Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలు బహుముఖ కోణాల్లో అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రభావితం చేయనున్నాయి. ఈ పరిణామాలకు ఇండో పసిఫిక్ అని పిలువబడే దక్షిణాసియా ప్రాంతం వేదికగా మారింది. దక్షిణాసియా రాజకీయ పరిణామాలకు అఫ్ఘానిస్తాన్ పరిణామాలు కేంద్రంగా ఉన్నాయి. ఇరవైయేండ్ల పాటు ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో సామ్రాజ్యవాదులు అంతర్జాతీయంగా సాగించిన ఆయుధ వ్యాపారంతో నిన్న మొన్నటి వరకు అమెరికాతో పాటు జర్మనీ, ఫ్రాన్స్‌లు కూడా లాభాల పంట పండించుకున్నాయి. ఉత్తర అట్లాంటిక్ సంధి (నాటో)లో ఇంగ్లాండ్, అమెరికాలతో పాటు ఫ్రాన్స్, జర్మనీలు కూడా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు కొన్ని సంవత్సరాలుగా నిర్మితమవుతూ ఉన్న యూరోప్ - అమెరికా (టాన్స్ అట్లాంటిక్) సామ్రాజ్యవాద కూటములు రూపాలు మార్చుకుంటూ ముందుకు వస్తున్నాయి.
ట్రంఫ్ పాలనాకాలంలో అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో మౌలికమైన మార్పు వచ్చింది. ఇప్పటి వరకు ట్రాన్స్ అట్లాంటిక్ కూటమిగా ప్రపంచంపై ఆధిపత్యం కలిగిఉన్న దేశాలు రానున్న కాలంలో పరస్పరం పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కాలంలోనే అమెరికా చైనా ప్రభావాన్ని నివారించే లక్ష్యంతో చతుర్ముఖ వ్యూహాన్ని (క్వాడ్) ప్రతిపాదించింది. భారతదేశం కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నది. వేగంగా విస్తరిస్తున్న ఆయుధ వాణిజ్యం ద్వారా దేశీయ ప్రయివేటు కంపెనీలకు లబ్దికలిగించే ప్రయత్నంలోనే భారతదేశం రక్షణ రంగాన్ని ప్రయివేటు రంగానికి అప్పగించేందుకు సిద్ధం చేసింది. ఈ నిర్ణయాన్ని అమెరికా ప్రతిపాదించిన చతుర్ముఖ వ్యూహం నుండి విడదీసి చూడలేం. ప్రపంచం అంతా ఈ చతుర్ముఖ రక్షణ వ్యూహం రూపం సారం తీరుతెన్నులు తెలుసుకునే ప్రయత్నంలో మేధోమథనం చేస్తుంటే ఉన్న ఫలంగా అమెరికా నాయకత్వంలో ఆకుస్ కూటమి రూపుదిద్దుకున్నది.
