Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మనసు గతి ఇంతే! మనిషి బ్రతుకింతే! మనసున్న మనిషికి సుఖములేదంతే!' అని పాడుకున్నాడు కవి. మానసిక విషయాలపైన ఫ్రాయిడ్, యంగ్ మొదలైన శాస్త్రవేత్తలు చాలా శోధించి కొన్ని నిర్ధారణలూ మనముందుపెట్టారు. మనసు, మానసికత అనే విషయాలు యెల్లకాలాలకు, ప్రదేశాలకు ఒక్కతీరుగా ఉండవన్నది అర్థం చేసుకోవాల్సిన అంశం. యుద్ధాలు జరగటానికి వ్యక్తుల మానసికతలు కారణమన్న ఫ్రాయిడ్ రాజకీయ, ఆర్థికాంశాలను పరిగణలోకే తీసుకోలేదు. మంచి మనసు కలిగి ఉండటమూ, చెడు మనసుకూ గల కారణాలూ, మనుషుల వ్యక్తిత్వ నిర్మాణాలూ వేటీమీద ఆధారపడి ఉన్నాయో తెలుసుకోకపోతే మనుషులను, మనసులను తిట్టిపోస్తూనే ఉంటాము.
ఈ మధ్య కాలంలో మానసికపరమైన అనేక సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. విపరీత ప్రవర్తనలు, ఒత్తిడులలో యువత మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. మనదేశంలో పిల్లలు, యువత ఈ రకమైన జబ్బుల బారిన పడుతున్నారు. ప్రతి నాలుగు కుటుంబాలలో ఒక కుటుంబం ఈ ఇబ్బందులు కలిగి ఉన్నారని ఓ అధ్యయనం తెలుపుతోంది. ప్రతి పదకొండు నిముషాలకు ఒకరు బలవన్మరణాలకు పాల్పడి జీవితాలను ముగిస్తున్నారంటే మానసికపరమైన సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కుటుంబాలలో హింస, నేరప్రవృత్తి పెరగటం, ముఖ్యంగా యువతలో మానవసిక దౌర్భాల్యాలు ఎక్కువ కావటానికి ప్రధాన కారణం ఉపాధిలేకపోవటం, ఉద్యోగాలు ఊడిపోవటం, భవిష్యత్తు పట్ల ఏ రకమైన భరోసా కనిపించకపోవటం కారణాలని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. అవును ప్రపంచ వ్యాపితంగా 29శాతం మంది పిల్లలకు కనీస తిండి కరువైందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇరువైరెండు శాతం పిల్లలు బాల కార్మికులుగా, తమ వయసుకు మించిన పనిని చేస్తూ ఒత్తిడికి గురవుతున్నారు. బాల్యంలో ఆహార లోపాలు, హింసకు గురికావడమూ, ఆదరణ లేకపోవటమూ మానసిక సమస్యలకు కారణంగా చెప్పుకోవచ్చు.
కాబట్టి ఇది మానసిక వైద్యులతోనో, ఆసుపత్రులతోనో తొలగిపోయే సమస్య కాదు. కానీ నేటి మానసిక నిపుణులు, గైడ్లు, కౌన్సిలర్లు వ్యక్తిత్వాలను మార్చుకోవటం మనచేతుల్లోనే ఉందని, సానుకూల దృక్పథంతో దేన్నయినా పరిష్కరించుకోవచ్చనీ ప్రబోధం చేస్తుంటారు. జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి. ఎలా ఆలోచించాలి. ప్రవర్తన ఏవిధంగా మార్చుకోవాలి అనే విషయాలు మన ప్రవర్తన, ఆలోచనల మీదే ఆధారపడి ఉంటాయని చెబుతారు.
