Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్‌లో ఐదుగురు వలస కార్మికులు, ఒక కాశ్మీరీ పండిట్‌తో సహా 11మంది పౌరులను భద్రతా బలగాలు కాల్చి చంపేయడంతో జమ్ము కాశ్మీర్ అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్టోబర్ నెలలోనే 20 మందికిపైగా సామాన్య పౌరులు భద్రతా దళాలకు బలయ్యారు. ఉగ్రవాదుల హింసకు వీధి వర్తకులతో సహా అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 35ఎ, 370 రద్దు చేసినప్పటినుండి కాశ్మీరీలు అభద్రతా భావంలోనే మగ్గుతుండగా తాజా కాల్పులతో వలస జీవులు తమ మనుగడకు ముప్పు ఏర్పడిందని భీతావహులవుతున్నారు. వారేమైపోతారోనని తమ స్వగ్రామాల్లోని కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు సైతం భయపడుతున్న పరిస్థితి. ఎక్కడో బీహార్ నుండి పొట్ట చేతబట్టుకొని కాశ్మీరానికి వచ్చి వడ్రంగం, వ్యవసాయం, తాపీ పని వంటివి చేస్తూ జీవనం సాగిస్తున్న బడుగు జీవుల ప్రాణాలను భద్రతా దళాలు హరించడం బాధాకరం. ఏటా కాశ్మీరానికి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మొదలు బీహార్ వరకు అనేక రాష్ట్రాలనుండి వివిధ పనులు చేయడానికి లక్షలాది మంది మార్చిలో వచ్చి నవంబర్ చివర్లో వెళ్లిపోతుంటారు. జమ్ము కాశ్మీర్లో స్కిల్డ్, సెమి స్కిల్డ్ పనివారిలో 80శాతం మంది స్థానికేతరులేనని ఓ అంచనా. తాజాగా భయానక పరిస్థితులు నెలకొనడంతో వలస జీవులంతా తమ స్వగ్రామాల బాట పట్టక తప్పలేదు. దాంతో కాశ్మీరాన సంక్షోభం ఏర్పడుతుందని భయపడ్డ అధికార యంత్రాంగం వలస కార్మికుల్ని వారి స్వరాష్ట్రాలకు పోనివ్వకుండా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల సమీపంలోని ఫంక్షన్ హాళ్లు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో శిబిరాలకు మళ్లించడంతో బిక్కుబిక్కుమంటున్నారు. గడచిన 15-20 ఏండ్ల నుండి ఇక్కడకు వస్తున్నామనీ, ఏనాడూ ఇలాంటి అనుభవం ఎదురు కాలేదంటున్న వలస జీవుల వెతలు హృదయ విదారకం.
దేశంలో ఒక రాష్ట్ర కార్మికులు మరో రాష్ట్రంలో సుమారు ఆరు కోట్లమంది పని చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే (2016-17) పేర్కొంది. దేశంలో 45.6కోట్లమంది అంటే 40శాతం ప్రజలు వలసలు పోయి జీవిస్తున్నారని 2011జనాభా లెక్కల ప్రకారం తేలింది. కాబట్టి శ్రమజీవి ఏ రాష్ట్రం వాడు ఏ ప్రాంతం వాడు అన్న దానితో నిమిత్తం లేదు. శ్రమ, ఉత్పత్తి ముఖ్యం. అవి ఉంటేనే మిగతావన్నీనూ. కాబట్టి భారతీయులెవరైనా దేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లగలగాలి, తమకు చేతనైన పని చేసుకొని జీవనం సాగించే హక్కుండాలి. అయితే, స్థిరాస్తుల విషయంలో స్థానికులకు భారత రాజ్యాంగం, ఆయా రాష్ట్ర చట్టాలు కల్పించిన రక్షణలకు విఘాతం కలిగించరాదు. అటువంటి పరిస్థితులను కల్పించడం కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.
కొద్దిమంది అసాంఘిక వ్యక్తులను గుర్తించి తగు చర్యలు చేపట్టడం మాని మూకుమ్మడిగా ప్రజలందరినీ ఇబ్బందుల పాల్జేయడం ప్రభుత్వానికి తగని పని. శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, విద్రోహ శక్తులను అణచివేస్తామంటూ ఉన్నతాధికారులు హడావుడిగా 700మందిని అనుమానితుల పేరిట నిర్బంధించారు. ఇలాంటి తతంగాలు గతంలో ఎన్నో చూశామని జమ్ము కాశ్మీర్ ప్రజలు పాలకుల జిమ్మిక్కులను ఈసడించుకుంటున్నారు. నేటి నుండి హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన నేపథ్యంలో అధికారుల హడావుడి మరింత ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాన్ని సవరించుకోవడం అవసరం. గృహ నిర్బంధంలో మగ్గుతున్న మాజీ ముఖ్యమంత్రులతోసహా వివిధ రాజకీయ పార్టీల నాయకులను వెంటనే విడుదల చేయాలి. జమ్ము కాశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదానిచ్చి ఆర్టికల్ 35ఎ, 370లను పునరుద్ధరించాలి. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలి. పూర్తి అభద్రతా భావంతో ఉన్న జమ్ము కాశ్మీర్ ప్రజలకు భారత్ పట్ల సంపూర్ణ విశ్వాసం కల్పించాలి. అప్పుడే వారు పరాయి భావాన్ని వీడుతారు. మతాలు, భాషలు, ప్రాంతాల పేరిట విడదీయడం కాకుండా ప్రజలందరిమధ్య ఐక్యతను పెంపొందించాలి. యువతీ యువకుల ఉపాధి కల్పనకు పెద్దయెత్తున చర్యలు చేపట్టాలి. కాశ్మీరీలందరికీ భరోసా కల్పించాలి. అప్పుడే సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించడం, నివారించడం సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో సానుకూల చర్యలు చేపట్టకపోతే పరిస్థితి మరింతగా దిగజారే ప్రమాదముంది!