Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ టీకాలు వేయడంలో వంద కోట్ల డోసుల మైలురాయిని అధిగమించి భారత్ సరికొత్త అధ్యాయం సృష్టించడం హర్షణీయం. 220 కోట్ల డోసుల రికార్డుతో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన చైనా తర్వాత భారీ సంఖ్యలో కోవిడ్ టీకాలు వేసిన రెండో దేశంగా మన దేశం ఖ్యాతి పొందింది. ఈ ఏడాది జనవరి 16న మొదలై తొమ్మిది నెలలుగా నిర్విరామంగా సాగిపోతున్న ఈ టీకాల కార్యక్రమం అసాధారణమైనది. నవజాత శిశువులకు, చిన్నారులకు సార్వత్రిక టీకాల కార్యక్రమాలు ఇదివరకు నిర్వహించిన అనుభవం ఉన్నా వయోజనులకు సార్వత్రిక టీకాలు అనేది ఇదే తొలిసారి. ఈ ఏడాది మే నెలలో కోవిడ్ రెండో దశ అత్యంత భయానక స్థితిలో విజృంభిస్తున్న సమయంలోనూ మొక్కవోని దీక్షతో వైద్యారోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ ప్రాణాలొడ్డి టీకాలు వేసినందునే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. వృధా అయ్యేందుకు వీలున్న టీకాలను సైతం సద్వినియోగపర్చి ఆదర్శంగా నిలిచిన కేరళ వైద్యారోగ్య సిబ్బంది కృషి ఎనలేనిది.
వంద కోట్ల డోసులు అంటే వంద కోట్ల మందికి టీకాలు పూర్తిగా వేసినట్లు కాదు. అర్హులైన వయోజనుల్లో 75శాతం మందికి ఒక విడత మాత్రమే టీకా వేశారు. 31శాతం మందికి మాత్రమే రెండు డోసులు అంటే పూర్తి టీకా వేశారు. రెండు టీకాలు వేసుకుంటే తప్ప కోవిడ్‌ను ఎదుర్కొనే రక్షణ లభించదన్న శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో భారత్ సాధించాల్సిన లక్ష్యం ఇంకా సుదూరమైనదే. ఈ ఏడాది ఆఖరు నాటికి వందశాతం టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుత వేగం చాలదు. ఈ వాస్తవాన్ని విస్మరించరాదు. టీకాలపై అవగాహన పేరుతో మోడీ నాయకత్వాన్ని కీర్తిస్తూ చేపట్టిన ప్రచారానికి ఇప్పటికే రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని తగలేశారు. వంద కోట్ల డోసుల పేరిట మరోమారు అదే రీతిన ప్రచార మోతకు మోడీ సర్కార్ సిద్ధమైంది. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరా ఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం 'వంద కోట్ల డోసు'లను ఉపయోగించు కోవాలన్నదే బీజేపీ ఉబలాటం.
టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం సంఖ్య కాదని, దేశ సంకల్ప బలానికి, నవ భారతానికి ప్రతీక అని గత శుక్రవారం జాతినుద్దేశించి ప్రధానమంత్రి గొప్పలు చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్‌పై ఎదురైన ఎన్నో ప్రశ్నలు, సవాళ్లకు '100 కోట్ల డోసుల ఘనతే' సమాధానమని ఆయన మాటల డోసు పెంచారు. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలు పెడతాం. కానీ ఆ ఒక్క అడుగు ఎప్పుడు వేయాలనేది చాలా కీలకం. దేశ ప్రజానీకం గొంతెత్తి నిలదీస్తే కానీ, న్యాయస్థానాలు చీవాట్లు పెడితే కానీ సార్వత్రిక ఉచిత వ్యాక్సినేషన్‌కు ఉపక్రమించని మోడీ సర్కార్ ఇప్పుడు ఆ గొప్పంతా తమదేనన్నట్లు ప్రచారం చేసుకుంటోంది.
'వంద కోట్ల డోసుల రికార్డు నవ భారతానికి ప్రతీక' అని చెబుతున్న ప్రధాని.. ఆక్సిజన్ కొరతతో, బెడ్ల కొరతతో ఆప్తులను కోల్పోయిన లక్షలాది కుటుంబాలకు ఏమని బదులిస్తారు? అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైనది మన దేశంలోనే. 3.4 కోట్ల మంది కోవిడ్ బారిన పడ్డారు. అధికారిక లెక్కల ప్రకారమే 4.52లక్షల మంది చనిపోయారు. వెలుగుచూడని మరణాల సంఖ్య ఈ గణాంకాలకు ఎన్నో రెట్లు ఉంటుందని అంచనా. అమెరికా, బ్రెజిల్ తర్వాత కోవిడ్ మరణాలు మన దేశంలోనే అధికం. ఈ రికార్డుల గురించి నోరు మెదపరేం? దేశంలో వైద్య, ప్రజారోగ్య వ్యవస్థ ఎంతటి దయనీయమైన దుస్థితిలో కొట్టుమిట్టాడుతోందో కోవిడ్ మహమ్మారి బహిర్గంతం చేసింది కదా! ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలకుల వైఫల్యం కారణంగా ఆక్సిజన్ అందక బలైపోయిన అమాయక ప్రాణాల విషయంలో ఇప్పటికీ సమాధానం లేదు. ప్రభుత్వ సాయం అందక వైద్యానికి స్థోమత లేక గంగా నదీజలాల్లో కలిసిన కళేబరాలెన్నో. ఆత్మీయులను, ఇంటి పెద్దలను కోల్పోయిన లక్షలాది కుటుంబాలు ఇప్పటికీ ఆ దారుణ అనుభవాల నుంచి తేరుకోవడం లేదు. లాక్డౌన్లతో జీవనోపాధులు కోల్పోయినవారి దీనగాథలు చెప్పనలవికావు. పండుగ సీజన్లో దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నీతులు చెబుతున్న మోడీ సర్కార్ జాతి సంపదను మాత్రం విదేశీ కంపెనీలకు అమ్మేసేందుకు వెనుకాడటం లేదు. 'మన్ కీ బాత్' గొప్పల్లో ప్రధాని మనుసు పొరలను తాకని వాస్తవాల్లో ఇవి కొన్ని మాత్రమే.