Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతులకు దెబ్బకు దెబ్బ కొట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. 500-1000 మంది కలిసి స్వచ్ఛంద సేవకుల బృందంగా ఏర్పడి రైతులను లాఠీలతో కొట్టండి. ఇలా చేసి జైలుకు వెళ్తే బెయిల్ కోసం ఆలోచించకండి. అన్నీ మేం చూసుకుంటాం. జైలుకు వెళ్లాల్సి వస్తే కంగారు పడకండి. జైలులో ఉంటే మీరు పెద్ద నాయకులయిపోతారు. చరిత్రలో మీ పేరు రాస్తారు'' అని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ భాజపా శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇంత బహిరంగంగా, సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పార్టీ కార్యకర్తలకు గూండా నాయకుడిలా పిలుపునిచ్చారంటే.. అంతర్గతంగా ఆ పార్టీ శ్రేణులకు, వారి అనుబంధ సంఘాలకు ఇంకెలాంటి ఘోర పిలుపు ఇవ్వకపోతే ఇంతటి దారుణ ఘటన చోటుచేసుకునేది?
కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు- బడుగు రైతు ప్రయోజనాల్ని బలిపెట్టేవేనంటూ అన్నదాతలు ఢల్లీీలో బైటాయించి పదినెలలు గడిచాయి. అయినా మొక్కవోని దీక్షతో గాంధేయమార్గంలో ఆందోళన చేస్తున్న అన్నదాతలను కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారుతో తొక్కించడంతో అక్కడిక్కడే నాలుగు ప్రాణాలు గాలిలో కల్సిపోయాయి. ఈ కిరాతక ఘటనతో దేశం నివ్వెరపోయింది. ఈ దుశ్చర్య బీజేపీ బరితెగింపునకు నిదర్శనం. అధికారం తెచ్చిన అహంకారంతో దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలను పొట్టనపెట్టుకున్నారు. రైతులంటే ఉగ్రవాదులా! వాళ్లుచెబుతున్నదేమిటో వినలేని ప్రభువుల పాలనలో చర్చలు, పరిష్కారాలకు ఆస్కారం ఉండదని ఇప్పటికే అనేక మార్లు రుజువైంది. ఎక్కివచ్చిన మెట్లు మర్చిపోయి, అధికార పీఠంపై ఉన్నాం కాబట్టి మేము రాజులం.. మాది రాచరికం ఎవరినైనా తొక్కేస్తాం, తొక్కించేస్తాం అంటున్నారు.
నిజానికి గడిచిన పది నెలలుగా రైతాంగ ఉద్యమాన్ని చీల్చడానికి కేంద్ర సర్కారు చేసిన ప్రయత్నాలు అన్నీ, ఇన్నీ కావు. పోరాటంపై తప్పుడు ప్రచారం చేసే నీచపు ఎత్తుగడలన్నింటిని అమలు చేసింది. రిపబ్లిక్ డే రోజు జరిగిన ప్రహసనం వీటికి పరాకాష్ట. అయినా, రైతాంగంలో ఐక్యత ఏమాత్రం చెక్కుచెదర లేదు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ పెరుగుతున్న కర్షకవీరుల సంఖ్యే దీనికి నిదర్శనం. కేంద్రమంత్రి స్వగ్రామంలో జరగబోయే ఓ కార్యక్రమానికి యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్య హాజరవుతున్నందున ఆయనకు నల్లజెండాలతో నిరసన తెలియచేయా లన్న ఉద్దేశంతో రైతులు రహదారిపైకి చేరుకున్నారు. వారిని చూడగానే కేంద్రమంత్రి తనయుడు ఆగ్రహంతో రగిలిపోయాడు, కోపంతో శివాలెత్తి ఊగిపోయాడు.. కాల్పులకు తెగబడ్డాడు. వెనువెంటనే ఒక్కసారిగా కార్లు వేగం పుంజుకొని రైతులను తొక్కుకుంటూ పోయాయి. ఇది ఎంతటి అమానవీయమైన దృశ్యం... ఎంతటి ఘోరకలి.
