Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది 'ఇష్టాగోష్టి' సమావేశమే అయినా.. అమాత్యులవారు మాట్లాడినవన్నీ విధానపరమైనవే. తమ రాజ్యంలో సర్పంచులు 'సిరి సంపదలతో తులతూగుతున్నార'ని, ఇక వారికి 'ఆత్మహత్యల' అవసరమెక్కడిదంటూ కేటీఆర్‌గారు చెప్పుకొచ్చారు. గాంధీజీ చెప్పినట్టు 'గ్రామ సీమలే పట్టుగొమ్మలు'గా నిలిచాయనీ, తెలంగాణలో ఆ గ్రామాలే వెన్నెముకగా ఉన్నాయని చిన్న సార్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ప్రభుత్వ పెద్దలు... దేశంలో గర్వంగా తలెత్తుకునే సర్పంచులు ఎక్కడైనా ఉన్నారా అంటే అది తెలంగాణలో మాత్రమేనంటూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఢంకా బజాయించి చెప్పారు. అమాత్యుడైన అధికార పార్టీ కార్వనిర్వాహక అధ్యక్షుడు సైతం... 'సర్పంచులకు అప్పుల్లేవు.. ఆత్మహత్యలు అంతకంటే లేవంటూ...' తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. ఈ విధంగా ఢంకా బజాయించటాలు, కొట్టిపారేయటాల మాటెలా ఉన్నా... ఇప్పుడు రాష్ట్రంలోని అత్యధిక మంది సర్పంచుల్లో ఏ ఒక్కర్ని కదిలించినా ఆర్థిక బాధలను ఏకరువు పెడుతుండటం బహిరంగ రహస్యం. 'విలేజ్ డెవలప్మెంట్ కమిటీ'లకు కన్వీనర్లుగా ఉన్న తాము... వాస్తవానికి కన్వీనర్లమే అయినా, సూపర్వైజర్ల కంటే ఎక్కువగా అవమానాల పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి కంఠ శోషకు, 'బయటకు చెప్పుకోలేని...' మూగ వేదనకు కారణాలను తరచి చూస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ ఆర్థిక కారణాలే కావటం ఇక్కడ ప్రస్తావానార్హం. ప్రభుత్వం వారు చెప్పినట్టు గతం కంటే జీపీ(గ్రామ పంచాయతీలు)లకు నిధులెక్కువ వస్తున్నప్పటికీ.. అప్పటితో పోలిస్తే ఇప్పుడు విధులు కూడా విపరీతంగా పెరిగాయి. ట్రాక్టర్ల నిర్వహణ, వాటికి డీజిల్ ఖర్చు, బ్యాంకులకు చెల్లించాల్సిన ట్రాక్టర్ల కిస్తీలు, సిబ్బంది జీతభత్యాలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, రైతు వేదికల నిర్మాణం, మంచినీటి కోసం మోటార్ల నిర్వహణ, వాటికి కరెంటు బిల్లులు, పల్లెప్రగతిలో భాగంగా చెత్తా చెదారాన్ని తీసేయించటం, పరిసరాల పరిశుభ్రత, దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ చేయించటం తదితరాంశాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఏ మూలకూ చాలటం లేదన్నది సర్పంచుల వాదన. ఒక్కోసారి చేసిన పనులకు కూడా మూడు, నాలుగు నెలల వరకూ పై నుంచి బిల్లులు రావటం లేదన్నది వారి ఆవేదన. ఒకవేళ వచ్చినా బ్యాంకులో చెక్కులు జమ చేస్తే... సంబంధిత నగదు తమ అకౌంట్లలో పడటానికి రెండు నుంచి నాలుగైదు నెలల వరకూ ఎదురు చూడాల్సి వస్తోందన్నది సర్పంచుల ఆక్రందన. ఈ సమస్యల గురించి స్థానిక ఎమ్మెల్యేకుగానీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికిగానీ ఎప్పుడైనా చెప్పుకున్నారా అంటే... 'వాళ్లతో గొడవెందుకులెండి... ఇంకో రెండేండ్లయితే మా టర్మ్ అయిపోతది... అప్పుడు రాజెవడో, రెడ్డెవడో...' అంటూ మూగ రోదన. ఉపాధి హామీ పథకం నిధుల పరిస్థితి కూడా ఇదే. మరోవైపు పంచాయతీలకు సంబంధించి సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కలిపి జాయింట్ చెక్్ పవరిచ్చిన దరిమిలా... ఇప్పుడు ప్రతీరోజూ ఇద్దరి మధ్యా రాజకీయ లొల్లి. ఈ క్రమంలో సర్కారు వారి ఆదేశిత కార్య క్రమాలతోపాటు మిగతా అభివృద్ధి పనులేవీ ముందుకు పోవటం లేదు.
మన ప్రభుత్వ పెద్దలు కేవలం మాటల్లో చెబుతున్న స్థానిక సంస్థల ఆత్మగౌరవం మాటల్లో తప్ప చేతల్లో కనిపించడం లేదు. ఈ స్థానిక సంస్థల ఆత్మగౌరవం పొరుగున ఉన్న కేరళలో భేషుగ్గా నిలబడుతున్నది. అక్కడి ప్రభుత్వ మార్గదర్శనంలో పంచాయతీలు ప్రతీ ఐదేండ్లకోసారి పంచవర్ష ప్రణాళికల మాదిరిగా అభివృద్ధి కార్యక్రమాలపై పక్కా ప్లాన్‌ను రూపొందించుకుని అమలుచేస్తూ ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా 45శాతం నిధులను స్థానిక సంస్థల ద్వారా ఖర్చు (జిల్లా పరిషత్‌ల నుంచి జీపీల దాకా) చేయిస్తూ, పంచాయతీల వారీగా జనాభా ప్రాతిపదికన నిధులను మంజూరు చేయిస్తున్నది. మిగతా 55శాతం డబ్బును రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించటం పరిపాటి. ఈ క్రమంలో అభివృద్ధి పనులకు సంబంధించి జీపీల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసుకుంటూ ముందుకు పోతారు. ఇదే సమయంలో ఎంత మేరకు డబ్బులు వస్తే, అంతమేరకే ప్లాన్ వేసుకుంటారు తప్పితే అడ్డదిడ్డంగా ఉండదు. మరోవైపు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా వ్యవసాయం లాంటి 29 కీలకాంశాలను అక్కడి ప్రభుత్వం పంచాయతీలకు అప్పజెప్పటం ద్వారా... వాటి కాళ్ల మీద అవే నిలబడి సొంతంగా పరిపాలించుకునే విధంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నది. కేరళ మార్గం మనకే కాదు, దేశానికే అనుసరణీయం. ఆ మార్గంలో చేసిన పనులకు బిల్లులు, చేయాల్సిన వాటికి అనుమతులివ్వటంతోపాటు జీపీలకు చాలినన్ని నిధులు, విధులు, అధికారాలిచ్చినప్పుడే ఏలికల 'బంగారు తెలంగాణ' స్వప్నం సాకారమవుతుంది. లేదంటే 'ఊపర్ షేర్వాణీ.. అందర్ పరేషానీ...' అనే సర్పంచుల ప్రస్తుత పరిస్థితి యధావిధిగా కొనసాగటం ఖాయం.