Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాభిప్రాయాన్ని మన్నించలేని పాలనానుభవం ఎంత సుదీర్ఘమైనదయితే మాత్రం ఏం లాభం..! రెండు దశాబ్ధాల తన అధికార ప్రస్థానం గురించి గొప్పలు పోతున్న ప్రధాని, యేడాది నిండబోతున్న రైతుల న్యాయపోరాటానికి చూపుతున్న పరిష్కారమేమిటి? ప్రాణాలు తీసైనా సరే ప్రజా పోరాటాలను అణిచివేయడమేనా..? ఇరవైయేండ్ల ఆయన అపారమైన అనుభవం ఇప్పుడు అన్నదాతల పోరాట పటిమను చూసి ఆందోళన చెందుతున్నదా..? తన అప్రజాస్వామిక అణచివేతలను, అంతకుమించిన నిర్బంధ నిరంకుశ పోకడలను ధిక్కరించి సాగుతున్న రైతు ఉద్యమం, తన ఇరవయేండ్ల అధికార పీఠాన్ని నేలమట్టం చేస్తుందని కలవరపడుతోందా? అందుకే ఇంతటి అరాచకాలకు తెగబడుతోందా? కండ్లముందు జరుగుతున్న ఘటనలను చూస్తూ కాదని చెప్పలేం. మొన్నటి యూపీలోని లఖీంపూర్ ఖేరీ మారణకాండను మరువకముందే నిన్న హర్యానాలోని అంబాలలో మరో దారుణానికి వొడిగట్టడం దేనికి సూచిక అక్కడ కేంద్రమంత్రి అజరుమిశ్రా తనయుడు ఆశీష్‌మిశ్రా తరహాలోనే ఇక్కడ బీజేపీ ఎంపీ నయబ్సింగ్ సైనీ నిరసనకారులను తన కారుతో తొక్కించే ప్రయత్నం చేసాడు. రైతులు అప్రమత్తం కావడంతో తృటిలో ప్రమాదం తప్పి ''భవన్ప్రీత్'' గాయాలతో బయటపడ్డాడు గానీ, లేకుంటే ఇంకెన్ని ప్రాణాలు నేలరాలేవో..!
గత పదకొండు నెలలుగా విరామమెరుగని ఈ వీరోచిత రైతాంగ ఉద్యమం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరినీ, అధికారపార్టీ తీరునూ పరిశీలించినప్పుడు... ఇవన్నీ కాకతాళీయమైన ఘటనలుగా భావించలేం. మొదట్లో చర్చల పేరుతో కాలయాపన ద్వారా ఉద్యమాన్ని దారిమళ్లించాలని చూసిన ప్రభుత్వం, ఆ పప్పులు ఉడకకపోవడంతో తీవ్రమైన నిర్బంధాలతో అణచివేయచూసింది. అదీ కుదరకపోవడంతో రైతులను సంఘ విద్రోహులుగా, ఉగ్రవాదులుగా, అసాంఘిక శక్తులుగా చిత్రీకరించేందుకు పూనుకుంది. ఆ పాచిక కూడా పారకపోవడంతో ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేసి నీరుగార్చాలనుకుంది. కానీ నీరుగారుతుందనుకున్న పోరాటం విశాల ప్రజామద్దతుతో అంతర్జాతీయ స్థాయిలో హౌరెత్తడంతో ఇప్పుడీ అరాచకాలకు తెగబడుతోంది. సరిగ్గా ఈ ఘటనలకు వారం రోజుల ముందు ఇదే కేంద్ర మంత్రి అజరుమిశ్రా ''రైతులు తమ వైఖరి మార్చుకోకుంటే ఎలా దారికి తేవాలో మాకు తెలుసు'' అని హెచ్చరించారు. ఆ వెంటనే హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ ''ఉద్యమిస్తున్న రైతులను కర్రలతో చావగొట్టమ''ని తమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ''కేసులు, జైళ్ళు, బెయిళ్ళు అన్నీ మేం చూసుకుంటాం'' అని భరోసా ఇచ్చారు. వీటి కొనసాగింపుగానే ఈ అమానవీయ, అరాచక ఘనటలు జరగడం గమనార్హం.
