Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరసన తెలపటం అనాదిగా ఉంది. సర్వం నిరంకుశమై వ్యాపించినా, ఎదురుతిరిగితే గొంతులు తెగిపోతాయని తెలిసినా అపసవ్యతపై, అన్యాయంపై, అనర్థంపై ఎదురుతిరిగే గొంతుకలు ఉదయిస్తూనే ఉంటాయి. సమాజపరిణామంలో ప్రతిదశలోనూ ఈ ప్రతిఘటన కొనసాగుతూనే ఉంది. నిరసన నిత్యం ప్రజ్వరిల్లుతూనే ఉంది. కుటుంబంలోనూ సమాజంలోనూ, ప్రకృతిలోనూ ప్రతి సందర్భంలోనూ తమకు నష్టము, కష్టము జరుగుతుందని తెలిసినప్పుడు నిరసన తెలపడం ఒక సహజ పరిణామం. ఆఖరికి మాటలురాని చిన్నపిల్లలు కూడా ఏడ్చిమరీ వ్యతిరేకత ప్రకటిస్తారు. కొద్దిగా పెద్దవాళ్ళయితే అలిగి అన్నం తినటం మానేస్తారు. ఇంకా పెద్దోళ్ళు వాదిస్తారు. నేనయితే ఒప్పుకోనని ఖరాఖండిగా చెప్పేస్తారు. సమాజలోనూ అంతే. ముందు చెబుతారు. అడుగుతారు. వద్దంటారు. వినకుంటే ఇంతమందికి నష్టం కలిగించేది ఎలా చేస్తారని నిలదీస్తారు. నిరసిస్తారు. వ్యతిరేకిస్తున్న సమూహపు బలాన్ని ప్రదర్శిస్తారు.
వాస్తవంగా కుటుంబ సభ్యుల అభిప్రాయాల కనుగుణంగా చర్చించి ఇంటి పెద్ద నడుచుకుంటే అన్నీ సజావుగా జరుగుతాయి. అదే ప్రజాస్వామిక లక్షణం. లేదంటే అలజడి రేగుతుంది. వ్యతిరేకత నిరసన దశ దాటితే తిరుగుబాటు జనిస్తుంది. సమాజంలోనూ అంతే. నిరసనను అర్థం చేసుకుని నాయకుడు, పాలకుడు, తన పొరపాట్లను, తప్పులను సరిచేసుకుంటే, తిరుగుబాటు జరుగకుండా వ్యవహారం కొనసాగుతుంది. లేదంటే పెద్దల అధికారాలకే ముప్పు వాటిల్లుతుంది. సాధారణంగా నిరంకుశ పాలకులు, అహం వీడని పెద్దలు, నిరసనను అర్థం చేసుకోకపోగా దాన్ని అణచాలని, అధికారాన్ని ఉపయోగించి అంతం చేయాలని చూస్తుంటారు. ఇది చరిత్రలోనూ మనం చూస్తాం. ఇక్కడే అందరూ పప్పులో కాలేసి కాల్చుకుంటారు. మీరు ఒక ఉదాహరణ చూడొచ్చు. ప్రెజర్ కుక్కర్పైని వాల్వ్‌ను మీరు ఉడుకుతుండగా ఒత్తిపట్టి ఉంచే ప్రయత్నం చేయండి, దెబ్బకు పేలి విలయాన్ని సృష్టిస్తుంది. ఇది ఫిజికల్ లాజిక్. సామాజికమయింది కూడా అంతే. వ్యతిరేకతను, నిరసనను అణచివేస్తే అది మరింత పెరుగుతుంది. విస్ఫోటిస్తుంది. చరిత్ర, సైన్సు నిరూపిస్తున్న అంశాలివి. ప్రకృతి కూడా దాని ధర్మాలకు విరుద్ధంగా విధ్వంసమొనర్చే ప్రయత్నాలు చేస్తే ఊరకనే ఉండదు. పర్యావరణ సమతుల్యతను నష్టపరిస్తే ప్రకృతి వైపరీత్యాలు తలెత్తుతాయి. మొదట ప్రకృతి చిన్న చిన్న సంజ్ఞలతోనే నిరసిస్తుంది. వినకుంటే, సరిచేసుకోకుంటే వరదలు, సునామీలు, కరువులు, కాటకాలు, విలయాలు సృష్టిస్తుంది. నేటి 'కరోనా' విధ్వంసం మన కండ్లముందు కనపడుతూనే ఉంది. దాని ఫలితాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాము.
