Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిట్టుకోవడం, నిందించడం, కించపరచడం, ఎగతాళి చేయడం ఇలా అనేక రకాలుగా వ్యక్తుల మధ్యా, రాజకీయాల మధ్యా, కుటుంబాల మధ్యా జరుగుతుండటం మనందరికీ తెలిసిన విషయమే. కానీ తిట్టుకోవడంలో నానా రకాలుంటాయి. జంధ్యాల తన సినిమాలలో తిట్టుకోవటం చాలా విచిత్రంగా రూపుకట్టించి నవ్వించారు. ఒక మనిషి తాను దుర్మార్గమైన పనినో, అన్యాయమో, దుష్ప్రవర్తననో చేస్తే, అతన్ని కోపంతో తిట్టాలనిపిస్తుంది ఎవరికైనా. మరి అతనికి చాలా మనసు బాధపడే విధంగా తిట్టాలంటే, ఏ తిట్లు తిట్టాలి? కించపరిచే తిట్లను ఎంచుకోవాలి. ఈ తిట్లు ఎలా వచ్చాయి? తిట్లెలా అయ్యాయి? అనే విషయాలు పరిశోధనాంశంగానే ఉంటుంది. మన సమాజంలో నయితే కుల వ్యవస్థ ఉన్నత, హీన వర్గంగా పేర్కొనటం, చూడటం ఉంది కనుక కులం పేరుపెట్టి తిట్టటమూ ఉంది. ఇక వ్యవస్థ మొత్తంగానే స్త్రీలను బలహీనులుగా చూస్తారు కనుక తిట్లన్నీ వారితో ముడిపడే ఉన్నాయి.
'నీతులకేమి ఒకించుక, బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో నీతులు బూతులు లోక ఖ్యాతులురా కుందరపు కవి చౌడప్పా!' అని బూతు పద్యాల శతక కర్త సెలవిస్తాడు. తన కాలంలోని పరిస్థితుల పట్ల తన అసంతృప్తిని ఆవేశాన్ని అతి పరుషమైన భాషలో నిర్భయంగా ప్రకటించినవాడు చౌడప్ప. ఆయనే కాదు మన ఆధునిక తెలుగు సాహిత్యంలో దిగంబర కవులు కూడా తమ నిరసనను తీవ్రంగా చెప్పడానికి బూతుపదాలను, పద బంధాలనూ వాడి విమర్శలెదుర్కొన్నారు. రహస్యంగా జరిగే స్త్రీ పురుష కలయిక విషయాలను నీచంగా భావించి, అందుకు సంబంధించిన పదాలను కించపరచడానికి తిట్లలో వాడటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది భూస్వామిక సమాజంలోంచి వచ్చిన భావజాలం. ఇందులో స్త్రీ మగవాడి ఆస్తి. ఇంట్లోనే ఉంచి కాపాడుకోవాల్సినది. బలహీనమైనది. అందుకే పురుషుడు ఇంకెవరినైనా తక్కువ చేసి కించపరచటానికి వారి ఇళ్ళలోని మహిళలను, తల్లిని, చెల్లిని, కూతుళ్ళను తిడతాడు. పురుషాధిక్య సమాజంలో తిట్లన్నీ మహిళను ఉద్దేశించినవే కనిపిస్తాయి. పురుషుడి వీరత్వం అంతా ఎదుటివాని ఇంట్లోని స్త్రీని ఎత్తుకెళ్ళడం, సొంతం చేసుకోవడంలో ఉంటుందనే భావనలో ఉండేవాళ్ళు. రామాయణ, భారతాలలో అనేక విషయాలు దీన్ని రుజువు చేస్తాయి. ఇదంతా కూడా ఒక చారిత్రక గమనంలోని వాస్తవాలు.
