Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బతుకమ్మా! బతుకు' అంటూ ఆడపిల్లల బతుకును గురించి జరుపుకునే పండుగ ప్రతి సంవత్సరంలాగానే మళ్ళీవచ్చింది. ఇది పూలతో అలంకరించుకొని ఆడపిల్లల ఆశలను పల్లవులుగా చరణాలుగా చేసుకుని పాడుకుని పరవశించేపండుగ. ఈ పండుగ యీతివృత్తంలోనే ఆడపిల్లల బతుకు ఆనందంగా, స్వేచ్ఛగా, ఏ సమస్యలూ లేకుండా సాగటం లేదనీ, ఆ బతుకు బాధలను దూరం చేయటానికి గౌరమ్మా! పార్వతమ్మా! శ్రీలక్ష్మీ! మీరయినా విని కరుణ చూపమని వేడుకోవటం, బతుకమ్మా బతుకు అని ఆశీర్వదించటం, పాడుకోవటంలో ఉంది. ఒకరికొకరు కలుసుకుని సామూహికంగా దు:ఖాలను, బాధలను, అనుబంధాలను కలబోసుకుని, గుండెల బరువును దింపుకుని ఆటలతో పాటలతో సంతోషాలను నింపుకునే పండుగ బతుకమ్మ.
తెలంగాణ సమాజంలో తరతరాలుగా జరుపుకుంటున్న ఈ బతుకమ్మ ఉత్సవం, ఇక్కడి సంస్కృతికి, ఈనేలలోని ఆడపడుచుల పరిస్థితికి అద్దం పడుతుంది. అనాదిగా వస్తున్న స్త్రీల వేదనలు నేటికీ తొలగకపోగా మరింత పెరుగుతూ వస్తున్నాయి. కష్టాలు తొలగిపోవాలని కలలుగన్న ఆశలు, ఆశయాలు ఆవిరవుతున్నాయి. చెప్పుకోవటానికి కూడా ఎవరూ లేని కాలంలో దేవతనో, దేవుడినో కొలుస్తూ వేడుకోవడం, పురాణాలలోని కథలకు, తమ నిజమైన బతుకు కథను జోడిస్తూ పదిమందితో పంచుకోవటాన్ని ఈ పండుగ సందర్భంలో మనం చూస్తాము. సామాజిక అంత:సారాన్ని అందించే పండుగలు, ఉత్సవాలు కొన్ని ఉంటాయి. అందులో బతుకమ్మ ఒకటి.
పరిణామక్రమంలో సమాజం ఎంతో పురోగమించింది. రాచరిక, భూస్వామిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చాము. ఇప్పుడు స్వేచ్ఛగా తమ తమ సమస్యలను చర్చించుకోవటం, పరిష్కారానికి పూనుకోవటం జరగాలి. ఈ సందర్భంగానైనా ఇవేమయినా జరుగుతున్నాయా? ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్ళను ఎలా పరిష్కరించుకోవాలో వాటి మూలాలేమిటో కనీసంగానైనా చర్చిస్తున్నామా? ప్రజాస్వామిక ప్రభుత్వాలు వాటి గురించి ఆలోచిస్తున్నాయా? అని ప్రశ్నించుకుంటే ఒక్క సమాధానమూ రాదు. పండుగంటే సంతోషంగా జరుపుకోవాల్సిందే. కానీ నేడు స్త్రీల, పిల్లల జీవితాలలో ఆ సంతోషాలు ఉన్నాయా? ఈ మధ్యకాలంలో ఎంత మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు, హత్యలు జరిగాయి. ఎన్ని కుటుంబాలు దు:ఖంలో మునిగి ఉన్నాయి!