ఆకూస్ అంటే ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా మధ్య కుదిరిన మూడు ముళ్ళ బంధమే. ఈ ఒప్పందంలో భాగంగా ఆస్ట్రేలియా శాంతి భద్రతలు నెపంతో అమెరికా అణు ఆయుధం సామర్థ్యం కలిగిన నావికా దళాన్ని ఆస్ట్రేలియా ఓడరేవుల్లో తిష్టవేయించేందుకు అంగీకారం కుదిరింది. అప్పటి వరకు ఆస్ట్రేలియాకు అణు ఆయుధం సామర్థ్యం కలిగిన జలంతర్గామాలు అమ్మేందుకు ఫ్రాన్స్ దఫదఫాలుగా చర్చలు జరిపింది. చర్చలు పూర్తి అయి ఒప్పందం తుది రూపం తీసుకుంటున్న తరుణంలో ఫ్రాన్స్‌ను ఎడంకాలుతో తన్నెసిన అమెరికా ఈ కాంట్రాక్టును సొంతం చేసుకుంది. దీనితో అమెరికాకు, జర్మనీ, జపాన్‌లకు మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన అంతరాలు మరింత తీవ్రమైనాయి. కోవిడ్ సమయంలో చైనా నుండి ఫ్రాన్స్‌కు చేరాల్సిన వైద్య పరికరాలతో కూడిన విమానాన్ని ప్యారిస్ విమానాశ్రయం నుండి అమెరికా ఎగరేసుకుపోవడం, అఫ్ఘానిస్తాన్‌లో యూరోపియన్ సైనికుల భద్రతతో సంబంధం లేకుండా అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకోవడం, అఫ్ఘానిస్తాన్‌లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాలిబాన్లతో జరిగిన చర్చలలో జర్మనీ, ఫ్రాన్స్‌లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో రానురాను అంతర్జాతీయ సంబంధాలలో ఆటవిక నీతి రాజ్యం ఏలుతున్నదని ఫ్రాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ప్రత్యేకంగా తన ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం తనదైన ఇండ్ పసిఫిక్ వ్యూహాన్ని ప్రతిపాదించింది. అంతర్జాతీయంగా ముందుకు వస్తున్న బహుముఖ సవాళ్ళను అధిగమించేందుకు అటువంటి వ్యూహం అవసరమని యూరోపియన్ యూనియన్ స్పష్టం చేసింది. అమెరికా, యరోపియన్ యూనియన్లు తమ సైనిక వ్యూహాలకు ఏ పేరు పెట్టినా వాటి లక్ష్యం ఒక్కటే.. ఆలక్ష్యమే చైనాని కట్టడి చేయడం. ఈ పరిణామాలు దక్షిణాసియా శాంతి భద్రతలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయి. చైనాను నియంత్రించే పేరుతో దక్షిణాసియాను యుద్ధ ఉధృక్త ప్రాంతంగా మార్చేందుకు సామ్రాజ్యవాద దేశాలు ప్రయత్నిస్తున్నాయి. చైనాను లక్ష్యంగా చేసుకోవడం అంటే ఆ సెగ తమనూ తాకుతుందని రష్యా గుర్తించింది. దీనికి భిన్నంగా భారతదేశం మోడీ నాయకత్వంలో చైనా పట్ల గట్టి వ్యతిరేకతను ప్రదర్శిస్తూ సామ్రాజ్యవాద దేశాల చేతుల్లో పావుగా మారుతోంది. ఇప్పటికే మలబార్, ఆఫ్రికా విశ్వాసాల పేరుతో సాగుతున్న కసరత్తులో అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ల భాగస్వామ్యం పెరిగింది. భారతదేశ స్థానం రాను రాను జూనియర్ భాగస్వామి స్థాయి నుండి దిగజారి సబ్ జూనియర్ స్థాయికి పడిపోయింది. ఆసియా ప్రాంతంపై ఆర్థిక, రాజకీయ, సైనిక ఆధిపత్యం సంపాదించుకునేందుకు ఒకవైపు అమెరికా, మరోవైపు యూరప్ తెగబడుతున్నాయి. సూత్రబద్ధమైన దౌత్య విధానాలకు తిలోదకాలు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వ నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ వ్యవహారాలు అంతకంతకూ ఒంటరిపాలవుతున్నది. ఇది దేశానికి, దేశాభివృద్ధికి, శాంతిభద్రతలకు క్షేమకరం కాదు. చైనాను లక్ష్యంగా చేసుకుని అమెరికా రకరకాల కూటముల పేరుతో ఆయుధాల గుట్టలను పోగుచేస్తున్నది. ఇది కూడా ఏ ప్రాంతానికైనా నష్టదాయకమే. చైనా కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా మేము ఎవ్వరిజోలికి పోము మామీదకి వస్తే ఊరుకోము అని స్పష్టమైన ప్రకటన చేసినా అమెరికా రెచ్చకొట్టేందుకు పూనుకోవడం ప్రపంచశాంతికి నష్టం.