Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచమంతా ఎదురు చూసిన జర్మనీ ఎన్నికలు ముగిసాయి. అన్యూహంగా జర్మన్ చాన్స్‌లర్ ఎంజీలా మార్కెల్ ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీస్టీయన్ డెమాక్రాటిక్ పార్టీ (సీడీపీ) మట్టికరిచింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం జర్మనీలో మితవాద రాజకీయాలకు ఈ స్థాయిలో ఎదురుదెబ్బ తగలడం ఇదే మొదటిసారి.
ఈ ఎన్నికలలో బరిలోకి దిగిన ప్రధానపార్టీ యస్డీపీ 25.7శాతం, సీడీపీ 24.1శాతం, గ్రీన్స్, ప్రత్యామ్నాయ జర్మనీ పార్టీకి 10శాతం, మితవాదానికి ప్రాతినిధ్యం వహించేశక్తులకు 5శాతం, వామపక్షానికి 5శాతం ఓట్లు వచ్చాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రానందున సంకీర్ణమే ఏర్పడాలి. ఈ ఎన్నికల తీర్పులో రెండు మౌలిక అంశాలు వ్యక్తం అవుతున్నాయి. మొదటిది తూర్పు జర్మనీ ప్రాంతంలో వామపక్షానికి ప్రజాదరణ పెరగడం. రెండవది 2017 నాటికి దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లు సంపాదించిన సీడీపీ తాజా ఎన్నికలలో రెండు రాష్ట్రాలలో మాత్రమే ఆధిపత్యపార్టీగా నిలిచింది. పదిహేను సంవత్సరాల పాటు సంపూర్ణ ఆధిపత్యంలో అధికారంలో ఉన్నా జర్మన్ ప్రజల జీవన ప్రమాణాలను సాపేక్షంగా పెంచడంలో విఫలం అయింది. ఇది ఇంటర్నెట్ యుగం. కాని జర్మనీలో బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ తగినంత లేకపోవడం కూడ ఒక సమస్యగా ముందుకు వచ్చింది. దశాబ్ధిన్నర కాలంలో దేశానికి నాయకత్వం వహించిన ఎంజీలా మార్కెల్ దార్శినికత గల దేశాధినేతగా ప్రజల మన్ననలు పొందలేకపోయింది. దేశాధినేత పదవిని కేవలం ఒక ఈవెంట్ మేనేజర్ స్థాయికి దిగజార్చింది. దేశాన్ని పాలించడానికి పార్లమెంటరీ ఆధిపత్యం మాత్రమే సరిపోదు. సంకుచిత ఏజెండాలతో దేశాన్ని శాశ్వతంగా పరిపాలించడం సాధ్యం కాదని జర్మన్ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. ఆర్థికంగా యూరోపియన్ యూనియన్‌కు నాయకత్వం వహించే సత్తా కలిగిన జర్మనీ రాజకీయ దిశానిర్దేశం చేయడంలో విఫలం అయింది. అంతర్జాతీయ ఆధిపత్య పోరులో అమెరికాకు జూనియర్ భాగస్వామిగా మారింది. ఇరాక్ మొదలు అఫ్ఘానిస్తాన్ వరకు, సిరియా మొదలు జోర్డాన్ వరకు, ఫారిస్ పర్యావరణ సదస్సు మొదలు ప్రపంచ ఆరోగ్య సంస్థ వరకు జరిగిన అనేక పరిణామాల్లో అటు జర్మనీ ప్రయోజనాలను కాని, ఇటు యూరోపియన్ దేశాల ప్రజా ప్రయోజనాలను కాని కాపాడటంలో జర్మనీ విఫలం అయింది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వలస వాదులే జర్మనీ అభివృద్ధికి ఆటంకం అన్న మార్కెల్ ప్రభుత్వ వాదనను జనం స్వీకరించలేదని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి.
ఈ ఎన్నికలు జర్మన్ రాజకీయ రంగంలో నెలకొన్న దిశా రాహిత్యానికి కూడా నిదర్శనంగా నిలుస్తాయి. తాజా ఎన్నికలు అత్యధిక ఓట్లు సాధించిన సోషల్ డెమాక్రాటిక్ పార్టీ (యన్పీడీ) నిన్న మొన్నటి వరకు క్రీస్టియన్ డెమోక్రటిక్ పార్టీతో కలసి అధికారం పంచుకున్న పార్టీయే కావడం గమనించాల్సిన విషయం. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సంక్షోభంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ మెరుగైన ప్రత్యామ్నాయం అని ఆ దేశ ప్రజలు భావించారు. ఆర్థిక విధానాల పరంగా చూసినప్పుడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ, క్రీస్టియన్ డెమోక్రటిక్ పార్టీల వర్గ దృక్పథంలో చెప్పుకోదగ్గ వైరుధ్యం ఏమీలేదు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా అల్లా ఒక్కటే.. క్రిస్టియన్ డెమోక్రాటిక్ పార్టీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రజల మధ్య మత వైరుధ్యాలు, కృత్రిమ శత్రువులను (ది అదర్) సృష్టిస్తున్నది. దీనితో సామాజికశాంతి దెబ్బతింటోంది. ఈ పరిస్థితి ప్రజలలో నిరంతరం అభద్రతా భావానికి పునాదులు వేస్తోంది. యూరోపియన్ దేశాలలో ఈ మధ్యకాలంలో పెరిగిన ఉగ్రవాదశక్తుల దాడులు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందుకే మితవాదశక్తులను ప్రజలు ఓడించారు. రేపు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ఆ స్ఫూర్తి కొనసాగాలి.
ఇటువంటి పరిస్థితులలో జర్మనీకి ప్రత్యామ్నాయం చూపించే లక్ష్యంతో తెరమీదకి వచ్చిన గ్రీన్స్ పార్టీ తాను ఎంచుకున్న ఎజెండాకు ఉన్న పరిమిత స్వభావ కారణంగా దేశ వ్యాపిత ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయింది. ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణవాదులకు సహజ మిత్రులు వామపక్ష ప్రజాతంత్ర శక్తులే. ఈ ఎన్నికలలో విడివిడిగా పోటీ చేసిన గ్రీన్స్ మరియు వామపక్షాలకు వచ్చిన ఓట్లు కలిపితే సుమారు 18శాతం వరకు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో సంకీర్ణ ప్రభుత్వమే ప్రస్తుతం జర్మనీకి దారి చూపించనున్నది.
సంకీర్ణాలు జర్మనీలో కొత్తఏమీ కాదు. పార్లమెంటు మొదలు ప్రాథమిక స్థాయి వరకు జరిగే ఎన్నికలలో ఆయా స్థల కాల పరిస్థితులను బట్టి వేరువేరు సంకీర్ణాలు ఏర్పడుతూ వచ్చాయన్నది గత ఏడు దశాబ్దాల జర్మన్ ప్రజాస్వామ్యపు చరిత్ర రుజువు చేస్తోంది. తాజా ఎన్నికలలో కూడా అటువంటి సంకీర్ణం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ సంకీర్ణంలో మితవాద శక్తులకు ప్రాతినిధ్యం లేకుండా ఏర్పడితే జర్మన్ ప్రజల రాజకీయ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించేదిగా ఉంటుంది. దీనికి భిన్నంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా తమను తాము మల్చుకుంటే ప్రజాతీర్పుకు భిన్నమైన స్ఫూర్తి స్వభావం కలిగిన రాజకీయ కూటమి తెరమీదకు వచ్చే అవకాశం, ప్రమాదం కూడ ఉన్నది.