Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆర్నెలు కాపురం చేస్తే వారు వీరవుతార''ట! మోడీ సాబ్‌ని ఎవరైనా వేలెత్తి చూపుతే ఆ వేలు భారతదేశంపైకెత్తినట్లేనట! చూపిన ఆ వేళ్లను, వాటి ఓనర్లందర్నీ ఏకంగా 'రాజద్రోహం' కేసులు పెట్టి శ్రీకృష్ణ జన్మస్థానంలో భర్తీ చేస్తున్న తీరు మనం గమనిస్తూనే ఉన్నాం. ''పద్నాలుగు ఆరు నెల్లు''దాటి అంటకాగుతున్న కాపురం కదా! వీరిలో వారు పరకాయ ప్రవేశం చేయడంలో ఆశ్చర్యమేముంది? కేసీఆర్‌ని విమర్శిస్తే ''రాజద్రోహం'' కేసులు మోపుతామని మొన్ననే పుత్రరత్నం చెప్పారు. నేడు కేసీఆర్‌ని తిడ్తే తెలంగాణాన్ని తిట్టినట్టేనని సదరు అమాత్యుని వ్యాఖ్యానం రాష్ట్రానికి శాపాలు పెట్టొద్దని, దాని బ్రాండ్ ఇమేజిని చెడగొట్టొద్దని కోరారాయన.
అధికారం కోసం 'తెలంగాణ' జపం చేసేవారి సంగతేమోగాని నిజాయితీగా తెలంగాణ పురోభివృద్ధి కోసం పరితపించే వారి విమర్శ మాత్రం తెలంగాణ కోసమే! తెలంగాణలోని కోట్లాది సామాన్యుల కోసం! కష్టజీవుల కోసం. వారి తపన మట్టికోసం కాదు. మనుజుల కోసం. విధానాలు మారకుండా పార్టీల రంగులు మారి, పాలించే వారి మొహాలు మారితే వొరిగేదేముంది?
''కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేస్తున్న సీఎం''ను ఎవరూ పల్లెత్తుమాట అనకూడదని చిన్నసారు బరిగీశాడు. అది దాటేవారంతా తెలంగాణ ద్రోహులట! ప్రపంచానికి భారతదేశాన్ని ఆదర్శంగా మోడీ తయారు చేశాడనో, చేస్తున్నాడనో ''భక్తులు'' ప్రచారం చేసినట్లే దేశానికి తెలంగాణ 'ఆదర్శమని' కేటీఆర్ ప్రచారం. ''ట్రాక్టర్ నుండి హెలికాప్టర్ దాక, ఎర్ర బస్సు నుండి ఎలక్ట్రిక్ బస్సు దాకా, అక్కడి నుంచి ఎయిర్ బస్సుదాక'' తెలంగాణలో తయారవుతున్నాయని సమాసాలంకృతంగా చెప్పింది బానే ఉంది. కాని, ట్రాక్టర్లు తయారు చేసే హెచ్.ఎమ్.టి. డివిజన్ ఏనాడో బందైపోయింది. మహీంద్రాలో ట్రాక్టర్లు తయారు చేసుకుని ఏడేండ్లకు పైనుండి తమ లాభాలకు తామమ్ముకుంటున్నారు. దానికీ తమరి టి.ఎస్.ఐ.పాస్‌కు సంబంధం లేదు మంత్రిగారూ! ఇక ఎర్రబస్సులు తయారుచేసే బిబియూను తమరే దాదాపు బంద్ పెట్టారు కదా! మూడు, నాలుగు సంవత్సరాల నుండి ఒక్క బస్సూ కొనలేదు. సంవత్సరానికి 650 బస్సులు ఫ్యాబ్రికేట్ చేయగల బిబియూను ఎందుకు పడావు పెట్టారో చెప్పగలరా? ఇక ఎలక్ట్రిక్ బస్సులంటారా, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న 40 ఎలక్ట్రిక్ బస్సులూ ఈ రాష్ట్రంలో తయారైనవికావు. ఒక చైనా కంపెనీ నుండి ఒక పెద్దమనిషి కొనుక్కుని తిప్పుతూంటే మన పిక్కెట్ డిపోలో పుక్కట్లో చార్జింగ్ పెడ్తారు. మోడీ సర్కారు సదరు పెద్దమనిషికి బస్సుకి కోటి రూపాయలు చొప్పున 40కోట్ల రూపాయలు కట్టబెట్టారు. ఇక ఎయిర్‌బస్‌ల తయారీ ఊసే మన రాష్ట్రంలో లేదు. ''బొంకరా! మంకెన్నా అంటే మా ఊరి మిరియాలు తాటికాయంత'' అన్నట్లు లేదా?!
