Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నీరు కారుణ్యానికే కాదు, ఒక్కోసారి కపటత్వానికీ ప్రతీకగా నిలుస్తుంది. ఈ కన్నీటిసారాన్ని కనిపెట్టలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు. ఇప్పుడు దేశం లోపలా వెలుపలా ఓ ''కన్నీరు'' పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ ''కన్నీరు'' సాక్షాత్తూ ప్రధాని మోడీది కావడమే ఇంతటి పాధాన్యతకు కారణమైంది. అది మొసలి కన్నీరా? లేక అసలు కన్నీరా? అన్నది నేడు నూటాముప్పయ్యెనిమిది కోట్ల ప్రశ్న. ప్రధాని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు! ఒక దశలో మాటలు రాక నిమిషం పాటు మౌనంగా ఉండిపోయారు!! తుదకు ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్నారు!!! ఈ ''కన్నీరు'' కపటమా? కారుణ్యమా? అన్నది సర్వత్రా చర్చగా మారడం వైచిత్రి! కంటికి కనిపించని వైరస్ ఒకటి ఇంటింటా చావుడప్పు మోగిస్తుంటే, అది సృష్టిస్తున్న విలయానికి దేశమంతా బలైపోతుంటే, ఆ దేశాధినేత కార్చిన ''కన్నీరు'' ఇంతగా అపహాస్యం కావడం నిజంగా విచారకరమైన సందర్భం.
మోడీ కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలను, వార్తలను ప్రభుత్వ నియంత్రిత మీడియా ఎంతగా పతాక శీర్షికలకెత్తినా పౌర సమాజం మాత్రం దానిని ''మొసలి కన్నీరు''గానే భావిస్తుండటం గమనార్హం. ప్రజాపక్షం వహించే జాతీయ, అంతర్జాతీయ మీడియాతో పాటు అసంఖ్యాకులైన ప్రజలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా స్పందిస్తున్న ఫలితంగా ఇప్పుడు ''మొసలి కన్నీరు'' అనేది విపరీతమైన పాపులర్ వర్డ్‌గా మారింది. దొరికిన ప్రాణులను నిర్దాక్షిణ్యంగా నమిలి మింగుతూ ఆ సమయంలో కన్నీరు కార్చడం మొసళ్ల లక్షణం. ఆహారం తీసుకునేటప్పుడు వాటి గ్రంథులలో సంభవించే మార్పుల కారణంగా అవి కళ్ల నుంచి ద్రవాలను స్రవిస్తాయి. అంతేతప్ప ఆ కన్నీటికి భావోద్వేగాలేమీ ఉండవు. అందుకే చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు దొంగ ఏడుపులు ఏడ్చేవారిది మొసలి కన్నీరు అంటారు. మరి జనం పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోని ప్రధానమంత్రి, ఇప్పుడు ప్రజల అసమ్మతినీ ఆగ్రహాన్నీ గ్రహించి ఎన్నడూలేని విధంగా కన్నీరు ఒలకపోయడాన్ని ఏమనాలి? అందుకే ప్రధానిది మొసలి కన్నీరు అని లోకం కోడై కూస్తోంది.
