Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన ప్రాచీన కళా విమర్శకులు, పండితులు కళలను అరవైనాలుగుగా విభజించి చెప్పారు. ఈ అరవై నాలుగులో చోరకళను కూడా చేర్చారు. మాట్లాడటమూ అబద్ధాలు మాట్లాడటమూ ఎంతో నైపుణ్యంతో కూడుకున్న కళ. ప్రాచీన కళలు సాహిత్యాన్ని పరిశీలిస్తే ఏదో ఒక ఆలోచనను, తమకు అవసరమైన ప్రయోజనాన్ని, విధానాన్ని విలువలను ప్రజలకు బోధించడం, అందించడం కోసమే సృష్టించబడ్డాయనే అనిపిస్తుంది. ఆదిమంలోనయితే పనీ పాటా, మాటా, నటనా కలిసి పయనించాయి. ఆ తర్వాత కళల్లో ఈ రకాలు మొదలయ్యాయి. పనులతో ప్రజలతో సంబంధమున్న కళలు. సంబంధం లేనికళలు. ఏదయినా ప్రతికళకీ ఏదో ఒక ప్రయోజనం ఉంటుందనేది వాస్తవం. అయితే ఎవరి ప్రయోజనం అనేదే అసలు ప్రశ్న.
అబద్ధాల అసత్యాల ప్రచారంలో ప్రదర్శనలో మన ఏలికల కళా నైపుణ్యం సామాన్యమైనది కాదు. వాస్తవంగా నాటకంలోనో, సినిమాలోనో నటించే కళాకారుని నైపుణ్యాన్ని అధిగమించి జీవిస్తున్న చిత్రాలు, పాపం సామాన్య ప్రజలను భ్రమల్లో ముంచేస్తున్నాయి. ఇక వాగాడంబరాలు, వార్తా కథనాలు కొంగ్రొత్త ఆవిష్కరణలకు పూనుకుంటున్నాయి. అమాయక జనులను నమ్మేలా చేస్తున్నవి. ఆవుపేడలో, మూత్రంలో ఔషధ గుణాలున్నాయని, మహాభారత యుద్ధ ఆనవాళ్ళు ఈనేలలో బయటపడ్డాయని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించినట్టు తాటికాయలంత అక్షరాలతో కథనాలు సోషల్ మీడియాలో ఊరేగుతాయి. గోబెల్స్‌ను మించిపోయిన అధికారఘనఅబద్ధ కళాబృందాలు నేడు దేశం నిండా బలాదూరంటున్నాయి. మొన్నటికి మొన్న 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక ఫ్రంట్ పేజీలో మన ప్రధానిని 'లాస్ట్, బెస్ట్ హౌప్ ఆఫ్ ఎర్త్' అనే శీర్షికతో తెగ కీర్తిస్తూ ఒక వార్తా కథనం ప్రచురించినట్టు సోషల్ మీడియాలో గిర్రుమని చక్కర్లు కొట్టింది. అనుమానమొచ్చి అసలు నిజం తెలుసుకుంటే, సంపూర్ణ అబద్ధమని, కట్టుకథని తెలిసిపోయింది. గత యేడేండ్లుగా ఈ అబద్దాల ఫ్యాక్టరీలు విరివిగా తెరుచుకుని పనిచేస్తున్నాయి. ఇక నటించే నాయకులకు మేకప్మేన్లు, కాస్టూమ్ డిజైనర్స్, దర్శకులు, నిర్మాతలు ఫొటోషూట్లు ప్రోగ్రామింగ్ అధికారులు అబ్బో ఒకటేమిటి! కళను పండించేందుకు సకల నిపుణులూ ఈ కార్ఖానాలో పనిచేస్తూనే ఉంటారు. స్క్రిప్టు రైటర్ల ప్రకారమే అబద్ధం రాజ్యమేలుతూ ఉంటుంది.
