Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మహిళల్లారా ఏకం కండి.. పోరాడితే పోయేదేం లేదు. సంకెళ్లు తప్ప. న్యాయవ్యవస్థలో యాభైశాతం రిజర్వేషన్ల కోసం నిస్సహాయతతో కాక ఆగ్రహంతో గొంతెత్తండి. మీ డిమాండ్‌ను బలంగా వినిపించండి. రిజర్వేషన్లు దయతలచి ఇచ్చేవి కావు. అది మీ హక్కు' అని మహిళా సంఘం నేతలో, కమ్యూనిస్టు పార్టీల నాయకులో అన్న మాటలు కాదు.. స్వయనా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్న వ్యాఖ్యలు. సుప్రీంకోర్టులోని మహిళా న్యాయవాదులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీజేఐ మాట్లాడుతూ కార్ల్‌మార్క్స్ నినాదాన్ని ఉటంకించారు. దాన్ని కొద్దిగా మార్చి చెప్తానంటూ మహిళలకు అన్వయిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
నడుస్తున్న చరిత్రలో మహిళా సాధికారత సందర్భసహిత నినాదం. ఇది పరిపూర్ణం కావాలని అవిశ్రాంత కృషితో మహిళాలోకం ఎన్నో ఏండ్లుగా కలలు కంటోంది. సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలు మానసికంగా, భౌతికంగా సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. అప్పుడే సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. మన సమాజంలో నెలకొన్న అసమానతలతో పనిచేసేచోట, ఉద్యోగ వ్యవస్థలో వారు నిత్యం వివక్షను ఎదురుకుంటున్నారు. చివరికి లైంగికదాడులు, హత్యలు నిత్యం మనం వింటున్నాం.. కంటున్నాం. వాస్తవానికి ఇవి రూపుమాపేలా వ్యవస్థీకృత మార్పులు రావాల్సి ఉంది. పదునైన చట్టాలు అమలుతోపాటు మనుషుల ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, అడుగుజాడల్లో మార్పురావాలని అనుకోవడం అభిలషణీయం. కానీ మన దేశ పాలకులు మాత్రం ''మహిళలకు పట్టాభిషేకం చేస్తాం, నీరాజనం పలుకుతాం'' అన్న డైలాగులు మినహా, చట్టసభలల్లో 33శాతం మహిళా రిజర్వేషన్ అమలును మాత్రం వాయిదా వేస్తున్నారు. వాస్తవానికి మహిళలను హీనంగా చూసే మనువాద విష సంస్కృతి వారిది. చట్టాలను చేయడంలో కానీ, వాటిని అమలులో కానీ ఇసుమంతేనా చిత్తశుద్ధి ఉండదు.
చట్టాలు సక్రమంగా అమలు జరిగితే భారతదేశంలో మహిళల పట్ల వివక్ష, లైంగికదాడులు కొంతైనా అరికట్టగలిగేవారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీముగ్గురు స్త్రీలలో ఒకరు శారీరక, లైంగిక హింసను ఎదుర్కొంటున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మనదేశంలో భ్రూణహత్యలు, లింగవివక్ష, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, వరకట్నం, గృహహింస, అణచివేత పేరిట మహిళాలోకంపై ఎడతెరిపిలేని దాడి జరుగుతోంది. మహిళా హక్కులు అనేవి వేల ఏండ్లుగా కొనసాగుతున్న అణచివేతకు సంబంధించిన అంశమని సీజేఐ అన్నారంటే సాంస్కృతికంగా మనదేశ స్థాయి ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు. డబ్బు, అధికారమే పరమావధిగా ఉన్న ప్రస్తుత రాజకీయ సంస్కృతి తమని తాము నిరూపించుకుంటున్న మహిళల అవకాశాలకు అవరోధం.. ఆటంకం అనే విషయం స్పష్టమవుతుంది. ''కొన్ని వాస్తవాలను ఆలస్యంగా గ్రహిస్తాం. ఇది చాలా దురదృష్టకరం. న్యాయవ్యవస్థలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ కల నిజం అయితే నేను చాలా సంతోషిస్తాను' అని వ్యాఖ్యానించారు. అంతే కాదు మహిళలకు రిజర్వేషన్ డిమాండ్‌కు తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని సీజేఐ ప్రకటించడం అభినందనీయం.
సీజేఐ వ్యాఖ్యలతోనైనా పాలకులు కండ్లు తెరవాలి. 1993లో 73, 74 రాజ్యాంగ సవరణలతో మహిళలకు స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించారు. అయినా మహిళాసాధికారతకు దోహదపడే చట్టసభలో 33శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి నోచుకోవడం లేదు. మహిళలకు ఇంటా బయటా సమానావకాశాలు, సమాన హక్కులు కల్పించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. సమాజంలో జరిగే ఏ అభివృద్ధి అయినా మహిళలు పాల్గొనకుండా అది విజయవంతం కాజాలదు. రాజకీయలలో మహిళల ప్రాధాన్యం పెరగటం వల్ల రాజకీయ సంస్కృతి కూడా త్వరగా మారుతుంది. ఈ దిశగానే ప్రభుత్వాలు, పాలకులు చొరవ చూపినప్పుడే అది ఫలవంతమవుతుంది. సమాజ సహకారం మహిళాభ్యున్నతికి సోపానంలాంటిది. మన చట్టసభల్లో పురుషులకు దీటుగా ప్రాతినిధ్యం కొరవడటం ప్రతిబంధకమవుతోంది. వారి భాగస్వామ్యం, వాయిస్ పెరిగితేనే ఫలవంత చర్చకు దారితీస్తుంది. చట్టసభల్లో ప్రతిచోటా వారికున్న రిజర్వేషన్లు పెంపుదల, ఆచరణాత్మకంగా చూపటం పాలకులు, ప్రభుత్వాల సంకల్పమైతే మహిళాభ్యుదయం ద్విగుణీకృత అవుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఓట్లు సాధించే మంత్రంగా కొన్ని రాజకీయపార్టీలు పరిగణించడం గర్హనీయమైన అంశం కదా! రాజకీయాలకు అతీతంగా ఇప్పటికైనా పాలకులు కలిసికట్టుగా వ్యవహరించి మహిళల అభ్యున్నతికి పాటుపడాలి. రిజర్వేషన్ల అమలులో వివక్షను రూపుమాపేందుకు వినూత్న చర్యలు మరిన్ని తీసుకోవాలని మహిళాలోకం ఆశిస్తోంది. జాతి నిర్మాణంలో వారిని భాగస్వాముల్నిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ దిశగా చోరవచేసి సీజేఐ ఈ వ్యాఖ్యలు చేయడం ఆహ్వానించదగ్గ విషయం.