Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వంకాయలు, బీరకాయలు, టమాటలు, కొత్తిమీరు, పచ్చిమిర్చీ..!' అంటూ ఉదయాన్నే కూరగాయలు అమ్ముకునే గొంతు వినపడుతుంది. ఇందులో పెద్ద ఆశ్చర్యపడే విషయమేమీలేదు. ఆ తరువాత కొందరు 'పాతపేపర్లు, సామాన్లు కొంటాం' అని కూడా వీధుల్లో తిరుగుతుంటారు. అంటే అమ్మకాలు, కొనుగోళ్ళు గల మార్కెట్ ప్రపంచంలో మన ఉషోదయాలు, సంధ్యా సమయాలు సాగిపోతున్నాయి. ఈ అమ్మకాల కొనుగోళ్ళపైనే అనేక మంది బతుకులూ ఆధారపడి ఉన్నాయి. సాధారణంగా అమ్మేవాడికి అంతో ఇంతో లాభం వస్తుంది. షాపులు, మాల్స్, మల్టీ నేషన్ కంపెనీ సరుకులు అమ్ముకునే వాడికి రోజూ కోట్లల్లో డబ్బు లాభం క్రింద జమవుతూనే ఉంటుంది. కానీ కొందరికి కొనే వాళ్ళకు కూడా లాభాలొస్తాయి. ఆ లాభాలు అధికారమంత ఉంటాయిమరి! అంటే అధికారమూ అమ్మకాల కొనుగోళ్ళ వ్యవహారమే. ఇక్కడ అమ్మకానికి ఉన్న సరుకు 'ఓటు'.
'ఇది చాలా హాట్ గురూ!' అని రేడియోలో వింటుంటాం. కానీ ఇది చాలా కాస్ట్లీ గురూ అని అనుకోవడానికి బాధపడాలో, సిగ్గుపడాలో, ఆనందపడాలో అర్థంకాని స్థితి. అనేక ప్రత్యేకతలు సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలోనూ తన ఘనమైన ప్రత్యేకతను చాటుకుంది. మొన్న మన హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా కాస్ట్లీ ఉప ఎన్నికగా చరిత్రలో నిలిచిందంటే చిన్న విషయం కాదు. మిగులు బడ్జెట్ రాష్ట్రంలో ఆ మాత్రం ధరలు పలకటమూ, వ్యయ ప్రవాహమూ పెద్ద చిత్రమేమీ కాదనుకుంటా! దేశానికి ఒక కొత్త మోడల్ని కూడా అందిస్తున్నది. డబ్బులు ప్రవహించడం కొత్తేమీకాదు గానీ, ఒక్కసారిగా ఇన్నిరెట్లు పెరిగిపోవటం ఒకింత ఆశ్చర్యమనిపిస్తుంది.
ఎవరైనా ప్రజల కోసం పథకాలు ప్రవేశపెడతారు. కానీ ఈ ఆధునిక మారకస్వామ్యంలో ఎన్నికల ఓట్ల కోసం పథకాలు, బంధులు పుట్టల్లోని చీమల్లా వెల్లువెత్తుతాయి. అందుకనే స్వాతంత్రం వచ్చి డెబ్భైయి అయిదేండ్లు కావస్తున్నా దేశంలోని పేదరికాన్ని ఏ పథకమూ పోగొట్టలేకపోయింది. బర్రెలు, గొర్రెలు ఎన్ని పంచినా, ఎన్నెన్నో కోట్లు వెచ్చించినా ఇంకా ప్రపంచంలో ఆకలి పెరిగిన దేశంగానే ఉందిగాని, తీరిన దేశం కాలేకపోయింది. ఇప్పుడయితే ఎన్నికల మేనేజ్మెంట్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు మాస్టర్స్ డిగ్రీ చేసి ముందుకు పోతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు ఓట్లు అనేవి ఒక బిజినెస్ మేనేజ్మెంట్గా పరిణామం చెందాయి. ప్రజాస్వామ్యమని పుస్తకాల్లో చదువుకున్నదంతా మనీస్వామ్య మై వర్థిల్లుతున్నది. రాజకీయాలు, ఎన్నికలు, ఓట్లు వ్యాపారంగా మారినప్పుడు ఇక ఉండేవి అమ్మకాలు కొనుగోళ్ళేకదా!