సత్యం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టివచ్చినట్టుగా తయారైంది పరిస్థితి. ఆ స్థాయిలో ఉండి మరీ ఇంత చీప్‌గా కళానైపుణ్యాన్ని ప్రదర్శించుకోవాల్సిన గత్యంతరమే మొచ్చిందో! ఉన్నదాన్ని లేనట్టుగా లేనిదాన్ని ఉన్నట్టుగా చూపే ఇంద్రజాల విన్యాసాలు నిజమైన మెజిషీయన్లనే నివ్వెర పరుస్తున్నాయి. ఇక భాషణ కళలో ఆరితేరిన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగారు శాసనసభలో తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. వేలాది ఎకరాల్లో దశాబ్దాలుగా గిరిజనులు అటవీ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూన్నారు. నేడు తమకు హక్కు పత్రాలు అందించాలని ఆందోళన చేస్తుంటే, పిల్లలు మహిళలు అని చూడకుండా గిరిజనులపై దౌర్జన్యానికి పూనుకుంటూ, నిర్బంధాలకు గురిచేస్తూ, మరోవైపు గిరిజన తండాల్లో సంబురాలు చేసుకుంటున్నారని నమ్మబలకటం దబాయించటం ఎంత పెద్ద కళ.
ఈ కళలన్నీ అనాదిగా ప్రదర్శిస్తున్న కళలే. దీనికి ప్రత్యామ్నాయంగా నిజమైన అసలైన ప్రజాకళా ప్రయోజనాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం, అబద్ధాల, అసత్యాల, భ్రమాత్మక పాలక కళా భండారాన్ని బట్టబయలు చేయటం కోసం ఇటీవల ప్రజానాట్యమండలి తన మహాసభలతో సన్నద్ధమవటాన్ని ఆహ్వానించాలి. జనులను భ్రమలకు గురిచేసే కళలు ఆర్భాటంగా, అట్టహాసంగా ఉన్నప్పటికీ వాటిలో సజీవత కనిపించదు. జనకళలోనే అది తొణికిసలాడుతుంది. నిజమైన కళలకు సాహిత్యానికి ప్రజల జీవితమే ప్రధాన ముడిసరుకు. ప్రజలు అంటే నిత్యం శ్రమలో, కార్యాచరణలో బతుకు కోసం పోరాడేవాళ్ళు. వీరి జీవనంలోంచే కళకు సజీవాంశం దొరుకుతుంది. వీళ్ళు తమ బాధనో, దు:ఖాన్నో, వేదననో, ఆనందాన్నో, ఆవేశాన్నో, సంతోషాన్నో ప్రేమనో, జాలినో, కరుణనో వ్యక్తీకరించడంలో నిజాయితీ ఉంటుంది. వాస్తవిక అభివ్యక్తి గుండెలోతుల నుండి పుడుతుంది. జనకళకు అదే మాతృక. అయితే ప్రజలు సాహిత్య కళల పట్ల ఉత్సాహాన్ని ఎందుకు చూపుతారంటే, తమ జీవితాల్లో నిండుకొన్న అసంతృప్తి, ఆవేదన, హింస, దోపిడీ, ఆకలి బాధల నుంచి విముక్తమవ్వాలనే కోరికను కళల్లో చూసి ఆనందపడతారు. అందుకనే ప్రజా కళాకారుడు మానవీయ సమాజ నిర్మాణం కోసం జనాన్ని చైతన్య పరిచే కర్తవ్యాన్ని చేపడతాడు. కలల్ని పండించేందుకు కళల్ని వినియోగిస్తాడు. వ్యక్తిగతమైన లక్ష్యాలు కాక సమష్టి తత్వాన్ని ప్రయోజనాన్ని ఆకాంక్షిస్తాడు. అణగారిన జీవితాల్లో అచంచల విశ్వాసాన్ని ఉత్తేజాన్ని నింపుతాడు. అలాంటి జనకళకు ఆయువుపట్టుగా పనిచేసే ప్రజానాట్యమండలి, నేటి బూటకపు, అబద్ధపు కళా కోవిదుల నిజ స్వరూపాలను స్పష్టపరచాల్సి ఉంది. అందుకు జనలయాన్విత గీతాలను, నృత్యాలను, పదాలను సొంతం చేసుకోవాలి. ప్రజా జీవనంతో మమేకమవ్వాలి. లేకుంటే వ్యాపార కళ మనపై ఆధిపత్యం చేస్తూనే ఉంటుంది. వాస్తవాలను మరుగు పరచి, వారి లాభాలకోసమే కళను ఉపయోగిస్తూ మోసగిస్తూనే ఉంటుంది.