత్ క్యాపిటలిజం'' నినాదాలు మారుమోగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనదేశంలో కార్పొరేట్లను జాతీయం చేయాలన్న డిమాండ్ నేలగర్భాన్ని చీల్చుకుని ఆవిర్భవించే కత్తుల వృక్షంలా రూపుదాలుస్తున్నది.