Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ ఆకలి సూచి (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జిహెచ్‌ఐ) జాబితాలో భారతదేశం 101వ స్థానానికి దిగజారడం ఆందోళనకరం. 2021 ఏడాదికిగాను 116 దేశాలకు ర్యాంకులివ్వగా ఇండియా అట్టడుగున కునారిల్లుతోంది. పొరుగునున్న పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ మన కంటే మెరుగైన స్థానాల్లో ఉండటం మన దుస్థితిని తెలియజేస్తోంది. మన కంటే కింద న్యూ గినియా, అఫ్ఘనిస్థాన్, నైజీరియా వంటి దేశాలే ఉన్నాయి. ఆకలి సూచిలో భారత్ గతేడాది 107 దేశాల్లో 94వ స్థానం వహించగా ఇప్పుడు 101కి పడిపోయి తీవ్ర ఆకలి సమస్య కలిగిన 31 దేశాల్లో ఒకటిగా నిలిచింది. తమ ఏలుబడిలో భారత్ ఆర్థికంగా ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతోందని ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటున్న సమయంలోనే, ఇండియాలో ఆకలి కేకలు పిక్కటిల్లుతున్నాయని జిహెచ్‌ఐ పేర్కొనడం ద్వారా బీజేపీ ప్రచార పటాటోపాన్ని ఎండగట్టినట్టయింది. గ్లోబల్ ఇండెక్స్ ర్యాంకులపై తల దించుకొని, ఆకలి సమస్య పరిష్కారానికి పటిష్టమైన కార్యాచరణను చేపట్టాల్సిన మోడీ ప్రభుత్వం అది వదిలేసి ర్యాంకులిచ్చిన సంస్థ శాస్త్రీయతను నిందించి ఎదురుదాడి చేయడం దాని దివాళాకోరుతనానికి పరాకాష్ట. కొన్నేళ్లుగా ఆకలి సూచి జాబితా రూపొందించిన జర్మనీకి చెందిన వెల్త్ హంగర్ హైఫ్ (డబ్ల్యుహెచ్‌హెచ్) ఒక్క భారత్ కోసమే సర్వే నిర్వహించలేదు. ఇండియా మీద ఆ సంస్థకు ద్వేషం ఉండాల్సిన అవసరం అసలే లేదు. అలాంటి సంస్థపై సైతం మోడీ సర్కారు రాజకీయం చేసి పొంతన లేని విమర్శలతో తెగనాడి తన వైఫల్యాలను కప్పిపుచ్చాలనుకోవడం సిగ్గు మాలిన పని.
పోషకాహార లోపం, చిన్నారుల్లో వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేకపోవడం, మరణాలు ఈ నాలుగు అంశాల ప్రాతిపదికన డబ్ల్యుహెచ్‌హెచ్ ర్యాంకులిచ్చింది. ప్రభుత్వ గణాంకాలనే ప్రామాణికంగా చేసుకుంది. ఆహార పంపిణీ, సమతుల్య లెక్కలే ఆధారం. ఫుడ్, అగ్రికల్చర్ విభాగం గణాంకాలు, వివిధ సందర్భాల్లో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, ప్రపంచ బ్యాంక్ సర్వేలను సమీకరించి అధ్యయనం చేసింది. మన సర్కారు క్రమానుగతంగా నిర్వహించే నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ప్రధాన ఆధారం. అమెరికా వ్యవసాయ విభాగం (యుఎస్డిఎ) తాజా నివేదిక ప్రకారం 76 దేశాల్లోని 120 కోట్ల మంది తిండికి అలమటిస్తుండగా ఆ దేశాల్లో ఇండియా కూడా ఉంది. ఈ దష్ట్యానే ర్యాంక్‌లపై భారత్ చేస్తున్న ఆరోపణలను డబ్ల్యుహెచ్‌హెచ్ ఖండించింది. పిచ్చి ప్రేలాపనలుగా తిప్పి కొట్టింది. మోడీ సర్కారుకు సర్వేలంటే కంపరం. తమ బండారం ప్రజలకు తెలుస్తుందన్న భయం. అందుకే సర్వేలనే రద్దు చేసింది. అయినప్పటికీ 2019-ఎన్ఎస్ఎస్ లీకైంది. మోడీ జమానాలో ప్రజల తలసరి ఆహార వినియోగం 4శాతం తగ్గింది. గ్రామీణ భారతంలో అది 10శాతం. అందుకే హంగర్ ఇండెక్స్‌లో 2017 నుండి ఇండియా స్థానం 100-103 మధ్య ఊగిసలాట.
సుస్థిర అభివృద్ధి సాధన అంటే ఏవో రెండు రోడ్లు, రెండు భవనాలు నిర్మించడం కాదు. ప్రజల ఆకలి సమస్యను పరిష్కరించడం. ఈ విషయాన్నే ఐక్యరాజ్య సమితి నొక్కి వక్కాణించింది. 2030 నాటికి ఆకలి లేని (జీరో హంగర్) సమాజ స్థాపన లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్పటికి కూడా ఆకలి సమస్యను పరిష్కరించడంలో వెనకబడుతున్న 41 దేశాల్లో ఇండియా ఉంటుందని అంచనా. రోజుకు 2,100 కేలరీల కంటే తక్కువ ఆహారం తీసుకుంటే పోషకాహార లోపం, ఆహార అభద్రత కింద మగ్గుతున్నట్లే. దేశంలో 70 శాతానికిపైన ప్రజలు ఆహార అభద్రతలో బతుకుతున్నారు. మహిళలు, అట్టడుగు వర్గాలు, వెనకబడ్డ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువ. కరోనా వంటి మహమ్మారులు విజంభించి నప్పుడు పరిస్థితి మరింత అధ్వానం. ఆహార భద్రత చట్టం అమల్లో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ కాలంలో ఇబ్బడి ముబ్బడిగా సాగు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది లేదు. అయినప్పటికీ ఆరు కోట్ల టన్నుల ధాన్యాలు గోదాముల్లో మూలుగుతున్నాయి. కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా, కరోనా సమయంలోనూ ప్రజలకు సరిపడా ఆహార ధాన్యాలను ఉచితంగా పంచట్లేదు. నయా-ఉదారవాద విధానాల్లో భాగమైన నగదు బదిలీ, ఒకే జాతి-ఒకే రేషన్ కార్డు, మోనిటైజేషన్ వంటివి ప్రజలకు ఆహారాన్ని మరింత దూరం చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వ విధానాలను తిప్పికొడితేనే ఆకలి సమస్య తీరుతుంది. హంగర్ ర్యాంకులతోనైనా మోడీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుంటుందా ?