Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడు సంవత్సరాల ప్రజాపోరాటం తరువాత ఏర్పడిన చీలీ రాజ్యాంగ పరిషత్ చీలీ పౌర సమాజాన్ని రాజకీయ ఆర్థిక వ్యవస్థలను ప్రజాతంత్రీకరించే యజ్ఞం ప్రారంభించింది. చీలీ ప్రజలు ఇప్పుడున్న పెట్టుబడిదారీ ప్రజాస్వామిక రాజ్యాంగం స్థానంలో ప్రత్యామ్నాయ ప్రజాతంత్ర రాజ్యాంగాన్ని, నిజమైన ప్రజా ప్రాతినిధ్యంతో కూడిన రాజ్యాంగాన్ని రూపొందించేందుకు కృషి ప్రారంభించారు. ఈ యజ్ఞం బూర్జువా పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం, బూర్జువా రాజ్యాంగాల గురించిన ప్రాథమిక చర్చకు తెరతీసింది.నూతన రాజ్యాంగ పరిషత్‌లో టీచర్లు, సామాజిక కార్యకర్తలతో పాటు ఇంటి పని కార్మికురాలు కూడా సభ్యురాలైంది. ఈ రాజ్యాంగ పరిషత్‌లో సగానికి సగం మహిళలు సభ్యులు కావడం ఒక చారిత్రక సన్నివేశం.
ప్రత్యామ్నాయ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు వెనుక దాదాపు ఐదు దశాబ్దాల పాటు చీలీ ప్రజలు నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా సాగించిన వీరోచిత పోరాటాలు పునాదిగా ఉన్నాయి. పాపులర్ యూనిటీ ఫ్రంట్ వేదికగా బూర్జువా ప్రజాస్వామిక ఎన్నికలలో అధికారానికి వచ్చిన సాల్వడార్ ఆలెండీ చీలీ సమాజాన్ని మార్చడానికి కావాల్సిన ఎజెండాను ప్రజల ముందు ఉంచాడు. సామాజిక సేవలు సార్వత్రికంగా ప్రజలకు అందుబాటులోకి తేవడం, భూసంస్కరణలతో పాటు, చీలీలో 98శాతం పండ్ల వ్యాపారం అమెరికా ఫ్రూట్ కంపెనీ ఆదీనంలో ఉంటే దానిని కూడా జాతీయం చేశారు. బ్యాంకులను జాతీయం చేశారు. రాగి పరిశ్రమల జాతీయీకరణ వంటి అంశాలు ఆలెండీ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ కార్యక్రమంలో ముఖ్యమైనవి. దీనితో పాలకవర్గం, అమెరికా సామ్రాజ్యవాదం ఉలిక్కిపడింది. అప్పటికే నాలుగు దశాబ్దాలుగా అమెరికా కనుసన్నలలో సాగుతున్న పాలనలో 40శాతం చీలీ ప్రజలు పౌష్టిక ఆహార లోపంతో బాధపడ్డారు. సగానికి సగం కార్మికవర్గం కనీస వేతనాలకు నోచుకోలేదు. ఇటువంటి జీవితాలను మార్చగలమన్న భరోసాను అలెండీ నాయకత్వంలోని పాపులర్ యూనిటీ ఫ్రంట్ కలిగించింది. చీలీ కోసం చీలీ తరహా ప్రత్యామ్నాయం అనే నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్ళారు. బూర్జువా ప్రజాస్వామిక రాజ్యాంగాల ద్వారా పాలకవర్గ పొందికను మార్చేందుకు ఒక ప్రయత్నం జరిగింది.
ప్రజలు పాపులర్ యూనిటీ ఫ్రంట్‌ని అధికారంలోకి తేవడాన్ని పాలకవర్గం ప్రత్యేకించి సామ్రాజ్యవాద అమెరికాతో మిలాఖత్ అయిన పాలకవర్గం సహించలేకపోయింది. ఈ ప్రయోగం సఫలమైతే లాటిన్ అమెరికాతో పాటు పలు వర్థమాన దేశాలలో విప్లవాలు తిరుగుబాట్లు సంభవించే ప్రమాదం ఉన్నదని నిక్స్న్ ప్రభుత్వం ఆందోళన చెందింది. ఆలెండీ ప్రయోగాలను విఫలం చేయడానికి దేశంలో రాజకీయ ఆర్థిక అస్థిరతను ప్రేరేపించడానికి సామ్రాజ్యవాదం చేయని ప్రయత్నం లేదు. అంతిమంగా 1973 సెప్టెంబర్ 13న అమెరికా సామ్రాజ్యవాద కుట్రలకు పాపులర్ యూనిటీ ఫ్రంట్ ప్రభుత్వం బలి అయింది. నాటి నుండి ఐదు దశాబ్దాల పాటు చీలీ పౌరజీవనం నయా ఉదారవాద విధానాలకు ప్రయోగశాలగా మారింది. అవధులులేని ప్రయివేటీకరణకు ఆటస్థలంగా మారింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవనం గుత్తపెట్టుబడిదారీ శక్తుల కబంధ హస్తాలలో బందీ అయింది. ఉదాహరణకు మురుబెనీ కార్పొరేషన్ దేశంలో పెన్షన్స్ మొదలు, తాగునీటి సరఫరా, విద్యుత్ వ్యవస్థ వరకు అన్ని రంగాలను తన గుప్పెట్లో పెట్టుకుంది.
1988 వరకు ఆధిపత్యం చెలాయించిన పినోచెట్ అంతిమంగా ప్రజాదరణ కోల్పోయాడు. పినోచెట్ అధికారం చివరి రోజులలో రూపొందించిన రాజ్యాంగం చీలీ ఆర్థిక రాజకీయ జీవితాన్ని నయా ఉదారవాదం వైపు నడిపించడానికి కావాల్సిన రక్షణలను ఏర్పాటు చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు ఆల్విన్ ఏకంగా నయా ఉదారవాదాన్ని రాజ్యాంగబద్దంగా మలిచాడు. నాటి నుండి నేటి వరకు చీలీ ప్రజలు ఈ విధానాలకు వ్యతిరేకంగా వైవిధ్య భరితమైన పోరాటాలు సాగించారు. ఈ పోరాటంలో ఒక కీలక ఘట్టం విద్యాహక్కు పరిరక్షణ కోసం సాగిన పోరాటం. ఈ పోరాటంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, బాలలు ఉపాధ్యాయ సంఘాలు కీలక భూమిక పోషించాయి. అంతిమంగా అక్టోబర్ 2019లో లక్షలాదిమంది ప్రజలు చీలీ రాజధాని శాంటియోగోను చుట్టుముట్టారు. ప్రభుత్వం కాల్పులకు పాల్పడింది. అంతర్జాతీయ న్యాయస్థానం ముందు దోషిగా నిలబడింది. ఈ పరిస్థితిలో 2021 జూలై 4న జరిగిన సదస్సు ప్రత్యామ్నాయ రాజ్యాంగానికి డిమాండ్ చేసింది. యాభైయేండ్ల క్రితం ఆలేండీ ప్రారంభించిన చీలీకోసం చీలీ తరహా సోషలిజం తరహా నినాదాన్ని ఆచరణ సాధ్యం చేసుకోవడానికి నూతన రాజ్యాంగ పరిషత్ నడుం కట్టింది. ఈ పరిణామాలు వర్థమాన దేశాల ప్రజాతంత్ర రాజ్యాంగాల గురించి పునరాలోచన చేయాల్సిన అంశాల్ని ముందుకు తెస్తున్నాయి.