రోజులు, నెలలు గడిచి సంవత్సరం కావొస్తున్నా, లాఠీలు, తూటాలను లెక్కచేయకుండా సాగుతున్న ఈ ఉద్యమం ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేస్తోంది. తమ రైతు వ్యతిరేక సాగు చట్టాలపై ఈ ప్రజాగ్రహం ఇలాగే కొనసాగితే, రానున్న యూపీ ఎన్నికల్లో, ఆపైన సార్వత్రిక ఎన్నికల్లో తమ అధికారానికే ముప్పుతెస్తుందని గ్రహించిన కమలనాథులు ఇంతటి దాష్టీకాలకు తెగబడుతున్నారు. అంతే తప్ప ఇరవయేండ్ల మోడీ పాలనాదక్షతలో ప్రజాభిప్రాయాన్ని మన్నించి, తమ విధానాలను వెనక్కి తీసుకునేందుకు మాత్రం సిద్ధపడటం లేదు. అందుకే జరిగిన ఘటనల పట్ల, రైతుల మరణం పట్ల కించిత్ విచారాన్నీ, కనీస పశ్చాత్తాపాన్నీ ప్రకటించకపోగా, ఘటన జరిగి వారం కావొస్తున్నా నిందితులను అరెస్టు చేయటం లేదు. చివరికి స్వయంగా సుప్రీంకోర్టే స్పందించి ''స్టేటస్ రిపోర్టు ఇవ్వండి'' అని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
నేరస్తులు ఎవరు? ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు? ఇప్పటి వరకు ఎవరినైనా అరెస్టు చేసారా? అని న్యాయస్థానం నిలదీస్తుంటే, నిందితుల కోసం ఇంకా వెతుకుతున్నామని యోగీ పోలీసులు ప్రకటించడం సిగ్గుచేటు. మొదట్లో అసలు మంత్రి కుమారుడు ఆశిష్‌మిశ్రా పాత్ర ఉందనడానికి ఆధారాలే లేవని చెపుతూ తమ స్వామిభక్తిని చాటుకున్న పోలీసులు, ఆధారాలను స్పష్టం చేసే వీడియోలు వెలుగులోకొచ్చాక ఆశిష్ అచూకీ కోసం ప్రయత్నిస్తున్నామనడం తెరవెనుక తతంగాలకు అద్దం పడుతోంది. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన మంత్రి అజరుమిశ్రా, తన బాస్ అమిత్‌షాను కలిసాక రొమ్ము విరుచుకుంటూ ఆ ప్రసక్తే లేదని ప్రకటించారు. అదే సమయంలో ఘటనను ఖండిస్తూ ''అక్కడ చిందిన రైతుల రక్తానికి బాధ్యత ఎవరిదో తేలాలి. హత్యలతో ఉద్యమకారుల నోర్లను మూయించలేం'' అని ప్రకటించినందుకు వరుణ్‌గాంధీ, ఆయనతోపాటు తల్లి మేనకాగాంధీలు తాజా బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో చోటు కోల్పోయారు. ఇది దేనికి సంకేతం..? జరిగిన అమానుషాల పట్ల బీజేపీ నైతిక దిగజారుడుతనానికీ, అసమ్మతిని సహించని మోడీ ప్రభుత్వ అహంకారానికీ ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
ఇప్పుడు రైతుల పట్లనే కాదు, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా తన అధికారాన్ని నిలుపుకోవడానికీ, తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికీ ఈ ఇరవయేండ్ల ప్రయాణంలో మోడీ ప్రతి అడుగూ నిర్బంధ, నిరంకుశ విధానాల మీదుగానే సాగింది. ఇందుకు గుజరాత్ నుండి ఢిల్లీ దాకా ఆరని నెత్తుటిధారలెన్నో దారిపొడవునా సాక్షాలుగా ఉన్నాయి. ప్రశ్నించే గొంతులను నిర్బంధించడం, ప్రజా పోరాటాలను నియంత్రించడమే లక్ష్యంగా సాగిందీ ప్రయాణం. ఈ ప్రయాణానికి ముగింపుకు పలికేందుకే ఇప్పుడు రైతాంగం రక్తమోడుతోంది.