Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్షల సంవత్సరాల క్రితం ఆదిమానవుడు రెండు బండరాళ్ళను ఒకదాంతో ఒకటి కొట్టినప్పుడు నిప్పే పుట్టింది. ఇప్పుడు మనం కొట్టినా నిప్పే పుడుతుంది. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుక్కోకముందు కూడా చాలా మంది నెత్తిన యాపిల్ పండ్లేంఖర్మ, కొబ్బరి బొండాలు పడి కపాలమోక్షం పొందిన వారుండి ఉంటారు. సైన్స్‌కు వ్యక్తితో సంబంధం లేదు. స్థల, కలాదులతో సంబంధం లేదు. అమాత్యుల వారికి అర్థమైనా కాకున్నా గతితర్కాక భౌతికవాదమనేది సైన్స్. కమ్యూనిస్టులకు ఒక గతి తర్కం, టీఆర్ఎస్ పార్టీకి ఇంకో గతితర్కం ఉండవు.
''కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కమ్యూనిస్టులు మారాల''ని అమాత్యుల ఉవాచ. అలా మారకపోతే కాలగర్భంలో కలిసిపోతారని శపించారు. కాలగర్భం లోతు ఎంతో అమాత్యులవారికి అంచనా ఉన్నట్టులేదు. గత 30/40 సంవత్సరాల్లో తమ కండ్లెదుట జరిగిన పరిణామాలే చరిత్రకాదని ఎవరైనా గులాబీ దళపతులకు చెప్పి పుణ్యం కట్టుకోవాలి. బహుశా కాలానుగుణంగా అంటే గాలివాటంగా అని అర్థం కావచ్చు. కమ్యూనిస్టులు పొలస చేపలు. ప్రవాహానికి ఎదురీదడమే వారి వృత్తి. ప్రవృత్తికూడా. హౌల్‌సేల్ ప్రయివేటీకరణ, కార్పొరేట్లకు అంటకాగడాలు, కార్మికులు, రైతులపై దాడే కాలానుగుణమైన మార్పా? ఆ విధానాలను అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు వ్యతిరేకిస్తున్నారు. ఆ విషయం గుగుల్తల్లితో అంజనం వేయించుకో గలిగిన అమాత్యుల వారికి తెలియదనుకోలేం. ఈ బాపతు వారందరి పుణ్యతీర్థం అమెరికాతో సహా అన్ని దేశాల్లోనూ దీనికి ప్రత్యామ్నాయం లేదు (టీనా) అనే దానికి జనం ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. లాటిన్ అమెరికన్ దేశాల్లో ఈ విధానాలను కచ్చితంగా వ్యతిరేకిస్తాననే వారినే జనం అధికార పీఠంపై కూర్చుండబెడుతున్నారు. ఇప్పుడీ ఆలోచనలు ఐరోపాకూ విస్తరించే సూచనలు కనపడుతున్నాయి. ఒకపక్క చైనాలో ''పెట్టుబడిదారీ విధానం'' అభివృద్ధి అవుతోందని చెపుతూ, ''చైనాలో వానొస్తే ఇక్కడ గొడుగు పడ్తార''ని దెప్పి పొడవడం ఎవరిగురించి? ఇవి పాసిపోయి కంపుకొడుతున్న డైలాగులు. వాటిని ఇంపుగా ఆస్వాదించొద్దు సార్!
