Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నమ్మకం.. విశ్వాసం... ఒకదానికొకటి అత్యంత సారూప్యత కలిగిన ఈ రెండు పదాలు మనిషి జీవితంలో అతి ముఖ్యమైనవి. అది వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా నిలబడాలంటే, నిలిచి గెలవాలంటే ఇవి అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా పాలకులు, ప్రభుత్వాలు... కొన్నిసార్లు ప్రజా సంక్షేమాన్ని ఆశించి, అనేక సందర్భాల్లో ఓట్ల రాజకీయాల కోసం పలు 'సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల'కు శ్రీకారం చుట్టటం ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలోనే మన రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక క్రమంలో దళిత బంధు పథకం పురుడు పోసుకున్నది. ఈ పథకం ప్రారంభానికి కరోనా అడ్డుపడ్డదనీ, లేదంటే రెండేండ్ల క్రితమే దీనికి శ్రీకారం చుట్టేవాళ్లమంటూ ప్రభుత్వాధినేతలు చెబుతున్నప్పటికీ... ఆ పథకాన్ని ప్రారంభించటంలోని అసలు మర్మం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న శాసనసభ వర్షాకాల సమావేశాల్లోనూ ఈ అంశం చర్చకొచ్చింది. ఇక్కడ పథకాన్ని ఎందుకు ప్రారంభిం చారు..? దానిపై ఎవరెవరి అభిప్రాయాలు.. పార్టీల వైఖరులను ఎలా ఉన్నాయనే విషయాలను కాసేపు పక్కనబెట్టి, దానికయ్యే ఖర్చును, అందుకు సంబంధించి ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏకరువు పెట్టిన గణాంకాలను ఓసారి పరిశీలిస్తే... సీఎం హామీలకు, వాస్తవాలకు పోలిక, పొంతన ఎలా కుదురుతుందబ్బా...? అనే ప్రశ్న ఉదయించకమానదు.
దళిత బంధు పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం... మొత్తం రూ.లక్షా 80 వేల కోట్లను ఖర్చు చేయనుందని ముఖ్యమంత్రి చెప్పిన లెక్కల సారాంశం. 2022-23 బడ్జెట్లో రూ.20 వేల కోట్లను కేటాయిస్తామంటూ ఆయన ప్రకటించారు. అయితే రూ.లక్షా 80 వేల కోట్లను ఒకేసారి కాకుండా ఏడేండ్లపాటు ఖర్చు చేస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ పద్దు ఇంచుమించుగా మన రాష్ట్ర బడ్జెట్‌తో సమానం. పైగా ఏడేండ్ల పాటు వీటిని ఖర్చు చేస్తామనటమంటే అప్పటిదాకా తెలంగాణలోని ఎస్సీలందరూ ఆ పథకం కోసం ఎదురు చూడాల్సిందేనన్నమాట. ఏలినవారు 'మరో ఇరవై ఏండ్లపాటు మేమే అధికారంలో ఉంటా...' మంటూ అసెంబ్లీ సాక్షిగా బల్లగుద్ది చెప్పిన తరుణంలో... తాము ఆ విధంగా దశాబ్దాల తరబడి అధికార పీఠాన్ని అంటిపెట్టుకుని ఉండటానికి ఇలాంటి పథకాలను వాడుకో బుతున్నారనే సంకేతాలను ఇవ్వకనే ఇచ్చినట్టుగా కనబడుతున్నది. గత అనుభవాలను పరిశీలిస్తే... డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, గొర్రెలు, మేకల పంపిణీ తదితర హామీల పరంపరలోనే ఇది కొనసాగనుందా..? అనే అనుమానాలు వ్యక్తంగాక మానవు. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భవించిన కొత్తలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం... రాష్ట్రంలో భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలు 3 లక్షల వరకూ ఉన్నాయి. ఇది అధికారిక లెక్క, అనధికారికంగా ఏడు లక్షల వరకూ ఉండొచ్చన్నది సామాజిక, దళిత సంఘాలు చెబుతున్న మాట. ఈ క్రమంలో ఇప్పటి వరకూ మొత్తం 6,601 దళిత కుటుంబాలకు 16,684 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇది భూమి లేని దళిత కుటుంబాల మొత్తం సంఖ్యలో 2 శాతంగా నమోదైంది. అంటే మిగతా 98 శాతం మందికి సెంటు భూమి కూడా దక్కలేదన్నమాట. అందువల్ల మూడెకరాల పంపిణీ అనేది ఒక నిరంతర ప్రహసనంగా మారటంతో ఎస్సీలందరికీ ఆ భూములు ఎప్పుడు దక్కుతాయో తెలియని పరిస్థితి. మరోవైపు 'అవసరమైతే దళితుల కోసం ప్రభుత్వ భూములు అమ్ముతా...'మంటూ గులాబీ పార్టీ సభ్యులు బల్లలు చరుస్తున్న చప్పుళ్ల మధ్య గులాబీ దళపతి శాసనసభలో ప్రకటించటం మరొక విడ్డూరం. ఇక్కడే అసలు పాయింట్ దాగుంది. దళితులకు భూ పంపిణీ కోసం అవసరమైతే భూముల్ని కొని.. ఒక్కొక్కరికి మూడెకరాల చొప్పున ఇస్తామని ప్రభ్వుత్వం అప్పట్లో చెప్పింది. ఇప్పుడేమో దళిత బంధు కోసం అవమరమైతే ప్రభుత్వ భూములను అమ్మి నిధులను పోగేస్తామని చెబుతున్నారు. మరోవైపు పరిశ్రమల ఏర్పాటు కోసం 'ల్యాండ్ బ్యాంకు'ను ఏర్పాటు చేస్తామని వారే సెలవివ్వటం గమనార్హం.
ఇతమిద్ధంగా చెప్పుకోవాలంటే... తెలంగాణలోని దళితులు బాగుపడాలంటే ప్రభుత్వ పథకాలు, వాటి అమలు పట్ల వారిలో ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించాలి. ఇందులో భాగంగా మొదట చేయాల్సింది... కేవలం హుజూరాబాద్ వరకే కాకుండా మొత్తం రాష్ట్రమంతా దీన్ని అమలు చేయాలి. ఇందుకోసం నిధుల సమీకరణపై స్పష్టతనివ్వాలి. పథకం అమల్లో పూర్తి పారదర్శకతను పాటించాలి. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా లబ్దిదారుల్ని ఎంపిక చేయాలి. అలాగాకుండా ఉప ఎన్నికలు, ఓట్ల కోణంలోంచే దళితబంధును అమలు చేస్తే... అది 'మూడెకరాల భూమి' మాదిరిగానే మరో ప్రహసనంగా మారుతుంది తప్ప సరైన ఫలితాలివ్వబోదు. ఈ మధ్య అటు అసెంబ్లీలో దళిత బంధుపై సీఎం ప్రసంగం పూర్తికాగానే ఇటు బయట ఆయన ఫొటోలకు పాలాభిషేకాలు మొదలయ్యాయి. జిందాబాద్‌లు కొడుతూ పోస్టర్లు వెలిశాయి. లబ్దిదారుల్లో కనీసం సగం మంది దరికైనా ఆ పథకం చేరితే.. అప్పుడు సంబురాలు చేసుకోవచ్చు. లేదంటే అది అత్యుత్సాహమే అవుతుంది.