ఇక ఆస్తిలేనివాడు అంటే కేవలం రెక్కల కష్టంపై బ్రతికేవాడన్నా, అది కూడా చేయలేని వారిని హీనంగా చూస్తున్న సమాజంలో సంపద, డబ్బు ఉన్నవానికి గౌరవంతో మర్యాదలు చేస్తుంటారు. 'దరిద్రుడు, బిచ్చగాడు, సన్నాసి, కూలీ మొదలైన వాటినీ తిట్లుగా వాడతారు. ఇతర మతస్తులు, దేశస్తులు కూడా మన ప్రాంతాన్ని పాలించడం వల్ల వాళ్ళ భాషలోని తిట్లు కూడా మన తెలుగులో కలసిపోయాయి. 'బేవకూఫ్', 'దిమాక్ లేనోడు', 'దివానా', 'లఫంగె', 'సాలెగాడు', బోష్డికె, రాస్కెల్, ఇడియట్ ఇలా చాలా తిట్లు మనమూ వాడుతున్నాము. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోని మీడియా అంతా ఈ తిట్లలోని మర్మాలను, అర్థతత్పర్యాలను విడమర్చే చర్చ విస్తృతంగా చేస్తున్నది. ఒక్కొక్కరు నిఘంటువులు, గూగుల్ సర్చ్లు చేస్తూ యమ బిజీగా ఉన్నారు. నాయకులను, అదీ రాజ్యాంగ పదవిలో ఉన్నవారిని బూతులు తిట్టటం సరికాదని, నేరమని కొందరంటుంటే, వాళ్లనూ పదవిలో లేనప్పుడూ అలానే తిట్టారని క్లిప్పింగులు చూపెడుతున్నారు. ఏది ఏమైనా తిట్ల రాజకీయాలతో ఇప్పుడు బూతుల పురాణంగానం చేయబడుతున్నది. 'ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, మదిలో వీడా కొడుకన ఏడ్చును - గాడిదయును' అని గాడిదలు కూడా వాగ్దాన నాయకుల్ని అసహ్యించుకునే విధంగా పేరుగన్న ప్రజాస్వామిక వ్యవస్థ తయారైనందుకు మనం తలదించుకోవాల్సివస్తోంది. జరుగుతున్న విషయాల పట్ల ఆగ్రహం ప్రకటించడానికి యింత నీచమైన భాషను, తిట్లను ఉపయోగించాలనుకోవడమే భావ దారిద్య్రము. మన తెలంగాణలోనూ తిట్లు పుట్లుగా ధారాళంగా పారుతూనే ఉన్నాయి. 'బట్టేబాజ్', 'లత్కోర్గాడు', 'బొందపెడతం', 'పిట్టలదొర', 'కొత్త బిచ్చగాడు' అంటూ నోరంతా ఖరాబు చేసుకోవడం చూస్తేనే ఉన్నాం. ప్రజాస్వామిక వ్యవస్థలో విమర్శించడం, సమస్యను ఎత్తిచూపడం తప్పకుండా చేయాల్సిన పనే. కానీ విమర్శలో ఎంత ఘాటైన పదాలు ఉపయోగించాము అనేది ముఖ్యం కాదు. ఈ తిట్ల గోలలో పడి అత్యంత దౌర్జన్యంగా పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడిని గురించిన చర్చేలేకుండా పోయింది. కార్యాలయాలపై దాడి గర్హనీయమే. కానీ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపైనే దాడి అని ప్రవచించేవారికి అత్యంత క్రూరంగా త్రిపురలో సీపీఐ(ఎం) కార్యాలయాలను పోలీసులు చూస్తుండగానే బీజేపీ కార్యకర్తలు తగులబెడుతూ ధ్వంసం చేసినప్పుడు ఈ ప్రజాస్వామ్యం గుర్తుకు రాకపోవడం విచారకరం.
అదలా ఉంచితే తిట్లూ, కించపరచడాలపై ఆవేశపడుతున్న నాయకులు, రాజకీయులకు, ప్రజల తరతరాల సంపద అయిన విశాఖ ఉక్కును వేలం వేస్తుంటే, పోర్టులు అమ్మేస్తుంటే గొంతులిప్పి గోలచేయాలని అనిపించడమే లేదు. యువత నిరనుద్యోగ సమస్యతో తల్లడిల్లుతుంటే, రైతులు నానా ఇబ్బందులూ పడుతుంటే, కార్మికుల హక్కులు కాలరాయబడుతుంటే ఒక్క తిట్టునూ ఎక్కుపెట్టనేలేదు. ప్రజల సమస్యను పక్కదారి పట్టించి, అనవసర విషయాలపై చర్చకు తెరలేపడం నిర్లక్ష్య రాజకీయాలకు నిదర్శనం. కాబట్టి తిట్ల పురాణాలను ఆపి ప్రజల పాట్లు గురించి పట్టించుకుంటే బాగుంటుంది.