టి.ఎస్.ఐ.పాస్ వల్ల సులభంగా కొందరు యజమానులకు అనుమతులు లభించడం నిజమే కావచ్చు. సులభతర వ్యాపారంలో మన రాష్ట్రం కార్మికుల్ని నలిపేస్తే అదే బంగారు తెలంగాణానా? దీనికి చంద్రబాబు చెప్పిన స్వర్ణాంధ్రప్రదేశ్‌కు ఏమైనా తేడా ఉందా? ఎన్.ఎస్.ఎస్.ఒ. డేటా ప్రకారం రాష్ట్రంలోని మొత్తం రైతు కుటుంబాల్లో 91.7శాతం అప్పుల్లో కునారిల్లుతున్నారు. దేశవ్యాపితంగా రైతు కుటుంబాల సగటు అప్పు రూ.74,121 కాగా, తెలంగాణలో అది రూ.1,52,113గా ఉంది. 41.3శాతం మంది రైతులు వడ్డీ వ్యాపారుల చేతుల్లో బందీలుగా ఉన్నారు. అధిక వడ్డీలు కట్టలేక రైతులు కూలీలుగా, బిచ్చగాళ్ళుగా మారుతున్నారు. రాష్ట్రంలో 20రోజులకు పైగా సాగిన 'కార్మిక గర్జన'' పాదయాత్రలో బయల్పడిన కార్మిక సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయి. హైదరాబాద్ చట్టూ ఉన్న పారిశ్రామికవాడల్లోనే 12గంటల పనిదినం యధేచ్ఛగా సాగిపోతోంది. బోర్డులే లేకుండా అనేక పరిశ్రమ లున్నాయి. కాళ్ళు, చేతులు తెగిపోయినా, ఒళ్ళంతా కాలిపోయినా పట్టించుకునే నాథుడేలేడు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి పరిస్థితి, వర్క్‌మెన్ కాంపెన్సేషన్ చట్టం (1923) రావడానికి ముందటి పరిస్థితి అనేకచోట్ల కన్పడింది. ఇదంతా సులభతర వ్యాపారం కోసం పెట్టే పరుగులో కనుమరుగైపోతోంది. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలన్నీ కలిపి సుమారు 1.50లక్షలు. వీటిలో చాలా అప్పుదొరక్క, కరెంటు చార్జీలు భరించలేక, మార్కెటింగ్ సౌకర్యంలేక మూసివేతకి దగ్గర్లో ఉన్నాయి.
రాష్ట్రాన్ని, రాష్ట్ర పురోగతిని అడ్డుకుంటున్నది కేంద్ర ప్రభుత్వ విధానాలు. వాటితో ఘర్షణ పడటానికి టీఆర్ఎస్ సర్కార్ సిద్ధపడాలి. నాటి నోట్లరద్దు, జీఎస్టీల మొదలు నేటి ప్రయివేటీకరణల వరకు రెండు చేతులు జాపి ఆహ్వానిస్తే చితికిపోయేవి తెలంగాణలోని సామాన్యుల బతుకులే. తాము ''స్టార్టప్'' అంటుంటే కేంద్ర ప్రభుత్వం ''ప్యాకప్'' అంటోందని దెప్పిపొడవడమేనా దాన్ని ఆపడానికి ఏమైనా చేసేదుందా? ఎప్పుడో మూతపడ్డ హెచ్.ఎమ్.టి., ఐ.డీ.పీ.ఎల్.లే కాదు, నేడు వధ్య శిలపై కేంద్రం నిలబెట్టిన బీఎస్ఎన్ఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల గురించి టీఆర్ఎస్ సర్కార్ రంగంలోకి దిగితే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడ్డట్లు లెక్క!