Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న అమెరికా, యూరోపియన్ దేశాలను ది గ్రేట్ రిజగేషన్ అనే ఉద్యోగ సంక్షోభం అతలాకుతలం చేస్తున్నది. వేతనాలు లక్షల్లో ఇస్తాం, అన్ని సౌకర్యాలు ఇస్తామన్నా ఉద్యోగులు ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధం కావటం లేదు. కరోనా కష్టకాలంలో తమను ఆదుకోని కంపెనీల్లో తిరిగి చేరేందుకు ఉద్యోగులు ఇప్పుడు సిద్ధంగా లేరు. అదే ది గ్రేట్ రిజిగేషన్ సంక్షోభానికి తెరతీసింది.
గడిచిన ఒకటిన్నర సంవత్సర కాలంలో ఒక్క అమెరికాలోనే 10.3శాతం మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు. బ్రిటన్‌లో 4.7శాతం, జర్మనీలో 6శాతం, నెదర్లాండ్‌లో 2.9శాతం, ఫ్రాన్స్‌లో 2.3శాతం మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కొన్ని సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేసిన ఉద్యోగులను కరోనా సంక్షోభం పేరుతో కంపెనీలు తొలగించాయి. కొన్ని కంపెనీలు వేతనాలు తగ్గించాయి. దీనితో మనస్థాపం చెందిన ఉద్యోగులు రాబోయే కాలంలో తమను కష్టకాలంలో ఆదుకోని కంపెనీల అభివృద్ధికి కష్టపడబోమని ఎక్కువ మంది నిర్ణయించుకున్నారు. దానితో పాత ఉద్యోగాలకు రాజీనామా చేస్తూ, కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు లేదా సొంత వ్యాపారాలు ప్రారంభించుకుంటున్నారు.
ది గ్రేట్ రిజిగేషన్ అనే పదాన్ని టెక్సాస్‌లోని ఎ అండ్ ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటోనీ క్లాట్జ్ వెల్లడించారు. మహమ్మారి ఉధృతి తగ్గిన తర్వాత లక్షల సంఖ్యలో ఉద్యోగులు తమ కొలువులకు స్వస్తి చెపుతారని ఆయన ముందుగానే అంచనా వేశారు. అదే ఇప్పుడు జరుగుతున్నది.
రిటైల్ గోదాములు, సేవల రంగం, హెల్త్‌కేర్, రెస్టారెంట్ల రంగాలలో దీని ప్రభావం ఎక్కువ ఉన్నది. చిరు ఉద్యోగులతో పాటు ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఈ సమయంలో రాజీనామాలు చేయడం ఎక్కువగా కనపడుతున్నది. ఈ కాలంలో మైక్రోసాఫ్ట్ 30,000 మందిని సర్వే నిర్వహిస్తే, అందులో 41శాతం మంది రాజీనామా పెట్టాలని భావిస్తున్నట్టు లేదా తమ ప్రస్తుత వృత్తి నుండి మారాలని భావిస్తున్నట్టు వెల్లడి అయింది. మరో హెచ్ఆర్ సంస్థ బ్రిటన్‌లో కార్మికులలో నిర్వహించిన సర్వేలో దాదాపు 38శాతం మంది రానున్న ఆరు నెలల నుండి ఏడాదిలోపు ఉద్యోగం వదిలివేయడం గురించి ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ ఒరవడి అమెరికా, యూరోపియన్ దేశాలల్లో ఎక్కువగా కనపడుతున్నది. ఉద్యోగులలో తమ యజమానులు కరోనా కష్టకాలంలో తమను ఆదుకోలేదని, యజమానులు వారి మంచి చెడులు, లాభాల గురించి మాత్రమే ఆలోచించుకున్నారనే అంశం కార్మికులపై బాగా ప్రభావం చూపుతున్నది. అందుకని తమ నిరసన తెలిపేందుకు ఈ కొత్త రూపాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తున్నది.
