Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెగాసస్ స్పైవేర్‌పై విచారణలో సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన తీరు, దేశంలో బిక్కు బిక్కుమంటున్న పౌరహక్కులకు కొత్త ఊపిరి పోసింది. సర్కారు తీరును ఎత్తి చూపడంతోపాటు న్యాయవ్యవస్తపట్ల అడుగంటుతున్న ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించింది. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలపై చట్టవిరుద్ధంగా నిఘా పెట్టిందన్న ఆరోపణలపై తీర్పులో భాగంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం చేసిన వాఖ్యలు.. ప్రజాసామ్యాన్నీ, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛనూ నిర్వీర్యం చేసే చర్యలను సహించలేమని స్పష్టం చేసాయి. ''భద్రత పేరుతో పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తే న్యాయస్థానం ప్రేక్షపాత్ర వహించదు'' అంటూ కేంద్రానికి చురకలంటించాయి. ''ఈ వ్యవహరంపై మేమే కమిటీని నియమించి దర్యాప్తు జరిపిస్తాం'' అన్న ఏలినవారి అభ్యర్థనను కూడా కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడంతో, ఇప్పుడు మోడీ సర్కారు పరిస్థితి కన్నంలో దొరికిన దొంగలా తయారైంది.
చట్టవిరుద్ధమైన ఈ నిఘా వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు, స్వతంత్ర కమిటీని నియమిస్తూ చరిత్రలో మరో గొప్ప తీర్పు చెప్పింది మన స్యాయస్థానం. సాధారణంగా కోర్టులు తమ తీర్పుల్లో ప్రభుత్వాల్ని లేదా ప్రభుత్వ సంస్థల్నే దర్యాప్తుకు ఆదేశించడం ఆనవాయితీ. అలాంటిది ఇప్పుడు న్యాయస్థానమే స్వయంగా దర్యాప్తుకు పూనుకోవడం విశేషం. ఆరోపణలు వచ్చింది కేంద్ర ప్రభుత్వం పైనే కాబట్టి దర్యాప్తు అధికారం కేంద్రానికి ఇవ్వలేమని తేల్చిచెప్పిన ధర్మాసనం, ఇప్పటివరకు కేంద్రం వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఈ వ్యవహరం వెలుగుచూసినప్పుడే ''పెగాసస్ స్పైవేర్‌ను వినియోగించారా లేదా?'' అంటూ న్యాయస్థానం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది. కానీ, ఒకసారి అఫిడవిట్ అవసరం లేదనీ, మరోసారి దేశ భద్రత అంశాల వల్ల వివరాలు చెప్పబోమనీ, ఇంకోసారి అఫిడవిట్ ఇస్తాం కానీ సవివరంగా ఇవ్వలేమనీ కేంద్రం విచారణకు సహకరించని విషయాన్ని ధర్మాసనం గుర్తు చేస్తూ.. ఈ తప్పనిసరి పరిస్థితుల్లోనే స్వతంత్ర కమిటీని నియమించాల్సి వచ్చిందని పేర్కొనడం ప్రభుత్వ ప్రవర్తనకు అద్దం పడుతున్నది. నిజానికి పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఈ ప్రజాస్వామ్య విరుద్ధమైన నిఘా పట్ల, ఇందులో విదేశీసంస్థల జోక్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న స్థితిలో, దీనిపై తీసుకున్న చర్యలేమిటో తెలియచేయమని కేంద్రానికి అనేక అవకాశాలిచ్చింది న్యాయస్థానం. అయినప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయకుండా అస్పష్టమైన, అసంపూర్ణమైన అఫిడవిట్లతో, దేశభద్రతను కారణంగా చూపి దాటవేయజూసింది ప్రభుత్వం. దేశ భద్రతే నిజమైన కారణమైతే అందుకు కూడా తగిన ఆధారాలుండాలి తప్ప, దానినొక సాకుగా చూపి న్యాయ సమీక్షనుంచి తప్పించుకోలేరని న్యాయస్థానం హెచ్చరించడం మోడీ సర్కారుకు చెంపపెట్టు. స్పైవేర్ దుర్వినియోగమవుతోందనీ, పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘించబడుతున్నాయనీ పిటిషన్ దారులు ఆరోపిస్తున్నప్పుడు, కనీసం దానిని ఉపయోగించారా లేదా అన్నది కూడా న్యాయస్థానానికి చెప్పకుండా ప్రభుత్వం మొండిగా వ్వవహరించడం గర్హనీయం.
నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగంలో అంతకంతకూ ప్రశ్నార్దకమవుతున్న పౌరుల గోప్యతా హక్కుకు రక్షణగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కాని అందుకు పూర్తి విరుద్ధంగా ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వమే నిఘాకు పూనుకుంటే అది రాజ్యాంగవిరుద్ధం. ఈ ప్రభుత్వానికి తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశభద్రత, దేశద్రోహం పేరుతో ప్రశ్నించే గొంతులపై అభియోగాలు మోపడం, నిర్బంధాలకు గురిచేయడం ఓ ఆనవాయితీగా మారింది. పౌరసమాజంలో పెల్లుబుకుతున్న భిన్నాభిప్రాయాల్నీ, తమ ప్రజావ్యతిరేక విధానాలపట్ల వెల్లువెత్తుతున్న అసంతృప్తినీ వేయికళ్ళతో కనిపెట్టడానికి ఈ పెగాసస్ స్పైవేర్ వంటి నిఘా సాధనాలు అవసరమయ్యాయా? అంటే పై నేపథ్యం అవుననే సమాధానమిస్తోంది. మేధావులు, ఉన్నతాధికారులనుంచి.. పాత్రికేయులు, సాధారణ ప్రజలదాకా అనేకమందిపై ఈ నిఘాకన్ను అమర్చిన కుట్రలన్నీ బట్టబయల యినప్పటికీ, అదంతా అబద్ధమేనని బుకాయించారు బీజేపీ పెద్దలు. ఇది విపక్షాల కుట్ర అంటూ ఎదురుదాడికి దిగారు. మరి అదే నిజమయితే కోర్టుకు సమాధానం చెప్పకుండా సహాయ నిరాకరణ ఎందుకు చేస్తున్నట్టు?! ఈ పరిస్థితుల్లో నిజమేంటో నిగ్గు తేల్చేందుకు తమ ముందు స్వతంత్ర కమిటీ ఏర్పాటు తప్ప మరో మార్గం లేదని న్యాయస్థానమే నిర్ధారణకు వచ్చిందంటే, ఈ ప్రభుత్వం ఎంత మొండిగా వ్యవహరించిందో అర్థమవుతుంది.
అయితే ప్రభుత్వం ఎంత మొండిగా వ్యవహరించినా న్యాయస్థానం అంత పట్టుదలగా నిలబడి ప్రశ్నించడం స్ఫూర్తిదాయక విషయం. ప్రమాదంలో ఉన్న ఈ దేశ రాజ్యాంగ నియమాలను, చట్టబద్ధ పాలనను నిలబెట్టుకోవడం ఓ అనివార్యమైన అవసరంగా ముందుకొస్తున్న దశలో.. మన అత్యున్నత న్యాయస్థానం ధీరోదాత్తమైన తీర్పునివ్వడం గొప్ప పరిణామం. అంతిమంగా ఫలితమెలా ఉంటుందన్నది అటుంచితే, పౌర హక్కులకూ పత్రికాస్వేచ్ఛకూ పట్టంగడుతూ వెలువడిన ఈ తీర్పూ, ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలూ మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీకలు.