Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి చూస్తుంటే.. ''కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న'' సామెతను తలపిస్తోంది. ప్రభుత్వం ఆర్టీసీకి కొత్తగా చైర్మన్‌ను, పూర్తిస్థాయి ఎండీని నియమిస్తే, కష్టాల్లో ఉన్న సంస్థను కాపాడుతారుకున్నాం. కానీ వారేమో ఈ నష్టాలు కొనసాగితే ప్రయివేటుకు అప్పగిస్తామని ముప్పును సూచిస్తున్నారు. ఈ మేరకు సాక్షాత్తూ ముఖ్యమంత్రిగారి నుండే గట్టి ఆదేశాలున్నాయని స్పష్టం చేస్తున్నారు. నాలుగు నెలల్లో బండి లాభాలబాట పట్టకుంటే జరగబోయేదేమిటో నిక్కచ్చిగా సెలవిస్తున్న నేతలు... అందుకు గల మార్గాలేమిటో, అనుసరించాల్సిన విధానమేమిటో చెప్పకపోవటం విడ్డూరంగా ఉంది.
అసలు ఆర్టీసీని నెలకొల్పిన ఉద్దేశాలు, లక్ష్యాల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడీ లాభనష్టాల చర్చకు అవకాశమే ఉండేది కాదు. సమాజ మనుగడకు కీలకమైన రవాణా వ్యవస్థలో ప్రజలకు చౌకగా సేవలందించడమే తప్ప, వ్యాపారం చేసి లాభాలనార్జించడం సంస్థ లక్ష్యం కాదనీ, ఆ రకమైన సేవలందించడం ప్రభుత్వాల కనీస బాధ్యతనీ నేతలు మరిచిపోవడం విచారకరం. అయినా ప్రభుత్వ తీరు చూస్తోంటే ఈ నష్టాలకు తమ యాజమాన్య బాధ్యతేమీ లేనట్టు, ఇందుకు కార్మికుల లోపాలు, ప్రజల ఆదరణ లేకపోవడమే కారణమైనట్టుగా కనబడుతున్నది. కానీ రోజుకు 16గంటలు పనిచేస్తున్న కార్మికుల వల్ల, సంస్థను కాపాడుకోవడానికి వారు చేసిన అనేక త్యాగాలూ పోరాటాల వల్లే ఆర్టీసీ నిలబడిందనేది అనుభవం చెపుతున్నది. ఇక ప్రజా జీవితంలో ఆర్టీసీ ఒక విడదీయలేని భాగమైపోవడం వారి ఆదరణకు తిరుగులేని నిదర్శనం.
విశేషమైన ప్రజాదరణతో, నిబద్ధత కలిగిన కార్మికుల శ్రమతో, లాభనష్టాలకతీతంగా కారుచౌకగా మారుమూల ప్రాంతాల ప్రయాణ అవసరాలు తీరుస్తూ కూడా అరవైవేల కోట్ల ఆస్తులతో 'ప్రగతి రథచక్రం''గా ప్రఖ్యాతినొందింది మన ఆర్టీసీ. అలాంటి సంస్థ నేడు మనుగడే ప్రశ్నార్థకమైన స్థితికి ఎందుకు చేరుకుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, సమస్య మూలాలను శోధించకుండా, నష్టాల పేరుతో సంస్థను నిర్వీర్యం చేయబూనడం, పదే పదే ప్రయివేటు పరం చేసేందుకు ప్రయత్నించడం ప్రభుత్వాలకు ఒక అనవాయితీగా మారింది. అయినా సంస్థ ప్రయివేటుదైనా, ప్రభుత్వానిదైనా దాని లాభనష్టాలకు బాధ్యత కార్మికులదా, యాజమాన్యాలదా? ప్రజా రవాణాలో పర్మిట్లను సరళతరం చేసి, ఆర్టీసీకి పోటీగా లాభదాయకమైన రూట్లలో ప్రయివేటు శక్తులకు స్టేజీ కారేజీలు నడుపుకునే అవకాశాలు కల్పించిందెవరు? ఒకవైపు ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకపోగా, మోయలేని భారాలు వేస్తూ, మరోవైపు ప్రయివేటు రంగానికి అపారమైన అవకాశాలూ, అనుమతులూ కల్పిస్తున్నదెవరు?