వీటికి కారణమైన మద్యపాన వ్యాపారం, మత్తుమందుల వ్యాపారం, అశ్లీల వైబ్సైట్ల విహారం, యధేచ్ఛగా సాగుతున్న అరాచకమూకల అసాంఘిక కార్యకలాపాలు, మొదలైన వాటి గురించి, వాటి ప్రభావాల గురించి పాలకులు ఆలోచించారా? లేదు. ఎందుకంటే వాటిపైన లాభాలతోనే వాళ్ళు బతుకుతున్నది. ఇంకోవైపు నిరుద్యోగం, ఉపాధిలేమి, గ్రామీణంలో రైతు ఘోష, నిత్యం పెరుగుతున్న నిత్యావసర ధరలు, సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం ప్రధానంగా స్త్రీలపైన ఎక్కువగా పడుతున్నది. ఇక సంతోషాలు ఎలా వెల్లివిరిస్తాయి. పండుగలు సంస్కృతిలో భాగమే. సంస్కృతిలో ఉండేది జీవన వ్యక్తీకరణలే.
'బతుకమ్మ'లోని బతుకుల గురించి ఏమీ చర్చించకుండా ఆలోచించకుండా, కేవలం సంస్కృతీ నమూనాలను, ప్రతిమలను, ప్రదర్శిస్తూ సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా భ్రమింపచేయటం నేటి పాలకుల విధానంగా మారింది. పండుగలలోని రంగులు, హంగులు, పాటల్లోని సంగీతం, హౌరు, నృత్యరీతులు, ఆహార్యాలు, ఆర్భాటాలు, ప్రచారాలు, ప్రదర్శనలు.. అధికారీకరించిన చిత్రాలు అసలు బతుకు సారంలేని కృత్రిమ తత్వాలుగా దర్శనమిస్తాయి. కేవలం ప్రతీకలను పట్టుకుని బతుకులను వొదిలేయటం. అంటే సాంస్కృతిక రూపాలను కూడా తమ ఆధిపత్యానికి, అధికారానికి సొమ్ము చేసుకోవడమే అవుతుంది తప్ప బతుకుల్ని మార్చాలనే ఆలోచనే వీళ్ళకు లేదు. ఇక దేశంలో ఆధిపత్యంలో ఉన్న వాళ్ళయితే సంస్కృతిని విధ్వంసమొనర్చి, మత దురహంకారానికి విద్వేషానికి దిగజార్చి కించపరుస్తున్న తీరునూ చూస్తున్నాము. ఆడపిల్లలను వివక్షతగా చూడటమే సంస్కృతిగా పేర్కొంటున్న వారి తీరు దుర్మార్గమైంది. ఇక వ్యాపార వర్గాలు సాంస్కృతిక ప్రతీకలనూ సరుకుగా మార్చి మార్కెట్లో అమ్మకానికే పెట్టేసారు.
పండుగలలో కూడా సమాజంలోని వివక్షతలు ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. పురుషాధిక్య సమాజంలో ఆడ పిల్లల సమస్యలు అందరికీ ఒకటే అయినా, ఇందులో దళిత వెనుకబడిన మహిళలు మరింత హింసకు వివక్షతకూ లోనవుతూనే ఉన్నారు. వారి బతుకు పాట మరింత వేదనా భరితంగా ఉంటుంది. కుల పీడన, వ్యత్యాసాల సామాజిక వ్యవస్థలో సంస్కృతి కూడా వైవిధ్యంగానూ వైరుధ్యంతోనూ కొనసాగుతుంటుంది. ఏకరూపంగా ఎక్కడా కనిపించదు. సామాజిక వివక్షతలను, విభేదాలనూ సమర్థించే మతతత్వవాదులు సాంస్కృతిక ఏకత్వం గురించి అసంబద్ధ వాగాడంబరాన్ని ప్రదర్శిస్తుంటారు. అందుకే సంస్కృతి అని చెప్పుకొంటున్న ఈ అంశాలలోని అసలు జీవితపు సారాన్ని పట్టుకుని, ఆధిపత్య వర్గాల విన్యాసాలను అర్థం చేసుకోవాలి. ప్రజా సంస్కృతిని కాపాడుకోవాలి బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ వివక్షతల, పీడనల, వేదనల తొలగించే బతుకుకోసం, సమానతల, సంతోషాల బతుకు కోసం పోరుపాటను ఎత్తుకోవాలి. బతుకునిచ్చే అమ్మలు తలెత్తుకుని బతకాలి.