కంపెనీలొద్దని, వాటికి భూమిలివ్వద్దని అన్నదెవరో అమాత్యశేఖరుడు బయటపెడితే బాగుండేది. మూడు పంటలు పండే భూములు పరిశ్రమల కోసం ఇచ్చిన రైతులు సరైన పరిహారం అందక, వారసులకు ఆ కంపెనీల్లో ఉద్యోగాలు రాక, పైగా కాలుష్యంతో పంటలు నాశనమై అలమటిస్తున్నారు. మన రాజధాని చుట్టూ ఉన్న సుమారు యాభై పారిశ్రామికవాడల్లో ఎంతమంది స్థానికులు ఉపాధి పొందుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం వద్ద లెక్కలేమైనా ఉన్నాయా? ఐదుశాతం కంటే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలివ్వడం ఎవరితరం కాదని మండలిలో బల్లగుద్దివాదించిన అమాత్యులవారు పరిశ్రమల్లో అన్‌స్కిల్డ్ కార్మికులుగానైనా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆయా పరిశ్రమలకు తాఖీదుల్విలేరా? రాజధాని చుట్టూ 70శాతం మంది వలస కార్మికులతో చాకిరీ చేయించుకుంటూ యజమానులు లాభాలు గడిస్తున్న విషయం ప్రభుత్వ దృష్టిలో ఉందా? పరిశ్రమల్ని, వాటి యజమానులను మాత్రం ''అరుసుకుంటూ'' వాటిలో పనిచేసే కార్మికుల్ని పట్టించుకోకపోవడం దుర్మార్గమన్న విషయం ఏలినవారికి తెలీదా? యూనియన్ల వల్ల, సమ్మెల వల్లనే పారిశ్రామిక ప్రగతి కుంటుపడిందని దొంగేడ్పులు ఏడ్చే ఫిక్కీలు, అసోచామ్‌లు, వారిని సంతృప్తి పరచడమే దేశ పురోగమనమనే మైకం కమ్మిన పాలకులు నిర్దిష్టంగా సమాధానం చెప్పాల్సిన విషయమొకటుంది. పెద్ద, చిన్న కలిపి సుమారు పదివేల పరిశ్రమలు మన మహానగరం చుట్టూ ఉన్నాయి. వీటిలో కేవలం 2.3శాతం పరిశ్రమల్లోనే యూనియన్లు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న దెవరు? యూనియన్లను రానివ్వరు. స్థానికులకు ఉద్యోగాలివ్వరు. వారి దోపిడీని అడ్డుకుంటే అభివృద్ధి నిరోధకులా మంత్రివర్యా?! మూతపడే కంపెనీల్లో ఒకటి, రెండు శాతం మినహా ఎక్కడా యూనియన్లు లేవని రిజర్వుబ్యాంకే లెక్కతీసింది. ఈ విషయం మన ఏలికలకు కనపడదా? ''తెలంగాణ రాష్ట్రంలో కార్మికులనే యజమానులుగా చేస్తున్నామ''ని మొన్న మండలిలో ''21వ శతాబ్దపు జోక్''ను ఘనత వహించిన మంత్రిగారు పేల్చారు. ఎమ్.ఎస్.ఎమ్.ఇ. లతో సహా రాష్ట్రంలో ఎక్కడ ఈ ''అద్భుతం'' జరిగిందో చెప్పి ఉండాల్సింది.. పైగా కార్మికుల కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఇండ్ల ధరలు పెరిగాయట! అమార్త్యసేన్ కూడా నోరెళ్లబెట్టాల్సిన సిద్ధాంతం కదా ఇది!
అమాత్యుల వారి సంధి ప్రేలాపనలకు ప్రధాన కారణం సెప్టెంబర్‌లో జరిగిన ఒక కార్మిక పాదయాత్ర. ఇది రాష్ట్ర ప్రభుత్వ బట్టలూడదీసింది. పెట్టుబడిదారులకు ఎదురుసేవ చేసే ప్రభుత్వాన్ని కనీస వేతనాల జీవోలను సవరించమని నిలదీసింది. మన ఊళ్ల కార్మికులైనా, బయటి రాష్ట్రాల కార్మికులైనా ఒకే విధంగా పరిగణించమని కోరింది. పరిశ్రమల యజమానులు చట్టం తమ చేతుల్లోకి తీసుకుని 18, 19వ శతాబ్దంలో లాగా కార్మికులను చూడొద్దని డిమాండ్ చేసింది. ఈ పాదయాత్ర ఉద్దేశం ఆ రకంగా పూర్తిస్థాయిలో విజయవంతమైనట్లే.