Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశమంతా నిరసన స్వరమై మ్రోగిన సోమవారంనాటి 'భారత్ బంద్' మారుతున్న రాజకీయ పున:సమీకరణలకు సంకేతంగా నిలిచింది. వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ల హస్తగతం చేసే నిరంకుశ పోకడలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు తిరుగులేని హెచ్చరిక చేసింది. ప్రత్యేకించి ప్రధాని మోడీ ఏకచ్ఛత్రాధిపత్యానికి ఎదురులేదనే ఒక అబద్దపు వాతావరణాన్ని సృష్టించే పన్నాగాలను పటాపంచలు గావించింది. విస్తృత ప్రజా భాగస్వామ్యంతో పాటు, పాలకపక్షం ప్రతిపక్షం అన్న తేడాలేకుండా 19 బీజేపీ యేతర రాజకీయ పార్టీలను, ఆరు రాష్ట్రప్రభుత్వాలను ఒక్కతాటిపైకి తెచ్చిన ఈ బంద్ నిస్సందేహంగా భారత రాజకీయాలకు కీలకమైన మలుపు. పది మాసాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పెల్లుబుకుతున్న రైతన్నల నిరసన, తమ నిర్లక్ష్యంతో దానికదే నీరసిస్తుందని భావించిన ఏలికల వ్యూహాలకు ఇది ఎదురుదెబ్బ అని కూడా చెప్పవచ్చు. వెన్నుచూపని అన్నదాతల పోరాటానికి దేశమంతా సంఘీభావమై నిలిచిన ఈ సందర్భం అత్యంత ఉత్తేజకరమైనదే కాదు, అంతకు మించి చారిత్రాత్మకమైనది కూడా.
ఈ బంద్‌కు ఇంతటి సార్వజనీనమైన మద్దతు లభించడానికి అది లేవనెత్తిన సమస్యలూ, వాటి నుండి ఉత్పన్నమైన డిమాండ్లే కారణం కావడం గమనార్హం. ప్రజలంతా కరోనా కోరల్లో విలవిలాడుతున్న సమయాన్ని అదునుగా భావించి మూడు నల్లచట్టాలను తెచ్చిన కేంద్రం చర్య అందరికీ తెలిసిందే. దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలకు జీవనాధారమైన వ్యవసాయరంగాన్ని కొద్దిమంది కార్పొరేట్లకు కట్టబెట్టే కుతంత్రాలకు ప్రతీకలు ఈ వ్యవసాయ చట్టాలు. రాజ్యాంగ విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ, అత్యంత అప్రజాస్వామికంగా, రాజ్యసభ బిజినెస్ రూల్స్‌ను సైతం లెక్కచేయకుండా రైతుల పాలిట ఉరితాళ్లుగా ప్రభుత్వం ఈ చట్టాలు తెచ్చింది. దేశంలోని 2384 రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డులు, 4887 సబ్ యార్డులు, ఎ.పి.ఎం.సీ.లు నోటిఫై చేసిన, ఈ-నామ్‌తో అనుసంధానం చేయబడిన వేలాది మార్కెట్ యార్డులు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న దాదాపు 20,000పై చిలుకు చిన్న చిన్న మార్కెట్ యార్డులతో సహా, సమస్త మార్కెటింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఈ చట్టాలు అంతిమంగా వ్యవసాయాన్ని కార్పొరేట్ మార్కెట్ శక్తులకు స్వాధీనం చేస్తాయన్నది నిపుణుల విశ్లేషణ. చివరికి మరే గత్యంతరం లేక, ఎం.ఎస్.పి. (కనీస మద్దతు ధర)తో కూడా నిమిత్తం లేకుండా కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు సాగిల పడవలసిన దుర్గతి తెచ్చిపెడతాయన్నది రైతుల అనుభవం. కనుక ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతుల పరిస్థితి, ఈ చట్టాలతో పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారనుందన్న సత్యాన్ని గుర్తించిన భారత రైతాంగం సకాలంలో మేలుకుని ఢిల్లీ సరిహద్దుల్లో మొహరించింది. భారత స్వాతంత్య్ర పోరాటం తరువాత తిరిగి అంతటి జాతీయోద్యమంగా ప్రపంచాన్ని అబ్బుర పరుస్తోంది. అయినా మోడీ సర్కారు మాత్రం కార్పొరేట్ల కనుసన్నల్లో మొద్దు నిద్ర నటిస్తోంది.
ఈ నేపథ్యంలో గత పది మాసాలుగా నిరసన పతాకలై ఎగిసిపడుతున్న అన్నదాతలు, తమ ఐదువందల నలభై సంఘాల సంఘటిత రూపమైన ''సంయుక్త్ కిసాన్ మోర్చా'' ద్వారా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడంతో పాటు, కార్మికవర్గ రక్షణ కవచాలైన కార్మికచట్టాలన్నిటినీ కాలరాసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్మిక కర్షక మైత్రికి తోడు సమస్త భారత ప్రజలకు మోయలేని గుదిబండలుగా మారిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరాభారాలపైనా గళమెత్తడంతో సమస్త ప్రజల సమస్యల సమాహారమైన ఎజెండాగా ఈ ''భారత్ బంద్'' ఓ చారిత్రిక విజయాన్ని నమోదు చేసింది.
కానీ, ఈ రైతు ఉద్యమాన్ని కేవలం ఉత్తరాదికి చెందిన నాలుగైదు రాష్ట్రాలకే పరిమితమైనదిగా చిత్రీకరించ జూస్తున్న కేంద్రం, ఈ దేశవ్యాపిత స్పందనలను నిలువరించేందుకు అడుగడుగునా నిర్బంధాలకు పూనుకుంది. నిత్యం ఫెడరల్ స్ఫూర్తి గురించి నీతులు వల్లించే తెలంగాణ ప్రభుత్వం కూడా బంద్‌కు కనీస మద్దతు తెలుపకపోగా, నిరసనకారుల అక్రమ అరెస్టులకు పాల్పడం చూస్తుంటే బీజేపీకి బీ టీంగా వ్యవహరిస్తోందా అన్న సందేహం వస్తోంది. రాష్ట్రంలో బంద్‌ను విఫలం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలనూ వాటి ప్రభావాన్నీ మనం కళ్లారా చూసాం. అయినప్పటికీ ఆంక్షల సంకెళ్ళను ఛేదించుకుని ఆసేతు హిమాచలం ఒకటిగా కదం తొక్కడం బంద్ విజయానికి సంకేతం. వ్యవసాయరంగ పరిరక్షణ కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం ''సమస్త ప్రభుత్వరంగాన్నీ కాపాడుకోవాలంటే మోడీ గద్దె దిగాలి'' అనే దిశగా రూపుదిద్దుకోవడమే కాదు, కార్మిక కర్షక మైత్రిని పటిష్టమొనర్చింది. ఈ బంద్ నయా ఉదారవాద విధానాలను ఎండగట్టడమే కాదు, భావి కార్యాచరణకు దారులు వేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజాపక్షం వహించే శక్తులకూ, ప్రత్యామ్నాయ రాజకీయాలకూ దిశానిర్దేశం చేసింది.