పల్లెపట్నం అన్న తేడా లేకుండా దేశమంతటా వీధుల్లో విరామమెరుగ మోగుతున్న అంబులెన్స్‌ల సైరన్ మోతలను ఆయన వినిపించుకోరు. స్మశానాల్లో శవాలు గుట్టలుగా పోగుబడుతున్నా ఆయన పట్టించుకోరు. ప్రాణాపాయస్థితిలో ప్రజలకు ఆసుపత్రిలో బెడ్స్ ఇవ్వలేకపోతున్నారు. ఆక్సిజన్ అందించలేకపో తున్నారు. లక్షల రూపాయలు దోచుకుని శవాలను అప్పగిస్తున్న ప్రయివేటు ఆసుపత్రుల దాష్టీకాన్ని అడ్డుకోలేకపోతున్నారు. ప్రజల నిస్సహాయతను సొమ్ము చేసుకుంటూ వందరూపాయలకు దొరికే మందులను వేలు, లక్షల్లో అమ్ముకుంటున్న బ్లాక్‌మార్కెట్ దందాను నియంత్రించలేకపోతున్నారు. ప్రజలకు శాస్త్రీయమైన మార్గదర్శకాలను అందించకపోగా విశృంఖలమైన అశాస్త్రీయతను కుమ్మరించారు. ప్రజల జీవించే హక్కు కోసం కనీసం ఉచితంగా వ్యాక్సిన్ అందించలేకపోతున్నారు. ఎన్నికల మీద, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాల మీద, నల్ల చట్టాల రూపకల్పన మీద, కార్పొరేట్లకు లాభాలు చేకూర్చడం మీద చూపిన ఆసక్తి, పట్టుదల ప్రజల ప్రాణాల పట్ల చూపలేకపోతున్నారు. నిన్న ప్రఖ్యాత అంతర్జాతీయ ఇంగ్లీష్ జర్నల్ అవుట్‌లుక్ ''భారత ప్రభుత్వం కనబడటం'' లేదు అని ప్రజల తరుపున ముఖచిత్ర ప్రకటన చేసినా, నేడు ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ పక్షపత్రిక ఫ్రంట్‌లైన్ ''ఆపత్కాలానికి తగనివాడు''గా పేర్కొంటూ ప్రధాని ముఖచిత్రాన్ని ప్రచురించినా అందుకు కారణం ఈ ఘోరవైఫల్యాలే.
ఈ వైఫల్యాలన్నీ ప్రజల అనుభవంలోకొచ్చాక, ఏలినవారి నిజస్వరూపం క్రమంగా వారి ఎరుకలోకి వస్తున్న వేళ... మరో కొత్త నాటకానికి తెరతీసారు. ఈ ప్రతికూలతను నివారించేందుకు, ప్రభుత్వానికి లేని సానుకూలతను సృష్టించేందుకు ''పాజిటివ్ అన్లిమిటెడ్'' పేర నష్టనివారణకు పూనుకున్నారు. పోయిన ప్రతిష్టను నిలబెట్టుకునేందుకు ప్రజలనే నిందించజూసారు. ప్రజలూ, ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ అనర్థానికి కారణమంటూ కొత్త పల్లవి అందుకున్నారు. వైఫల్యాలను అంగీకరిస్తూనే సగం నెపం ప్రజల మీదకు నెట్టడం ద్వారా ప్రభుత్వ తప్పిదాలను చిన్నవిగా చూపేందుకు ప్రయత్నించారు. నిజానికి ఇందులో ప్రజల తప్పేముంది? వారు నాయకుడిని నమ్మారు. చప్పట్లు కొట్టమంటే కొట్టారు. దీపాలు పెట్టమంటే పెట్టారు. నాయకుడి ప్రచార వ్యామోహానికీ, ప్రణాళికారహిత లాక్డౌన్లకూ, ప్రయోజనంలేని జనతా కర్ప్యూలకూ తమ జీవితాలను మూల్యంగా చెల్లించారు. నాయకుడి ఎన్నికల ర్యాలీలకు రమ్మంటే వచ్చారు. చివరికి కుంభమేళాకు వెళ్లి గంగలో మునగమంటే మునిగారు. ఈ నమ్మకాన్ని వమ్ము చేసిందిగాక ఇంకా ప్రజలనే నిందిస్తే చెల్లదని గ్రహించారో ఏమో... ఇప్పుడు ఈ ''కన్నీరు'' కారుస్తున్నారు. కోవిడ్ లక్షలాదిమంది భారతీయుల ప్రాణాలను బలితీసుకుంది. కోట్లాదిమంది భారతీయుల కడుపు కొట్టింది. అదే సందర్భంలో ఈ ప్రభుత్వ చేతకానితనాన్నీ, నాయకుడు మహాశక్తివంతుడంటూ సాగుతున్న ప్రచారంలోని డొల్లతనాన్ని కూడా బట్టబయలు చేసింది. ఈ నాయకుడి పాలనకు నేటికి సరిగ్గా ఏడేండ్లు. ఈ ఏడేండ్లలో చివరికి ప్రజలకు మిగిలింది ఈ 'కన్నీరు' మాత్రమే....