ఏ సమస్యనయినా వ్యక్తులకు ముడిపెట్టి పరిష్కారం చూపిస్తారు. దోపిడీలు, యువత మీద మాదక ద్రవ్యాల ప్రభావం, ఆరోగ్య సమస్యలు, అసమానతలు, రాజకీయ నిరసనలు, సామాజిక కట్టుబాట్లు, ధనిక పేద అసమానతలు ఏది చెప్పినా వ్యక్తి కేంద్రంగా పరిష్కారాలు వెదకాలని చెబుతుంటారు. చివరికి ఆర్థిక వ్యవస్థ పతనం కూడా ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం వల్లే జరిగిందంటారు. కానీ దోపిడీ దురాశ మూలస్తంభాలుగా ఎదిగిన ద్రవ్యపెట్టుబడి అనివార్యమైన దుష్పరిణామమని మాత్రం అంగీకరించరు. మన మానసిక విశ్లేషకులంతా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోని అపసవ్య సంబంధాలను వ్యక్తుల అంతరంగిక జీవితానికి, మానసిక ప్రవృత్తులకూ ఆపాదిస్తున్నారు. ఎవరైతే ఈ వ్యవస్థను, ఇందులోని అసమానతల్ని అంగీకరించి తదనుగుణంగా నడుచుకుంటారో వాళ్ళది ఆరోగ్యకరమైన మనస్తత్వం. నిరసన తెలిపేవాళ్ళది నేర స్వభావంగా నిర్ధారిస్తున్నారు.
మనం మంచి మనసున్న వ్యక్తులుగా నిరూపించుకోవటానికి పనిచేసేచోట కార్మికుడు, గుమస్తా, సేల్స్‌మెన్ ఎవరైనా వాళ్ళకిచ్చే వేతనాలెంతున్నా పూర్తి శ్రద్ధతో, ఏకాగ్రతతో పనిలో నైపుణ్యాలను నిరూపించుకుంటూ ఎక్కువ గంటలు పనిచేయడమే సానుకూల దృక్పథంగా పేర్కొంటారు. నిరసన తెలపటం, అసంతృప్తి వ్యక్తపరచటం, ఆందోళన చేయటం, జీతాలు పెంచాలని డిమాండ్ చేయడం మొదలైనవన్నీ మానసిక రోగ లక్షణాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా పని దొరకకపోవటానికి, ఉద్యోగం రాకపోవటానికి, ఉన్నతమైన జీవితం గడపలేకపోవటానికి, వేతనాలు పెరగకపోవడానికి తమ తమ వ్యక్తిగత లోపాలు, మానసిక సమస్యలే కారణమని చెప్పేవాళ్ళంతా ప్రభుత్వ నిర్ణయాలు, ప్రయివేటు పరమవుతున్న పరిశ్రమలు, ఉద్యోగుల తొలగింపు, ధరలు పెరిగి, ఆదాయాలు తగ్గిపోవడం, పరిశ్రమలు మూతపడటం మొదలైనవన్నింటినీ పరిగణించకుండా, వాటి పట్ల ఏ వైఖరినీ ప్రదర్శించకుండా వ్యక్తి కేంద్రంగా సమస్యలను పరిష్కరించుకునే సూచనలే చెబుతుంటారు.
మానసిక రుగ్మతలకు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కారణాలు మూలాలు కాగా, వాటి నుండి దృష్టిని మరల్చే ప్రయత్నంలో వ్యక్తి కేంద్రంగా సమస్యను మారుస్తుంటారు. ఓటములకు, అణగారిన తనానికి ఎవరికి వారే కారకులు అని తేల్చేయడంలోనే వ్యవస్థాగతమైన కుట్ర దాగి ఉంది. ఆరోగ్యవంతమైన వ్యవస్థ నిర్మాణంలోనే మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. అన్యాయాలకు, దౌర్జన్యాలకు, దోపిడీకి కేవలం వ్యక్తులు, వారి మానసికత కారణం కాదు. మనిషి, మనిషిగా కొనసాగలేని వ్యవస్థ మనసునూ జబ్బులతో నింపుతుంది. మన సమాజంలో పెరుగుతున్న ఈ రకమైన రుగ్మతలకు కారణం కూడా దోపిడీ పీడన పెరిగిన వర్తమానపు వ్యవస్థే. పైపై పరిష్కారాలెప్పటికీ అందమైన మనసును అందించలేవు.