ఇప్పుడు మనదేశాన ప్రజలందరికీ అన్నం పెట్టే రైతు నిరసనోద్యమం చేపట్టి మూడువందల రోజులు దాటింది. ఇది చరిత్ర సృష్టిస్తోన్న నిరసనలివి. ఎండనకా, వాననకా, ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా నిర్బంధాలు, నిందలు మోపినా, ఏడువందల ప్రాణాలను ఎగరేసిన నిరసన పతాక రెపరెపలివి. వ్యవసాయమే జీవాధారంగా తరతరాలుగా కష్టపడుతున్న రైతాంగం తమ బతుకులను, వ్యవసాయ రంగాన్ని ప్రయివేటుకు ధారాదాత్తం చేసే మూడు చట్టాలను రద్దు చేయాలని చేస్తున్న నిరసనలివి. వాళ్ళే కాదు శాస్త్రవేత్తలు, మేథావులు, ప్రజా ఉద్యమ నేతలు, వ్యవసాయ రంగ నిపుణులు, ప్రజలు అందరూ ఈ చట్టాలు రైతుకుగానీ, దేశానికిగానీ మేలు చేయవని చెబుతున్నా పాలకులు వినటం లేదు. అంతేకాక ప్రజల నిత్యావసరమైన విద్యుత్తు సంస్థల్ని, ప్రభుత్వ సంస్థల్ని ప్రయివేటు కార్పొరేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం తగదని, అన్యాయమని ఘోషిస్తూ చేస్తున్న నిరసన శిఖరాగ్రానికి చేరింది. ఇప్పుడది దేశం మొత్తం ఒక రోజు తమ తమ కార్యకలాపాలని స్తంభింపజేయ పూనుకుంది.
నిరసన సమూహాలు వందకోట్లుగా ముందుకొచ్చి కనపడకపోవచ్చు. నిరనసనకు మద్దతుగల జనమెందరో తమ తమ నెలవుల్లోంచే సంఘీభావం తెలుపబోతున్నారు. ఈ రోజు కేవలం రైతులే కాదు, ఈ దేశ సంపదకు కారకులైన శ్రామికులపై కూడా దాడి జరుగుతోంది. ప్రజాజీవనం ధరల బరువులతో తల్లడిల్లుతోంది. యువత భవిష్యత్తుకు భరోసా లేకుండా పోయింది. నిరుద్యోగం తాండవిస్తోంది. ఇవన్నీ ఒకవైపు అయితే మహిళలపై దాడులు, మూఢ విశ్వాసాలు, మత మౌఢ్యాలు, మత ఘర్షణలు, కులపీడన ఈనాడు విపరీతంగా పెరిగింది.
వీటన్నింటికి వ్యతిరేకంగా రేపు చేయబోయే భారత్ బంద్‌తో ఒక మహానిరసన తెలుపుతోంది దేశ జనం. ఇప్పటికయినా ప్రభుత్వం తమ తప్పుడు నిర్ణయాలను వెనక్కు తీసుకుని సరిచేసుకోవాలి. లేకుంటే నిరసన స్వరమే యుద్ధశంఖారావాన్ని పూరిస్తుంది. తిరుగుబాటు బావుటాను ఎగరేస్తుంది. సకల జనుల చైతన్య బలిమి ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది.