Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎయిరిండియా మళ్ళీ టాటాసన్స్ ఎయిరో డ్రోమ్లో ల్యాండ్ అయినందుకు, అదీ ఎదురు సొమ్మిచ్చి కట్టబెట్టినందుకు దేశ కార్పొరేట్లు ఆనంద డోలికల్లో పరవశిస్తున్నారు. 130కోట్ల సామాన్యులు తమ రక్తమాంసాలతో దశాబ్దాల పాటు నిర్మించుకున్న ప్రభుత్వరంగ సంస్థల్ని మోడీ అస్మదీయులు ఒక్కొక్కటిగా కబ్జా పెడుతున్నందుకు కసితో రగిలిపోతున్నారు. షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్, పవన్ హన్స్, ఐడిబిఐ బ్యాంకు, అన్నిటికంటే మించి బిపిసిఎల్ వంటివి వధ్య శిలపైకెక్కడానికి 'క్యూ'లో నిలబడి ఉన్న వాస్తవం సామాన్యుల ఆందోళనకు మరోకారణం.
టాటాల ''మహరాజా'' మళ్ళీ టాటాలకే దక్కినందుకు కొందరు మహదానంద భరితులవుతున్నారు. దీపం (డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజిమెంట్) కార్యదర్శి టి.కె. పాండే విశ్లేషణ ఏమంటే రోజుకు ఇరవైకోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఆదా అయ్యిందట! ఎయిరిండియాను జాతీయం చేసినప్పటి నుంచి ప్రభుత్వ ఖజానా నుండి అనేక లక్షల కోట్లు దాన్లోకి పంపిన విషయం ఈ పాండేసాబ్ చెప్పడు. గత పదేండ్లలోనే రూ.1.10లక్షల కోట్లు (రూ.58,000 కోట్లు డబ్బు రూపేణ, మిగిలింది క్రెడిట్ గ్యారంటీ రూపంలో) సాయం చేశారన్న విషయం మంత్రివర్గ ఉపసంఘం నాయకుడు అమిత్‌షా గాని, అసలు మూలవిరాట్గాని చప్పుడు చేయరు. ఎయిరిండియా అప్పులు రూ.61,562 కోట్లలో రూ.46,262 కోట్లు ప్రభుత్వమే వాల్చుకుంటుంది. వందకి పైగా విమానాలు, వేల సంఖ్యలో శిక్షణ పొందిన పైలెట్లు, ఇతర సిబ్బంది, ప్రపంచ వ్యాపితంగా మంచి లాభదాయకమైన పార్కింగ్ స్థలాలు టాటాల పరమవుతాయి. ఈ విషయాలు ''భక్తులే'' కాదు, నేటి మన సమాజంలో మేధావులుగా చెలామణి అవుతున్న వారుసైతం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.
ఇది టాటాలతో ప్రారంభమై, టాటాలతో ముగిసిపోయే లోహ విహంగాల కథ మాత్రమే కాదు, జాతీయోద్యమ ఆకాంక్షలను చిదిమేసే కథ. దాదాపు ఆరు దశాబ్దాలపాటు కోట్లాది భారతీయుల స్వేదంతో, కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ పరిశ్రమలకు చరమగీతం పాడే కథ. సామ్రాజ్యవాద విష కౌగిల్లోకి పోకుండా మనదేశం తన కాళ్ళపై తాను నిలబడ్డ ఆర్థిక స్వావలంబనకు ఆలంబనగా నిలిచిన ప్రభుత్వరంగాన్ని విధ్వంసం చేసే కథ!
