Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంజాబ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ బలహీనతను మరోమారు బట్టబయలు చేస్తున్నాయి. మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలు, ఆ తరువాత సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉండగా నూతన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్ని, పీసీసీి అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధు పీకల్లోతు అంత:కలహాల్లో మునిగిపోయారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హౌంమంత్రి అమిత్‌షాతో సమావేశమైనారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్‌బై చెప్పనున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇది ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ల లోనూ ఇదే స్థితి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుత ముఖ్యమంత్రులపై కాంగ్రెస్ పార్టీలోనే ఇతర గ్రూపులు కత్తులు నూరుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఈ తరహా ఆధిపత్య పోరును అదుపు చేయడంలో అధినాయకత్వం వైఫల్యం చెందిన కారణంగానే మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. అసోంలోనూ ఇదే స్థితి. 2015లో అప్పటి ముఖ్యమంత్రి తరుణ్ గొగోరుతో ఉన్న గొడవల కారణంగా బయటకు వెళ్లిన హిమాంత బిశ్వశర్మ కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యగా మారారు. అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయడానికి ఈ పరిణామం దోహదం చేసిందన్నది పరిశీలకుల అభిప్రాయం. ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరిగిన పోరు బీజేపీకి ఎలా లాభించిందో కర్నాటకలో ఇటీవలే చూశాం. సాక్షాత్తు కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోనూ కాంగ్రెస్ గ్రూపుల పోరు బీజేపీకి లబ్ధి చేకూర్చేదిగా మారుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో!
ఒకప్పుడు జాతీయోద్యమానికి నాయకత్వం వహించి, స్వాతాంత్య్రాన్ని సాధించిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీ చేసిన స్వయంకతాపరాధాలే ఆ పార్టీ ప్రస్తుత స్థితికి కారణం. జాతీయోద్యమ స్ఫూర్తితో స్వాతంత్య్రం పొందిన కొత్తలో అనుసరించిన కొన్ని ప్రజానుకూల విధానాలకు సైతం అనంతర కాలంలో ఆ పార్టీ చెల్లు చీటీ పాడింది. బ్యాంకుల జాతీయీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు, భూ పంపిణీ వంటి చర్యలకు భిన్నమైన విధానాల అమలు ప్రారంభించి కార్పొరేట్ల కొమ్ము కాసింది. ఇది అవినీతికి, ఆశ్రితపక్షపాతానికి దారి తీయడంతో పాటు దేశాన్ని దివాళా దిశకు నడిపించింది. ఐ.ఎం.ఎఫ్ అప్పు మొత్తం దేశాన్ని నయా ఉదారవాద విష కౌగిలిలోకి నెట్టింది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం వెర్రితలలు వేయడానికి, రాజకీయాలను కార్పొరేట్లు శాసించే స్థితికి దారి తీసింది. ఏ కార్పొరేట్ల సేవలో మునిగి ప్రజలను విస్మరించిందో, అవే కార్పొరేట్లు కాంగ్రెస్ పార్టీ కన్నా తమకు బీజేపీయే బాగా కొమ్ము కాస్తుందని భావించాయి. ఫలితంగా కార్పొరేట్ - హిందూత్వ మతోన్మాద కూటమి ఇప్పుడు రాజ్యం ఏలుతోంది.
తన వాగాడంబరంతో ప్రజలను మభ్య పెట్టి గద్దెనెక్కిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ప్రజలు పెట్టుకున్న భ్రమలు తొలిగిపోతున్నాయని, ఆయన జనాదరణ గణనీయంగా తగ్గుతోందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై దేశ వ్యాప్తంగా రైతాంగం నెలల తరబడి ఉద్యమిస్తున్నా మోడీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో రెండు రోజుల క్రితం జరిగిన దేశవ్యాప్త బంద్ తేటతెల్లం చేసింది. కరోనా వైరస్ నుండి ప్రజలకు రక్షణ కల్పించడంలోనూ, వ్యాక్సిన్‌ను విస్తృతంగా ప్రజలకు అందించడంలో మోడీ సర్కారు విఫలమైన తీరు ప్రజల కళ్లెదుట ఉంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రయివేటీకరణ, కార్పొరేట్ అనుకూల విధానాల పట్ల కూడా ప్రజానీకం తీవ్రంగా స్పందిస్తున్నారు. భావోద్వేగ, విద్వేషపూరిత రాజకీయాల కన్నా మనుగడకు సంబంధించిన దైనందిన సమస్యలే ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్రాల హక్కుల మీద దాడి చేయడంతో పాటు వాటి ఆర్థిక వనరులను కూడా కేంద్రం కొల్లగొడుతుండటంతో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా మోడీ వ్యతిరేకతతో స్పందిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీకి ప్రత్యామ్నాయం ఏమిటన్న చర్చ జోరుగా సాగుతోంది. లౌకిక, ఫెడరల్ విధానాలకు కట్టుబడి ఉండి, నయా ఉదారవాద విధానాల నుండి విడగొట్టుకోగలిగినప్పుడే ప్రజల విశ్వాసం పొందగలిగే ప్రత్యామ్నాయం రూపొందుతుంది. అందులో స్థానం పొందగలిగే రాజకీయ పార్టీగా కాంగ్రెస్ తనను తాను సంస్కరించుకుని, సరిదిద్దుకుని నిలదొక్కుకోగలదా అన్నదే ఇప్పటి కీలక ప్రశ్న.