లఖింపూర్ ఘటన ఏదో హఠాత్ పరిణామం కాదు. రైతుల నిరసనలను, ఆందోళనలను బీజేపీ నాయకులు, పాలకులు ఏ విధంగా చూస్తున్నారో ఇది తెటతెల్లం చేసింది. ఈ ఘటనకు వారం ముందు ఇదే కేంద్రమంత్రి ఉద్యమిస్తున్న రైతులు తమ వైఖరి మార్చుకోకపోతే, కేవలం రెండునిముషాల్లో వారిని ఎలా దారికి తేవాలో తనకు తెలుసంటూ చేసిన ప్రసంగవీడియోల్లో రైతులను తన్నడం, తరిమికొట్టడం వంటి భాష విరివిగా ఉంది. హర్యానా ముఖ్యమంత్రి మనసెరిగినందునే, కర్ణాల్ సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా ఇటీవల ఉద్యమిస్తున్న రైతుల తలలు బద్దలు కొట్టమని పోలీసులను ఆదేశించారు. రెచ్చిపోయిన పోలీసులు పాతికమంది రైతులను చావగొట్టారు, ఒకరిని చంపేశారు. అంటే యూపీ ఘటన పథకం ప్రకారమే చేశారని స్పష్టం అవుతున్నది. బీజేపీ పెద్దలు రైతులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ, వారి నిరసనను ఉగ్రవాదుల ఉద్యమంగా అభివర్ణిస్తూ, తమ కిందివారిని దాడులకు ఉసిగొలుపుతూంటే లఖింపూర్ ఘటనల వంటివి చోటుచేసుకోకుండా ఎలా ఉంటాయి? ఎన్ని మాసాలైనా అదే పట్టుదలతో రైతులు ఉద్యమాన్ని కొనసాగించడం పాలకులకు మింగుడుపడటం లేదు. మరోపక్క కొత్త సాగు చట్టాల అమలుపై జనవరిలోనే స్టే విధించాం కనుక, రైతులు ఇప్పటికీ నిరసన చేయడం ఏమిటన్నది అత్యున్నత న్యాయస్థానం ప్రశ్న. నిరసన తెలిపే హక్కు ఉందని కోర్టుకెక్కాక వీధికెక్కి ఏమిటనీ అంటోంది. 43 రైతు సంఘాల నేతలకు నోటీసులిచ్చింది. కానీ, అనేక అంశాలపై జోక్యం చేసుకోని, ప్రభుత్వానికి మార్గదర్శనం చేస్తున్న న్యాయవ్యవస్థ ఎందుకనో ఏడాదిగా సాగుతున్న రైతు ఉద్యమంపై మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నంది.
రైతుల ఊసే సహించలేని కేంద్రం రైతు సమస్యల పరిష్కారంలో మధ్యేమార్గంపై శ్రద్ధ పెడుతుందనుకోవడం అత్యాశే. నిజానికి, తాజా ఘటనపై సర్కారు వారి న్యాయవిచారణలో సంచలన విషయాలు బయటపడతాయన్న భ్రమలేవి లేవు. మరింత రక్తసిక్త శవరాజకీయాలకు పాలకులు పాల్పడతారన్నది నిజం. కానీ, అత్యున్నత న్యాయస్థానమే అడిగినట్టు లఖింపూర్ లాంటి ఘోరాలకు ఎవరిది బాధ్యత? ఆవిరైపోయిన అమాయక ప్రాణాలకు ఎవరు జవాబుదారీ? ప్రాణాలకు ఖరీదు కట్టే నాయకుల దుష్టత్వం ఇంకెంత కాలం? పాలకులు రైతులను శత్రువుగా చూసినంత కాలం ఈ సమస్యకు పరిష్కారం దక్కదు. ప్రభుత్వాలపై తిరగబడకా తప్పదు.