ఒక్కోఓటు ఆరువేల నుండి పదివేల వరకు ధర పలుకుతోందంటే ఎన్నివేల కోట్లు ఈ సందర్భంగా ఓటర్లకు పంచబడుతున్నాయో ఊహించండి. ఒక్క పార్టీయే కాదు కదా! అధికార పార్టీతో పోటీపడుతున్న పార్టీకూడా ధారాళంగా నోట్లు నిండిన కవర్లు అందిస్తుంటే, నెలకొక ఎన్నిక వస్తే ఎంత బాగుండునోనని ప్రజలు అనుకోకుండా ఉంటారా! డబ్బుల కవర్లు అందని ఓటర్లు రోడ్డెక్కి ధర్నాకు దిగటం, 'అందరికిచ్చినోడు మాకెందుకు ఇవ్వడని' నిలదీసే స్థాయిలో ప్రజల్లో ''చైతన్యం'' కలగటానికి ఈ రాజకీయ మహౌద్ధండ నాయకమణ్యుల వారసత్వమే కారణమనే విషయం వేరే చెప్పాలా! 'మా వడ్లు కొనండి!' 'మా ధాన్యం కొనండి!' 'మిర్చీ కొనండి, పత్తికొనండి!' అని రైతులు ఎడ్లబండ్లలో పడిగాపులు పడుతున్న తీరుగానే, మావోట్లు కొనండి! ఓట్లుగా మారిన మమ్ములను కొనండి! కొందరినే కొని మమ్ములనెందుకు వొదిలేస్తారు! అంటూ అమ్మకానికి సిద్ధపడ్డ ప్రజల అవస్తను గమనిస్తే, మనకు దారిచూపుతారనుకున్న నేతలు ఏ స్థాయికి ప్రజాస్వామ్యపు రథచక్రాన్ని శిథిలపరిచారో మనకర్థమవుతుంది.
ఈ నాయకుడు ఎన్నిక తరువాత ఎలాగూ మనల్ని పట్టించుకోడు, మన బాధల్ని తీర్చనూలేడు. రోజు రోజుకూ పెరగటమే తప్ప బాధలు తరిగిపోతున్న దాఖలాలే కనపడవు. ఈ పూటకన్నా ఇచ్చినదే దక్కుతది అని అనుకోవడంలో ప్రజల తప్పులేదు. ప్రజల్ని అమ్ముకునే వాళ్ళుగా అడుక్కునే వాళ్ళుగా మార్చిన ఘనత ఏలినవారిదే. చాలామంది ప్రజలను తప్పుపడుతూ ఉంటారు. ఇవ్వటం మొదలేసినవాడిది కదా అసలు దోషం. అందుకనే కొనుక్కొన్నవాడు, అతని కొచ్చిన అధికారంతో ఆదాయమెంత పోగేసుకోవాలో అనే ఆలోచనలోనే ఉంటాడు. అంతకు మించి ఏముంటుంది!
చిన్న ప్రశ్నో, విమర్శో, వ్యతిరేకతో, ఆందోళనో, అన్యాయంపై గొంతెత్తితే వెంటనే నిఘా వర్గాలు, నేర పరిశోధకులు వెంటబడి వేటాడి నిముషాల్లో నిర్బంధాలకు గురిచేస్తారు. కేంద్ర ఆధీనంలోని సంస్థలన్నీ చాలా చురుకుగా ఈ విషయాల్లో పనిచేస్తుంటాయి. మరి ఈ ఓట్లను కొనడం, విచ్చలవిడిగా డబ్బులు పంచడాలు జరిగిపోతుంటే ఒక్క పోలీసూ, ఒక్క నేర నిఘా విభాగ అధికారీ, ఎలక్షను కమిషనూ కనపడనే కనపడదు. అంతా ప్రశాంతంగానే జరుగుతున్నట్టు ప్రకటనలు ఇస్తారు. అధికారులు, పోలీసులు శాంతి ప్రవచనాలు వల్లిస్తారు. ఇవేమీ వినపడనట్టుగానే మనం ప్రజాస్వామ్య విలువల గురించి, రాజ్యాంగ ఔన్నత్యం గురించి భీకరమైన పలుకులు పలుకుతూనే మురిసిపోతాము! వెతకండి ప్రజాస్వామ్యం ఎక్కడ ఎలా ఉందో.. ఎంత దొరుకుతుందో..!