కరోనా మహమ్మారి ఉత్పాదక రంగాన్నే కాక ఉత్పత్తి వ్యవస్థలను కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉత్పత్తి కేంద్రాలను చీకటికొట్లు, బందెల దొడ్ల కంటే దారుణంగా చూస్తోంది. ప్రత్యేకించి తనంతట తాను సృష్టించుకున్న సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రపంచీకరణ అనే అందమైన ముసుగుచాటున తన దోపిడీ దాష్టీకాన్ని కప్పిపుచ్చుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. కరోనా నిర్బంధాల నడుమ కార్మికవర్గానికి ఒక మౌలిక ప్రశ్న ఎదురైంది. ప్రపంచీకరణ సూత్రాలను నిజమేనని వంటపట్టించుకుని తమ రక్తమాంసాలను, కుటుంబ జీవనాన్ని లాభాలుగామార్చి కోటీశ్వర్లను శతకోటీశ్వర్లుగాను, శతకోటీశ్వర్లను సహస్త్ర, కోటీశ్వర్లుగాను తీర్చిదిద్దినా ప్రాణాపాయ సమయంలో యజమానులు కార్మికులకు కావాల్సిన కనీస ప్రాథమిక భద్రతలు కూడా కల్పించడానికి సిద్ధపడకపోవడమే కార్మికుల పునరాలోచనకు పునాదిగా ఉంది. ఈ ప్రశ్నే ప్రపంచీకరణకు పెద్దన్నగా ఉన్న అమెరికాలో మూకుమ్మడి రాజీనామాలకు దారితీస్తున్నది.
ట్రంప్ కాలంలో ఒక వైపు కరోనాతో లక్షల మంది ప్రజలు చనిపోతున్నా కార్మికులను పనుల్లోకి రావాలని చాలా ఒత్తిడి చేశారు. అమెరికాలోని ప్రధాన కార్మిక సంఘం ఏఎఫ్ఎల్ సిఐఒ కూడా కార్మికులను పనులకు రావాలని ఒత్తిడి చేసింది. కార్మికులు మాత్రం ప్రభుత్వ పిలుపును, యూనియన్ ఒత్తిడిని ఎదిరించి తమకు తమ కుటుంబ సభ్యులకు భద్రత లేనందున పనులలో చేరేది లేదని తేల్చిచెప్పారు. అప్పటి నుంచే కార్మికులలో యజమానులు, ప్రభుత్వంపై వ్యతిరేకత గూడుకట్టుకున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ లాభాల వేటకు కార్మికులు అడ్డుకట్ట వేయడంలో భాగమే ఈ రాజీనామాల పర్వంలోని ఒక కోణం.
పై పరిణామాల నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం ఎన్ని కొత్త పుంతలు తొక్కినా ఉత్పత్తికి ఆఖరి బటన్ కార్మికుని చేతిలోనే ఉందన్న చారిత్రక వాస్తవాన్ని కరోనా మహమ్మారి మరోసారి గుర్తుచేసింది. కార్మికుడు పాత తరహా ముతక ఖాదీ యూనిఫామ్ వేసుకుని చీకటి కొట్లలాంటి బందెల దొడ్లలో పనిచేసినా లేక ఆధునిక హంగు ఆర్భాటాల వెనుక నిఘా కెమెరాల నీడలో పనిచేసినా ''వేతన కార్మికుడు వేతన కార్మికుడే, యజమాని యజమానే'' అన్నది కార్మిక వర్గానికి కరోనా నేర్పిన పాఠం. ఈ పరిస్థితుల్లో ద్రవ్య పెట్టుబడి ప్రపంచీకరణ దశలో యజమానులైన పెట్టుబడిదారి వర్గానికి ఉత్పత్తిదారులైన కార్మికవర్గానికి ఉన్న వైరుధ్యం కూడా కొత్తకొత్త రూపాలు సంతరించుకుంటుంది అన్న వాస్తవాన్ని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వైరుధ్యంతో పాటు ప్రతిఘటన కూడా సరికొత్త రూపాలు సంతరించుకుంటున్నది.