రాజీవ్ పాలన (1985)లో విత్తనమై మొలకెత్తి, పీవీ, మన్మోహన్సింగ్ల పాలనలో మొక్కై, నేడు మానై ఊడలు వేసింది. ''అందరూ బెల్ట్‌లు గట్టిగా బిగించుకుంటే మూడేండ్లలో సుఖమే సుఖం'' అన్న మన్మోహన్సింగ్ 1995లో ఐఎన్టీయూసీ అఖిల భారత సమావేశంలో ఆరేండ్లలో ఫలితాలొస్తాయన్నారు. ముప్పయేండ్లయింది. నిజమే! ఫలితాలొస్తున్నాయి. అంబానీ, అదానీ, టాటాలకు ఎర్ర తివాచి పరిచే ఫలితాలొస్తున్నాయి. ముఖేష్ అంబానీ గంటలో సంపాదించే మొత్తాన్ని ఒక అసంఘటిత కార్మికుడు సంపాదించాలంటే పదివేల సంవత్సరాలు పడుతుందని ఆక్స్‌ఫామ్ 2021 నివేదిక 'ఇనీక్వాలిటీ వైరస్' పేర్కొంది. వందమంది భారతీయ బిలియనీర్ల సంపద 2020 మార్చి నుండి ఒక సంవత్సరంలో రూ.12,97,822 కోట్లు పెరిగింది. పాలకులు చెప్పే కాకమ్మకబుర్లు నిజమైన సందర్భంలేదు. పేదరికం, ఆకలి, నిరుద్యోగం, నిరనక్షరాస్యత పెరుగుతూనే ఉన్నాయి.
మొదట ''సున్నితం''గా వాటాల అమ్మకం అన్నారు. 1991 నుండి నేటి మోడీ సర్కార్ వరకూ ఏ ప్రభుత్వమూ అనుకున్న లక్ష్యాలు చేరలేదు. తర్వాత పీపీపి అన్నారు. ఆ తర్వాత వ్యూహాత్మక అమ్మకాలన్నారు. అదీ విజయవంతంగా నడిచినట్లులేదు. ఒక పక్క ఎన్నికలు తరుముకొస్తున్న వేళ, ఆలస్యాన్ని భరించలేని పెట్టుబడిదారులకు తెగించి ఏదో ఒకటి చేయాల్సిన స్థితిలో మోడీ ప్రభుత్వం పడింది. నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ (ఎన్ఎండి) అవతరించింది. లీజు పేర గరిష్టంగా 50ఏండ్లు 13రంగాలను, రైల్వేలు, విద్యుత్ లైన్లు, జనరేషన్ కేంద్రాలు, సహజ వాయుల పైప్లైన్ల నుండి వేర్‌హౌసింగ్, రియల్ ఎస్టేట్ రంగాల వరకు పైసా ఖర్చులేకుండా దేశ, విదేశీ కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు ఈ ఎన్ఎంపి ఉపయోగపడుతుంది. ఒకపక్క దేశవ్యాపిత మౌలిక సదుపాయాల కోసం రూ.111లక్షల కోట్లు అవసరమని చెపుతూ పై మోనిటైజేషన్ ద్వారా రూ.6లక్షల కోట్లు వస్తాయని చెప్పడం ప్రభుత్వ ఉద్దేశాలను చెప్పకనే చెపోతోంది కదా!
మోడీ ప్రభుత్వ ఈ విధానాలు దేశ పారిశ్రామిక రంగాన్ని కార్పొరేట్లపరం చేస్తాయి. కార్పొరేట్ల దాహం ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్ని ఆక్రమించుకోవడంతో పరిసమాప్తి కావట్లేదు. వ్యవసాయాన్నీ కబళించేందుకు మూడు చట్టాలు సిద్ధమైనాయి. దేశంలోని పార్లమెంటరీ సాంప్రదాయాలన్నీ దిగదుడుపునకు గురైనాయి. పార్లమెంటులో ఏ చర్చా లేకుండా, కనీసం దేశంలో ఈ ఎన్.ఎమ్.పి. డాక్యుమెంటును చర్చకు విడుదల చేయకుండా అమలుకు పూనుకోవడం కనీస ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వడమే. అధికారపగ్గాలు చేపట్టగానే ''కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన'' నినాదమిచ్చాడు మోడీసాబ్. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ''ప్రభుత్వరంగం పుట్టిందే చావడానికి! కొన్ని ముందే చస్తారు, కొన్ని కాలక్రమంలో చస్తారు'' అన్నది కూడా ఈ పెద్దమనిషే! ఆయన వంచితే వంగడానికి, చంపితే చావడానికి భారతదేశ కష్టజీవులు అశక్తులు కాదు. సశక్తులు!