Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇరవై ఏండ్ల ప్రస్థానం.. 60లక్షల సభ్యత్వం.. అద్భుతమైన నాయకత్వం...ఇది టీఆర్ఎస్కే సాధ్యం...' అంటూ ఇటీవల నిర్వహించిన ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ అగ్రనేతలు మీసాలు మెలేస్తూ చెప్పిన మాటలివి. అభివృద్ధి, సంక్షేమ రంగాలను రాష్ట్రంలో పరుగులు పెట్టిస్తున్నామనీ, తద్వారా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామని వారు ప్రవచించారు. వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచి, గెలిచామని ఇటు సీఎం కేసీఆర్, అటు మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. 'తెలంగాణలో రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం పెరిగింది.. ఈ ఏడాది రెండు పంటల్లో కలిపి రైతులు 3కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రైతులందరికీ ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే...' అంటూ సీఎం, మంత్రులు గుర్తు చేయటం ద్వారా తమ ప్రభుత్వ కీర్తిని చెప్పుకొచ్చారు. ఈ వాస్తవాలను నొక్కి చెప్పే క్రమంలో ముఖ్యమంత్రి, అమాత్యులు ఇప్పుడు ఆయా రంగాలకు వాటిల్లబోతున్న పెనుముప్పును మాత్రం విస్మరించారు. దేశ వ్యవసాయ రంగాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ సర్కార్... అత్యంత దుర్మార్గంగా వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చింది. ఈ చర్యలను నిరసిస్తూ అన్నదాతలు చేపట్టిన ఆందోళనలు 11నెలలను పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది రైతులు అసువులుబాసారు. ఆందోళనలను నీరుగార్చేందుకు యూపీలో రైతులపైకి ఏకంగా కేంద్ర మంత్రి తనయుడు కారెక్కించి చంపిన ఘటనలనూ మనం చూశాం. తాము దేశానికే దారి చూపిస్తున్నామన్న గులాబీ పార్టీ ప్లీనంలో ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏ ఒక్కనోరూ పెగల్లేదు, సరికదా... మరణించిన కిసాన్ వీరులకు కనీసం శ్రద్ధాంజలి కూడా ఘటించలేదు. ఆ క్రమంలో వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యాన్ని పండించటంలో నెంబర్‌వన్‌గా ఉన్నామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు... ఆ రంగాన్ని నిర్వీర్యం చేసే నల్లచట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడకుండా మున్ముందు తెలంగాణ వ్యవసాయాన్ని ఎలా కాపాడతారన్నది జవాబులేని ప్రశ్నగా మిగిలిపోయింది. విద్యుత్ సవరణ బిల్లులపైనా కారు పార్టీ వైఖరి ఇదే విధంగా ఉండటం విస్తుగొలిపే అంశం. రాష్ట్రంలోని అత్యధిక మంది రైతులు ఇప్పటికీ బోరు బావుల మీద ఆధారపడి సాగు చేస్తున్న నేపథ్యంలో... వారందరికీ ఇస్తున్న ఉచిత కరెంటుకు మంగళంపాడే విధంగా ఉన్న బిల్లులపై మౌనం దాల్చటం ద్వారా గులాబీ బాస్ రైతన్నకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారనేది ఓ అంతుచిక్కని కథే.
ఇవేగాక పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఇప్పుడు సామాన్యుడి జేబుల్ని గుల్ల చేసున్నాయి. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ఈ రేట్ల వల్ల పేదలు బతకలేని పరిస్థితులు దాపురించాయి. జనాభాలో 70శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలున్న తెలంగాణకు ఈ ధరలు శరాఘాతం లాంటివి. వీటి గురించి మాట మాత్రానికైనా ప్లీనరీలో ప్రస్తావించకపోవటం ద్వారా టీఆర్ఎస్... 'ఎవడేమైపోతే నాకేంటి...?' అనే రీతిలో వ్యవహరించింది తప్ప ప్రజల ఈతి బాధల్ని పట్టించుకోలేదు. ఇది ఒక రకంగా జనాల సమస్యల్ని గాలికొదిలేయటమే. గులాబీ దళపతి మాట మాట్లాడితే...రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నామంటూ తనదైన శైలిలో ఉపోద్ఘాతమిస్తుంటారు. మరి ఇంత మంది ప్రజలపై పడే భారాల గురించి మాట్లాడకుండా రాష్ట్ర ప్రయోజనాలను ఆయన ఎలా కాపాడతారనేది రాజకీయ పండితులకే తెలియని 'ఒక నిగూఢ రహస్యం'గా మిగిలిపోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 'గ్యాస్ బండకు దండం పెట్టు... బీజేపీని బొందపెట్టు...' అంటూ గులాబీ నేతలు పెద్ద పెద్ద స్లోగన్స్ ఇవ్వగా... అందుకు భిన్నంగా అదే పార్టీ ప్లీనరీలో ఈ అంశంపై 'స్లో' కావటం యాధృచ్ఛికమా..? కాకతాళీయమా..? లేక కావాలనే చేసిందా...? అనేది కూడా తేలాల్సి ఉంది. అంటే ఎన్నికలు, ఉప ఎన్నికలప్పుడే అధినేతలకు ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు గుర్తుకొస్తున్నాయా..? ఆ తర్వాత అవి నిష్ప్రయోజనాలని వారు భావిస్తున్నారా..? అనే సందేహాలు, సంశయాలు వెల్లువెత్తకమానవు. మరోవైపు ఆర్నెల్లు, ఏడాదికోసారి 'ఫెడరల్ ఫ్రంట్, మేం దేశ రాజకీయాలను శాసించబోతున్నాం.. ఇందుకోసం అందర్నీ కలుస్తాం...' అంటూ ప్రగల్భాలు పలికే 'కారు సారు...' కేంద్రం విధానాలను నికరంగా, నిక్కచ్చిగా విమర్శించకుండా, వాటిపై పోరాటం చేయకుండా నిలవగలడా..? నిలిచి గెలవగలడా..? అని యావత్ తెలంగాణ లోకం ప్రశ్నిస్తున్నది. చేయాల్సిన ఈ పని చేయకుండా, విధానాలను ప్రశ్నించకుండా, కేవలం 'బంగారు తెలంగాణ' అనే నినాదాలకూ, అధినాయకుని సంకీర్తనలకే పరిమితమైతే గులాబీకి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు 'కిందున్న' ముల్లు గుచ్చుకోకతప్పదు. అందుకే ప్లీనరీలో టీఆర్ఎస్ బాస్ ఉద్ఘాటించిన 'గులాబీ పార్టీ ధృతి, ఆ ప్రభుత్వ ఉధృతి...' మరింత కాలం కొనసాగాలంటే మోడీ సర్కారుపై 'సుతి మెత్తని గాండ్రింపు లను...' వదిలేసి, నికరంగా, నిజంగా పోరాటం చేయటమొక్కటే మార్గం.