Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత నెల రోజుల కాలంలో లాటిన్ అమెరికాలో జరుగుతున్న పరిణామాలు బావి ప్రపంచంలో ప్రగతిశీల శక్తుల బలాబలాల పొందికను మార్చేవిగా ఉన్నాయి. ఒకవైపు ప్రపంచం కోవిడ్ మహమ్మారి దాటికి తలుపులు మూసుకొంటోంది. దీనికి భిన్నంగా లాటిన్ అమెరికా దేశాలు పరస్పర సహకారం, సమన్వయం ఇచ్చి పుచ్చుకోవడం ద్వారానే కోవిడ్‌ను అధిగమించవచ్చని ప్రతిపాదిస్తున్నాయి. ఈ దిశగా ప్రాంతీయ సమీకృత సంస్థల ఏర్పాటుకు సిద్ధం అవుతున్నాయి. సెప్టెంబర్ 18న మెక్సికోలో లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల సహకారం పేరుతో 31దేశాల అధినేతలు సెలాక్ శిఖరాగ్ర సమావేశం జరిపారు. సమావేశం ముగింపులో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో మనం గొంతులను ఐక్యపర్చుకుందాం, మన ఐక్యతను పటిష్టం చేసుకుందాం, తద్వారా మనం నివసించే అన్యాయమైన ప్రపంచంలో మనం న్యాయంతో కూడిన దారిని తెలుసుకుందాం'' అని ఎలుగెత్తారు.
గతవారంలో జరిగిన లాటిన్ అమెరికా దేశాధినేతల సమావేశం క్యూబాపై అమెరికా దిగ్భంధనాన్ని ఖండిస్తూ తీర్మానించింది. 31 దేశాధినేతలతో కూడిన ఈ సంఘం ప్రాంతీయ ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాలల్లో విస్తృతమైన సహకారం దిశగా అడుగులు వేయాలని తీర్మానించింది. ఇందులో భాగంగా లాటిన్ అమెరికా దేశాల అవసరాలు తీర్చుకోవడానికి వీలుగా ప్రాంతీయ ఆరోగ్య నియంత్రణా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, లాటిన్ అమెరికా అంతరిక్ష పరిశోధనా ప్రయోగ కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించడం విప్లవాత్మకమైనవి. లాటిన్ అమెరికా పౌరులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడం లాటిన్ అమెరికా ఆరోగ్య నియంత్రణ సంస్థ కర్తవ్యంగా నిర్దేశించుకున్నది. వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవాలన్న విధానాలకు ఇది పూర్తి భిన్నం అయినది. అమెరికాకు చెందిన ఫేజర్ కంపెనీ ఉత్పత్తి చేసిన మిగులు వ్యాక్సిన్ డోసులను అధిక రేట్లకు వర్తమాన దేశాలకు ప్రత్యేకించి లాటిన్ అమెరికా దేశాలకు అంటగట్టాలని చేస్తున్న ప్రయత్నాలకు ఇది చెప్పుదెబ్బ. ప్రపంచంలోనే ప్రజా ఆరోగ్య సంరక్షణలో మణిదీపంగా వెలుగుతున్న క్యూబా ప్రజా ఆరోగ్య వైద్య విధానం, వైద్య పరిశోధనా రంగం లాటిన్ అమెరికా ఆరోగ్య అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషించడానికి ఈ నిర్ణయంతో మార్గం సుగమం అయింది.
అంతే విప్లవాత్మక స్వభావం కలిగిన నిర్ణయం లాటిన్ అమెరికా అంతరిక్ష పరిశోధనా ప్రయోగసంస్థ ఏర్పాటు. ఇప్పటి వరకు లాటిన్ అమెరికా అంతరిక్షంపై సామ్రాజ్యవాద అమెరికా పెత్తనం చేస్తున్నది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు లాటిన్ అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ ఏర్పాటు సామ్రాజ్యవాద అమెరికా ఆధిపత్యానికి విసురుతున్న సవాల్ ఈ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏర్పాటు. దీని నిర్వహణ కొనసాగింపునకు పలు అనుబంధ శాస్త్ర, సాంకేతిక రంగాలలో స్వావలంబన, వాణిజ్యేతర స్వభావంతో కూడిన అంతర్జాతీయ సహకారం కీలకం కానున్నాయి. ఈ రకమైన ఏర్పాటు శాస్త్ర సాంకేతిక రంగాలల్లో విద్యావంతులైన విద్యార్థులకు దేశీయంగానే మెరుగైన ఆదాయాలతో కూడిన ఉపాధి అవకాశాలు సృష్టించబోతున్నది. దీని పర్యావసానాలు లాటిన్ అమెరికా జాబ్ మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి.
లాటిన్ అమెరికా దేశాల కూటమి తీసుకున్న మరో నిర్ణయం ప్రకృతి వైపరీత్యాలను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి సంబంధించినది. దీనికి గాను స్వల్పకాలిక రుణాలు ఇవ్వాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను (ఐఎంఎఫ్) డిమాండ్ చేశాయి. గత మూడు నాలుగు దశాబ్దాలలో పలు దేశాలు అనేక కారణాలరిత్యా ఆర్థిక ఇబ్బందులకు గురై ఐఎంఎఫ్ సహకారాన్ని ఆశించినప్పుడు అదే అదునుగా తీసుకుని ఆయా దేశాలను నయా ఉదారవాద విధానాల ఊబిలోకి లాగటం ఆనవాయితీగా వస్తున్న పరిణామం. లాటిన్ అమెరికా దేశాధినేతల కూటమి ముందుకు తెచ్చిన ప్రతిపాదన నయా ఉదారవాద వ్యూహాలకు పూర్తి భిన్నమైనది. దీర్ఘకాలిక సంస్థాగత రుణాలకు బదులు స్వల్పకాలిక అవసరాలను తీర్చుకోవడానికి స్వల్పకాలిక రుణాలు ఇవ్వాలని లాటిన్ అమెరికా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై అటువంటి డిమాండ్‌ను భారతదేశంతో సహా ఇతర దేశాలు సమర్థించాల్సిన అవసరం ఉన్నది.
ఈ ప్రతిపాదనలు అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద అమెరికా పలుకుబడి మసక బారుతున్న తరుణంలో ముందుకు రావడం విశేషం. అఫ్ఘానిస్తాన్‌తో సహా గత మూడు దశాబ్దాలలో ప్రారంభించిన అన్ని యుద్ధాలలోను తన దీర్ఘకాల వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోవడంలో సామ్రాజ్యవాద అమెరికా విఫలం అయింది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అమెరికా ఒక వైపున అణు ఆయుధ కూటములను రూపొందించడంలో నిమగం అయితే లాటిన్ అమెరికాలోని వర్థమానదేశాలు వైద్య, ఆరోగ్యం, శాస్త్ర, సాంకేతిక ఫలాలు సాధ్యమైనంతగా ప్రజలకు అందుబాటులో తేవడానికి జట్టుకడుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధానంతరం ఉనికిలోకి వచ్చిన ఏక ధృవ ప్రపంచం స్థానంలో బహుళధృవ ప్రపంచం నిర్మాణం దిశగా సాగుతున్న ప్రయత్నాలకు, నయా ఉదారవాద ఊబి నుంచి బయటపడేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు లాటిన్ అమెరికా దేశాధినేతల కూటమి మరిన్ని జవసత్వాలు చేకూర్చనున్నది అనడంలో సందేహం లేదు.