వీటన్నిటినీ మరుగునపెట్టి ప్రభుత్వరంగమంటే అసమర్థతకూ, ప్రయివేటురంగమంటే సమర్థతకూ ప్రతీకలైనట్టు చెపుతున్న పెద్దలంతా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మన రాజధాని నగరంలోనే ప్రఖ్యాత ప్రయివేటు వ్యాపార సంస్థ ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో చేపట్టిన ''హైదరాబాద్ మెట్రో'' ఎందుకు నష్టాల్లో ఉన్నట్టు? కోవిడ్ వల్ల మెట్రో నష్టపోయిందంటే ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు తక్షణమే నిపుణుల కమిటీ వేసిన సర్కారువారు, అదే కోవిడ్ ఆర్టీసీనీ నష్టపరిచిందని మర్చిపోయారా? ప్రయివేటు సంస్థ ఎల్ అండ్ టీకి ఇచ్చిన చేయూతను ప్రభుత్వరంగ సంస్థ ఆర్టీసీకి ఎందుకు ఇవ్వలేకపోతున్నట్టు? పైగా ఆ భారాన్ని చార్జీల పెంపురూపంలో ప్రజలపై ఎందుకు మోపుతున్నట్టు? ఏ రంగంలోనైనా లాభనష్టాలు యాజమాన్యాల నిర్వాహణా సామర్థ్యాలమీదా, పరిస్థితులకు అనుకూలమైన విధానాలమీదా ఆధారపడి ఉంటాయన్న సంగతి మన ప్రభుత్వ పెద్దలకు తెలియదనుకోగలమా..? నిజంగా ప్రజా సేవ పట్ల, ప్రజల ఆస్తుల పట్ల చిత్తశుద్ధి, అంకితభావం ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ వివక్ష తగునా..?
కేవలం మన రాష్ట్రం, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశమూ ప్రజా రవాణా సంస్థలను లాభాపేక్షతో నడపటంలేదు. సేవాలక్ష్యంతోనే నడుపుతున్నాయి. నష్టాలోచ్చినప్పుడు భరిస్తున్నాయి. ప్రత్యేకించి ఈ కరోనా కాలం ప్రపంచవ్యాపితంగా రవాణా రంగాన్ని మరింత అతలాకుతలం చేసిన మాట వాస్తవం. ఇందులో మనకూ మినహాయింపులేదు. కానీ అనేక దేశాలు, ప్రత్యేకించి మన ప్రభుత్వాలు ప్రతిదానికీ ఆదర్శంగా చెప్పుకునే అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి పెట్టుబడిదారీ అగ్రదేశాలు కూడా నేరుగా ఆర్థిక సహాయం అందించి ప్రజారవాణా వ్యవస్థను ఆదుకునే కృషి చేసాయి. అనేక దేశాలు ఇలా ఆదుకోవడమే కాదు, పలు రాయితీలు, పన్ను మినహాయింపులు, బెయిలవుట్లు ప్రకటించి, ఉచిత బస్ ప్రయాణాన్ని కూడా అనుమతించి ప్రజలలో నమ్మకాన్ని పెంచాయి. మన ప్రభుత్వాలు మాత్రం అలాంటి ప్రయత్నాలేవీ చేయకపోగా, ఉన్నఫళంగా చార్జీలు పెంచి, ఉన్న ఆక్యుపెన్సీని కూడా తగ్గించి ప్రజలను ఆర్టీసీకి దూరం చేయజూడటం ఏ ప్రయోజనాల కోసం? ఎవరి ప్రయోజనాల కోసం? అయినా రక్షణకు అవసరమైన విధానపరమైన చర్యలు చేపట్టకుండా కేవలం చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపినంత మాత్రన మన ఆర్టీసీ నష్టాల నుండి గట్టెక్కుతుందా? ప్రభుత్వమే కాదు, పౌరసమాజమూ ఆలోచించాలి...