Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాదక ద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా పరిణమించాయి. డ్రగ్స్ గ'మతు'్తలో యువత జీవితాలు చిత్తు అవుతున్నాయి. ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత వీటికి బానిసలుగా మారడంతో జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు. దుర్వ్యసనాల బారిన పడుతూ యుక్తవయసులోనే శరీర అంతర్భాగాలు తూట్లు పడి జీవచ్ఛవాలుగా మారుతున్నారు. మనదేశంలో యువతే అధికం.అందుకే వారినే లక్ష్యంగా చేసుకున్న మాఫీయాలు రోజుల తరబడి మత్తులో ముంచెత్తుతోంది. కళాశాలల విద్యార్థుల్లో చాలామంది ఈ అలవాటుకు బానిసవుతున్నారు. అనేక నేరాల్లో నిందితులైన యువతలో ఈ మత్తుపదార్థాలకు బానిసలైనవారే అధికం. ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతున్నదన్న వివిధ అధ్యయన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఉన్నత విద్యావంతులే ఎక్కువగా ఈమత్తులో జోగుతున్నారనేది కాదనలేని వాస్తవం. వీటి కొనుగోలుకు అవసరమైన డబ్బు కోసం బైక్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను దొంగతం చేస్తూ.. దొంగలుగా మారుతున్నారు. వీటి మత్తులో ఉన్మత్తులవుతూ కుటుంబ సభ్యుల పైనే దాడులు చేస్తున్న సంఘట నలూ అనేకం.
హెరాయిన్, కొకైన్, ఓపియం, గంజాయి వంటి మాదక ద్రవ్యాల లావాదేవీలతో కొన్ని కోట్ల రూపాయల ''గని''గా తయారైన ఈ డ్రగ్స్ మాఫియా ఉన్నత వర్గాలకు చెందిన యువతను పెడతోవ పట్టించడమేకాక కాలేజీ నుంచి స్కూలు విద్యార్థుల వరకు మత్తుకు బానిసలుగా మార్చివేస్తోంది. వారి భవిష్యత్తుతో, ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దీనికి అలవాటుపడినవారు సమయానికి తగిన మోతాదులో డ్రగ్స్వాడక పోతే పిచ్చెక్కిపోతున్న సంఘట నలు చోటుచేసుకుంటున్నాయి. నిఘా వ్యవస్థల కళ్ళు గప్పి మాదకద్రవ్యాల ముఠాలు వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నాయి. వీదేశీ యువకులు కొందరు విజిటర్ వీసాను అడ్డం పెట్టుకుని మనదేశానికి వస్తున్నారు. ప్రేమ, స్నేహం పేరుతో వలవేసి చివరకు డ్రగ్స్‌కు వారిని బానిసలుగా చేయడమే కాకుండా వారి ద్వారానే డ్రగ్స్ రవాణా సాగిస్తున్నారు.
ప్రపంచ మాదక ద్రవ్య నివేదిక-2020 ప్రకారం అభివద్ధి చెందుతున్న దేశాల్లో మత్తుపదార్థాల వినియోగం ఏటా పెరుగుతోంది. ఒకప్పుడు యువత మద్యపానం, ధూమపానం తదితర చెడు వ్యసనాలపాలై ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు. ఇప్పుడు యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోంది. దీనివల్ల వీరికి తాత్కాలిక ఆనందం కలగటానికో,వాస్తవ పరిస్థితుల నుంచి తప్పించుకోడానికో ఉపయోగపడుతుంది. కానీ, అది ఇంటిని, ఒంటిని, కుటుంబాన్ని ధ్వంసం చేస్తోంది.
గుజరాత్ లోని ముంద్రా పోర్టులో రూ.24000 కోట్లు విలువైన హెరాయిన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఇటీవల ముంబయి-గోవా క్రూయిజ్ నౌకలో ఒక రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలతో పట్టుబడటం కలకలం రేపింది. తెలంగాణలో 2017లోనే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ రాకెట్‌ను అధికారులు ఛేదించారు. అయినా 'చాపకింద నీరులా' చడీచప్పుడు కాకుండా నగరంలోని ప్రముఖ ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన కొందరు విద్యార్థులు అధిక మోతాదులో మత్తు పదార్థాలు వాడుతూనే ఉన్నారు. భాగ్యనగరంలో ఏటా వెయ్యి కోట్ల వ్యాపారం సాగుతోందనేది భయంకరమైన వాస్తవం. నిన్న కాక మొన్న రాష్ట్ర తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు సైతం డ్రగ్స్ మాఫియా మాదకద్రవ్యాలను సరఫరా చేసినట్టు ఆరోపణలు వినిపించినా విచారణలో ఏమీ తేల్చలేదు.ఇందులో కొందరు రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు ఆర్థిక లావాదేవీలు ఉండటంవల్లే కేసులు నీరుగారుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా నిజాయతీగా విధులు నిర్వర్తిస్తే మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగాలను సమర్థంగా కట్టడి చేయవచ్చు.
పాలకుల తప్పుడు విధానాల ఫలితంగా పెడపోకడలు, ఊడలు దిగిన సామాజిక విషతుల్య వాతావరణం, అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుతున్న అంతర్జాలం, తల్లిదండ్రులు తమ పిల్లలతో గడపకపోవడం, విద్యావ్యవస్థలో లోపాలు, విద్యార్థులపై ఒత్తిడి, క్షీణిస్తున్న సామాజిక విలువల ఫలితంగానే భావితరం దారి తప్పుతున్నది. చెడు లక్షణాలేవి ఒక్కసారితో అబ్బవు. కుటుంబ సమస్యలు, విద్యా ఉద్యోగ సమస్యలు, పేదరికం పరిష్కరించుకోలేక వీటికి బానిసలవుతున్నారు. కేవలం సంఘటనలు జరిగినప్పుడే ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం మేల్కొంటున్న తీరు సమాజానికి సిగ్గుచేటు. ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? యువతకు ఎదురౌతున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్న ప్రభుత్వాలు వారిని ''మత్తు''లో తూలడమే మేలనుకుంటుంది. దీనికి తోడు మతోన్మాదం,కులోన్మాదమూ మత్తును మరింత దట్టిస్తోంది. అప్రజాస్వామిక విధానాలను, వైఫల్యాలను ప్రశ్నించకుండా ''మత్తు' లో జోకొడుతోంది. యువతను మత్తులో ఉంచడం అంటే అది ప్రభుత్వాల బాధ్యత లేని తనానికి నిలువుటద్దం.