Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సమాచార హక్కు కేవలం సమాచారం తెలుసుకునేందుకు కాదు. ప్రభుత్వంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి. పాలనకు సంబంధించి గతంలో రహస్యాలు ఉండొచ్చు. మా ప్రభుత్వంలో ఎలాంటి దాపరికాలకు స్థానం లేదు. పారదర్శకతకు ఎంత ప్రాధాన్యమిస్తే ప్రజలకు ప్రజాస్వామ్యంపై అంత ఎక్కువ నమ్మకం కలుగుతుంది. దానికోసమే మా ప్రయత్నం.' సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) బలోపేతంపై 2015లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలివి. ఇంకేముంది ప్రజలందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వం, అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేసేలా సమాచార హక్కు చట్టాన్ని కేంద్రప్రభుత్వం బలోపేతం చేయబోతుందని అంతా ఆశించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా ఆ చట్టం కోరలు పీకే పనికి మోడీ సర్కార్ ఏర్పాట్లు చేస్తుండటం ఆందోళనకరం. ప్రజలు పోరాడి సాధించుకున్న ఈ చట్టం ఆది నుండి అనేక ఆటుపోట్ల మధ్యే పదిహేనేండ్లు పూర్తి చేసుకుంది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మరింత దూకుడుగా ఈ చట్టాన్ని బలహీన పరిచే కుట్రలకు పాల్పడుతోంది.
స్వాతంత్య్రానంతరం పౌరుల ప్రాథమిక హక్కులపై దేశంలో ఎప్పుడూ ఏదో ఒక స్థాయిలో దాడి జరుగుతూనే ఉంది. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణం భావ ప్రకటన స్వేచ్ఛను పౌరులకు ప్రాథమిక హక్కుగా నిర్థారించింది. ప్రభుత్వ శాఖలనుంచి సమాచారం సేకరించడం వంటివి క్రమంగా భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగంగా మారాయి. సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో వెలువరించిన తీర్పులే ఇందుకు ప్రాతిపదికలయ్యాయి. 'ప్రజల వల్ల, ప్రజల చేత, ప్రజల కోసం' ఏర్పడిన ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ రికార్డుల్లోని సమాచారాన్ని తెలుసుకొనే హక్కు తరతమ భేధం లేకుండా ప్రజలందరికి ఉండాలి. గడచిన ఏడు దశాబ్దాలుగా ఈ హక్కులకు పరిమితులు విధించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నా, ఎప్పటికప్పుడు కోర్టులు జోక్యం చేసుకొని ఈ హక్కులను కాపాడటం కొంతలో కొంత ఊరట కలిగించే పరిణామం. సమాచార హక్కు అన్నది ప్రభుత్వాల చొరవ, సహకారంతో ముడివడిన విషయం. తాము తీసుకొనే నిర్ణయాల వెనక కారణాలు, అవసరాలను ప్రజలకు వెల్లడించేందుకు సర్కార్లేవీ అంతగా ఇష్టపడకపోవడంతో ప్రజలకు ఈ చట్టం అంతుచిక్కని బ్రహ్మపదార్థంగా మిగిలిపోయింది.
సమాచార హక్కుకు చట్టబద్ధత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్దయెత్తున డిమాండ్ చేయడంతో పదిహేనేండ్ల క్రితం అప్పటి యూపీఏ ప్రభుత్వం దిగివచ్చింది. 2005 అక్టోబరు 12న సమాచార హక్కుకు సంపూర్ణ చట్టబద్ధత కల్పిస్తూ కొత్త అధ్యాయానికి తెరలేపింది. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రతి సమాచారాన్నీ ప్రజలకు వెల్లడించవచ్చునని, 8(1) నిబంధన ప్రకారం పది విభాగాలుగా వర్గీకరించిన వివరాలను మాత్రం నిరాకరించవచ్చునని ఆ చట్టంలో స్పష్టం చేసింది. అధికార రహస్యాల చట్టం లేదా మరే చట్టాలు, ఇతర నిబంధనల ప్రకారం కూడా పౌరులకు సమాచారం ఇవ్వకుండా నిరాకరించరాదు. సమాచార హక్కు చట్టం ప్రజలకు సాధికారత కల్పించింది. ప్రభుత్వ విభాగాలన్నీ జవాబుదారీతనంతో మెలగాల్సిన అవసరాన్ని చాటిచెప్పింది. కానీ దీంతో ప్రజా చైతన్యం వికసించడం ఏలినవారికి ఇబ్బంది కలిగించినట్టుంది. దాంతో చట్టం తెచ్చిన ఏడాది కాలంలోనే సవరణలు చేసి దాన్ని నీరుగార్చేందుకు 2006లో అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు మిన్నంటడంతో సర్కారు వెనక్కితగ్గింది. ఆ తరవాత మరో రెండు సందర్భాల్లోనూ చట్టాన్ని బలహీనపరచేందుకు ఎక్కడైనా సందు దొరుకుతుందేమో అని చూసిన ప్రభుత్వం- జనాగ్రహంతో ఆ ప్రయత్నాలను విరమించుకుంది. కానీ, నేడు అధికారంలో ఉన్న బీజేపీ పాలకుల ప్రజాభిప్రాయమన్నా, జనాగ్రహమన్నా లెక్కేలేదు. వారి మాటలకు చేతలకు పోలికే లేదు.
పాలకుల వైఖరిని బట్టే కేంద్ర అధికారులు నడుస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇష్టారాజ్యంగా సమాచారాన్ని నిరాకరిస్తున్నాయి. పద్మ అవార్డులపై నిర్దిష్టంగా అడిగిన సమాచారాన్ని హౌంమంత్రిత్వ శాఖ ఏకపక్షంగా నిరాకరించింది. పీఎంఓ కోవిడ్ సమయంలో వసూలు చేసిన పీఎం కేర్ ఫండ్ గురించిన సమాచారం సైతం తిరస్కరించింది. గత పదేండ్లుగా కొందరు చిత్తశుద్దిగల కమిషనర్లు, మరీ ముఖ్యంగా ఆర్టీఐ కార్యకర్తలు, ప్రసారమాధ్యమాలు చూపిన చొరవతో సహ చట్టంపై ప్రజల్లో అవగాహన పెరుగుతూ వచ్చింది. దరఖాస్తుల సంఖ్యా పెరిగింది. బడుగు బలహీనవర్గాలు, అల్ప, మధ్యాదాయ వర్గాల వారు ప్రధానంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాల కింద తమకు దక్కాల్సిన ప్రయోజనాలకు సంబంధించి చేసుకున్న దరఖాస్తులే ఎక్కువ. దశాబ్దాల నుంచీ సహ చట్టం అమల్లోవున్న అమెరికాలో గత ఏడాది 35 లక్షల ఆర్టీఐ దరఖాస్తులు వస్తే, భారతదేశంలో ఈ సంఖ్య 45 లక్షలు! ఇలాంటి కీలక సమయంలోనే ఆ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ చట్టంను పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు రక్షణ కవచంగా, ప్రజాస్వామ్య విలువలకు జవాబుదారీగా ఉండేలా బలోపేతం చేయాల్సిందిపోయి- వాటిని బలహీనపరచేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఏమాత్రం ఆమోదనీయం కాదు! ఈ సహ చట్టం స్వాహా చట్టంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజలదే.