Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వేటికవే స్వతంత్రంగా సమన్వయంతో రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ నిత్యం జాగ్రత్తగా మిగతా వ్యవస్థలకు అతీతంగా నిష్పాక్షికంగా, స్వతంత్రంగా పని చేస్తేనే అటు రాజ్యాంగానికి, ఇటు ప్రజాస్వామ్యానికి రక్షణ ఉంటుంది. కానీ, ప్రస్తుత దోపిడీ పాలనలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించగలదా?
ప్రత్యేక ప్రతిపత్తి, స్వతంత్రత కలిగి ఉండాల్సిన న్యాయవ్యవస్థపై ప్రస్తుతం ఇతర వ్యవస్థల ప్రభావం ఎక్కువగా పడుతున్నది. ప్రస్తుతం కోర్టుల్లో కేసుల విచారణ, తీర్పులు వెలువడంలో ఆలస్యం జరుగుతోంది. గత 20, 30 ఏండ్లుగా అనేక సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. వాటిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగలేదు. దోషులకు శిక్షలు పడలేదు. మరోవైపు న్యాయమూర్తులపై బెదిరింపులు పెరిగిపోయాయి. నిజాయితీగా చట్టపరిధిలో తీర్పు ఇస్తున్న న్యాయమూర్తులను హత్య చేయడమో లేక బదిలీ చేయడమో జరుగుతున్నది. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టాల్సిన న్యాయవ్యవస్థ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అణచివేతకు గురవుతున్నది. మరోవైపు ప్రజాప్రతినిధులు న్యాయవ్యవస్థ ఉనికినే ప్రమాదంలోకి నెడుతున్నారు. నేర చరిత్ర, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు తమ పలుకుబడి, ప్రభుత్వాల సహకారంతో వాటిని ఉపసంహరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో న్యాయ వ్యవస్థ నిష్పాక్షికత దేశానికి కీలకం.
'కేసుల పరిష్కారంలో న్యాయవ్యవస్థ నెమ్మదిగా వెళ్లడం చాలా బాధాకరమని, ఇలాంటి 'పెయినఫుల్ స్లో'కు ఎక్కడో ఒక చోట పరిష్కారం లభించాలని' జస్టిస్ చలమేశ్వర్ గతంలోనే అన్నారు. 'న్యాయస్థానాల్లో మౌలిక వసతుల పరంగా రాష్ట్రాల్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించడంపై ఎవరూ దృష్టిసారించడం లేదు. ఇది న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే' అని రెండేండ్ల క్రితం సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. సామాన్యులకు సకాలంలో న్యాయసేవలు అందించడంలో అవరోధమవుతున్న ఈ దుస్థితిపై సీజేఐ ఎన్.వి.రమణ తాజాగా ఆవేదన చెందారు. న్యాయవ్యవస్థకు ఆర్థిక స్వతంత్రత కల్పించే దిశగా రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరారు. మౌలిక సదుపాయాల లేమితో పాటు పరిపాలన సిబ్బంది కొరత, న్యాయమూర్తుల పోస్టుల భర్తీలో జాప్యం తదితర సమస్యలూ న్యాయవ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి న్యాయస్థానాలలో పెండింగ్ కేసులు 4.4కోట్లు ఉన్నట్టుగా నివేదికలు చెపుతున్నాయి. కోవిడ్ లాక్డౌన్, నిబంధనల కారణంగా ఈ కేసుల సంఖ్య 19శాతం పెరిగింది. ప్రస్తుతం జిల్లా కోర్టులు, దిగువ కోర్టులలో 3.9 కోట్ల కేసులు, వివిధ హైకోర్టులలో 58.5లక్షల కేసులు, సుప్రీం కోర్టులో 69వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్, సుప్రీం కోర్టు నివేదికలు చెపుతున్నాయి. వీటిని చూస్తే సత్వర న్యాయం అందని ద్రాక్షగానే ఉన్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. న్యాయవ్యవస్థ అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు అవుతున్నా, ఇలాంటి పరిస్థితి ఉండటం శోచనీయం. మధ్య తరగతి, నిరుపేదలకు సత్వర న్యాయాన్ని చేరువ చేసేందుకు, పారదర్శకత పాటించేందుకు ప్రత్యేక చొరవ అవసరం. సామాన్య ప్రజలకు రాజ్యాంగం, హక్కులు, చట్టాల పట్ల కనీస అవగాహన పెంచేందుకు న్యాయ వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవడం ద్వారా పౌరులను చైతన్యవంతులను చేయాలి. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఏ పార్టీ ఉన్నా న్యాయ వ్యవస్థకు సంబంధించిన పోస్టుల భర్తీపై ఎవరి స్థాయిలో వారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం పాటిస్తున్నారని స్పష్టమవుతోంది. దీంతో పెండింగ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ పరిణామాలతో నేర చరితుల ఆగడాలకు అదుపు లేకుండా పోతోంది.
సుప్రీంకోర్టు నుంచి కింది స్థాయి కోర్టుల వరకు న్యాయమూర్తుల పోస్టులు వేలాదిగా ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో 1,098 న్యాయమూర్తుల పోస్టుల్లో దాదాపు సగం అంటే 455పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు పెండింగ్ కేసులు, మరోవైపు న్యాయమూర్తుల ఖాళీలు సత్వర న్యాయానికి అడ్డంకులుగా మారాయి. ఇక కోర్టులపై భారం పడకుండా ఉండేందుకు వేసిన ట్రిబ్యునళ్లలో కూడా ఖాళీలే ఉన్నాయి. చీటికిమాటికి వాయిదాలు కోరే సంస్కృతి కూడా కేసుల పెండింగ్‌కు ఒక కారణమని స్వయంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2018లో అన్నారు. న్యాయం జరగడం ఆలస్యమవడం అంటే న్యాయాన్ని తిరస్కరించడమేననేది సహజంగా అందరూ అనేమాట.
పెండింగ్ కేసుల విషయమై జస్టిస్ మార్కండేయ కట్జూ గతంలో ఓ ప్రతికకు రాసిన వ్యాసంలో ... 'తాజాగా ఎటువంటి కేసులు దాఖలు కాకుంటే. దేశంలో ఇప్పుడు కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించడానికి 360ఏండ్లు పడుతుందని' రాశారు. మార్కండేయ కట్జూ వ్యాసం 2019లో రాసే సమయానికి దేశంలో 3.3కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య మరో కోటి పైగా పెరిగింది. వీటి పరిష్కారానికి ఇంకెన్నేండ్లు పడుతుందో!