Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా అన్నదాతల కడగండ్ల సేద్యం కన్నీటి కాష్టాల్ని ఎగదోస్తూనే ఉంది. నూట నలభై కోట్ల జనావళికి రోజూ ముప్పూటలా నాలుగు వేళ్లునోట్లోకి పోవడానికి కారణమైన రైతులు బతుకుపోరులో అలసి బలవన్మరణాలకు పాల్పడుతున్న వైపరీత్యం మనల్ని కలచివేస్తోంది! తాజాగా జాతీయ నేరగణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించిన వివరాలు ఏడాదిలో ఒక్క వ్యవసాయ రంగంలోనే 10,677 మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలియజేస్తున్నవి. పోలీసుస్టేషన్లలోని ఎఫ్ఐఆర్ల ఆధారంగా తయారుచేసే ఈ నివేదికలో వెల్లడయ్యే అంకెలకన్నా ఎన్నోరెట్లు అధికంగా రైతులు నేలరాలుతున్నారన్నది జగద్విదితం. అయితే ఎన్సిఆర్బి లెక్కించే రైతుల బలవన్మరణాలను కూడా తమ అంకెలగారడీతో తక్కువచేసి చూపించడమంటే, అది పాలకుల దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రతి అరగంటకొకరు చొప్పున చనిపోతున్న వారిని ఆదుకోవడానికి నిర్దిష్ట చర్యలేమీ తీసుకోలేదనేది నిష్టుర సత్యం.
ఎన్సీఆర్బీ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ, తెలంగాణ వరుస స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 7,409 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా 802 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నట్టు మరో సంస్థ అధ్యయనంలో తేలింది. రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాతల ఆత్మహత్యలను ఆపలేకపోతున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రైతుబీమా అమలుచేసినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం కొన్ని కేసులనే రైతు ఆత్మహత్యల జాబితాలో రాస్తున్నారు. రైతుది సాధారణ మరణమైనా, ఆత్మహత్య అయినా రైతుబీమా అమలుచేస్తున్నామనే నెపంతో ఆత్మ హత్యలకు గల కారణాలను కూడా అన్వేషించడం లేదు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ 'రైతు' నిర్వచనాన్ని ఏనాడో మార్చేసింది. గతంలో కౌలురైతులూ, వ్యవసాయకూలీలను సైతం రైతులుగానే పరిగణించేవారు. వారిని గణనలో తప్పించడంతో వారి ఆత్మహత్యల సంఖ్య అన్నదాతల కింద జమ కాకుండా పోయాయి. రైతుల మరణాలను కూడా కుటుంబ సమస్యలు, మద్యం, మాదకద్రవ్య వ్యసనాల కింద నమోదు చేస్తున్నారు. ఇది సమస్యల సుడిగుండంలో దిక్కుతోచక ఉరితాడు బిగించుకుంటున్న అన్నదాతలను అపహాస్యం చేయడమే. రాత్రి పగలు, ఎండా వానా, పురుగూపుట్రాలను లెక్కచేయకుండా స్వేదం చిందించి సేద్యం చేసి రాజనాలు పండించే రైతుకు గిట్టుబాటే కాదు, అసలు జరుగుబాటూ కష్టమై అప్పుల ఊబిలో కూరుకుపోతున్న దారుణం పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి చాలవన్నట్టు కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన నల్లచట్టాలు అమలులోకి వస్తే ఈ సంఖ్య రెండింతలు అయ్యే అవకాశం ఉందన్న అంచనానే గుండెల్ని పిండేస్తోంది. రైతులకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇస్తామన్న హామీ 2014లో బీజేపీ విజయతీరాలకు చేర్చింది. కానీ ఇప్పుడు కార్పొరేట్లకు దాసోహమన్న సర్కార్ ఆ 'మద్దతు'నే ఉపసంహరిస్తూ రైతులను యమపురికి సాగనంపుతుంది.
అతివృష్టి, అనావృష్టి ఏది వచ్చినా రైతులను ఆదుకునే దిక్కులేదు. 2018 నుంచి 20 వరకు పంటనష్టం బకాయిలు రూ.841 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటాధనం చెల్లించకపోవటంతో ఇన్సురెన్స్ క్లెయిమ్స్ రాలేదు. క్రాప్ ఇన్సురెన్స్ పథకాలు అమలుచేయకపోవటం కూడా రైతుల ఆత్మహత్యలకు కారణమని 'రైతు స్వరాజ్య వేదిక' అధ్యయనంలో వెల్లడైంది. గతంలో ప్రకృతి విపత్తులు వచ్చి, పంటలు నష్టపోతే సర్వేచేసి నష్ట పరిహారం అందించేవారు. ఏడేండ్లుగా ఏదో ఒకరకంగా నష్టం జరుగుతున్నా పరిహారం మాత్రం చిటారు కొమ్మన ఊరిస్తుందే తప్ప అందటంలేదు. గతేడాది వచ్చిన వరదలకు 25లక్షల ఎకరాల పంట నీట మునిగి రూ.8,633 కోట్ల నష్టం వాటిళ్లిందని ప్రధాన మంత్రికి లేఖ రాసి చేతులు దులుపుకుంది రాష్ట్ర సర్కారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నయాపైసా ఇవ్వలేదు. 'రైతు స్వరాజ్య వేదిక' వేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. మూడు నెలల్లో నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలను ప్రారంభించలేదు.
''రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నాం. మా పథకాలే దేశానికి ఆదర్శం'' అని చెప్పుకుంటున్న పాలకులు, రైతుల ఆత్మహత్యలలో దేశంలో నాల్గోస్థానంలో నిలవడం సిగ్గుచేటు. తెలంగాణలో 466 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, అందులో 47 మంది మహిళా రైతులు. తెలంగాణలో సొంత భూమి కలిగిన రైతులు 343 మంది కాగా అందులో 33 మహిళా రైతులున్నారు. కౌలు రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే ఉండటం భూ సమస్య తీవ్రతను తెలుపుతోంది. రుణకోరల్లో చిక్కుకొని 41శాతం రైతులు ప్రాణాలు బలితీసుకున్నట్టు నివేదిక విశదీకరించింది. నివేదికలో అంకెలగారడీ అటుంచితే, ఆ కాస్త నిజాలైనా ముళ్లకర్రలా మన మొద్దుబారిన పాలకులను కదిలించి బాధితులను ఆదుకునే చర్యలకు ఉసిగొల్పుతాయని ఆశిద్దాం. బంగారు తెలంగాణ భజన చేసే పాలకులకు మన అన్నదాతల దీనస్థితిపై దృష్టి పెట్టాల్సిన అవసరమెంతో ఈ నివేదిక స్పష్టంచేస్తోంది.