Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూరాబాద్ ఉత్కంఠకు తెరపడింది. తుది ఫలితం వెలువడింది. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్టు పోటా పోటీగా సాగిన ఈ నోట్ల యుద్ధంలో చివరికి ఈటెల గెలిచాడు. ఒక విశ్లేషకుడు చెప్పినట్టుగా ఈటలకు బీజేపీ వ్యాల్యూ అడిషన్ అయింది. నిజానికి గెలిచేదెవరో తెలుసుకోవడానికి తుది ఫలితాల వరకూ ఆగాల్సి వచ్చిందిగానీ, ఓడేది మాత్రం ప్రజలేననేది పోలింగ్‌కు ముందే తేలిపోయింది. దేశంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచిన ఈ ఎన్నిక తీరూ, ఫలితాలూ చూసిన తరువాత, ఇద్దరు ప్రముఖుల ముఖ్యమైన సంభాషణొకటి గుర్తుకు రాక మానదు. ఒకరోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పార్లమెంట్ భవనం నుండి బయటకొస్తుంటే, మరో పార్లమెంట్ సభ్యులు కృపలానీ ఎదురుపడి.. ''ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారెందుకు?'' అని ప్రశ్నించారట. దానికి సమాధానంగా ''ఒకప్పుడు రాణుల కడుపుల నుండి రాజులు పుట్టేవారు. కానీ నేనిప్పుడు నా ప్రజల ఓట్ల ద్వారా ప్రజల నుండే పాలకులు పుట్టే ఏర్పాటు చేశాను. అందుకే ఈ సంతోషం'' అని అంబేద్కర్ జవాబిచ్చారట. ''అయితే మీకా సంతోషం ఎంతోకాలం ఉండదు. ఎందుకంటే ఇవి మా రోజులు. నీ ప్రజలు పేదలు. నిస్సహాయులు. వారిని బిచ్చగాళ్ళను చేసి, వారి ఓట్లను కొని మేమే ప్రభువులమవుతాం, ప్రభుత్వాలనేర్పాటు చేస్తాం'' అని ఎగతాళి చేశారట కృపలానీ. అప్పుడు అంబేద్కర్ ''నా ప్రజలు పేదలూ, నిస్సహుయులే కావొచ్చు. ఆ నిస్సహాయత నుండి మీకు అమ్ముడూపోవచ్చు. కానీ అదే ప్రజలు తమ ఓటు విలువను తెలుసుకున్న రోజున మీకంటే పెద్ద బిచ్చగాళ్ళు ఎవరూ ఉండరని గుర్తుంచుకోండి'' అని హెచ్చరించారట. ఈ సంభాషణలోని అంబేద్కర్ కోరుకున్న రోజులు ఎప్పుడొస్తాయోగానీ, ఇప్పుడు నడుస్తున్నవి మాత్రం కృపలానీ కోరుకున్న రోజులేనని హుజూరాబాద్ ఎన్నిక మరోసారి నిరూపించింది.
డబ్బులు ఏరులుగా పారించిన ఈ హౌరాహౌరీ పోరాటంలో ఇప్పుడు గెలిచినవారు ఊరేగుతారు. ఓడినవారు నీరుగారుతారు. కానీ ఈ గెలుపోటములకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన పార్టీల పెద్దలంతా ఇప్పుడొక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సివుంది. రాజకీయాలు వ్యాపారంగా, ఓట్లు సరుకులుగా మారిపోయాక, ఎన్నికలంటే అమ్మకాలూ కొనుగోళ్ళేననే ధోరణి ఒక సహజమైన భావనగా ఏర్పడి చాలా కాలమే అయింది. కానీ డెబ్బయిదు వసంతాల ఈ స్వర్ణోత్సవ భారతంలో ఓటర్లు తమకు డబ్బులందలేదని ప్రభుత్వ కార్యాలయాలముందూ, ప్రజా ప్రతినిధుల ఇండ్లమూందూ ధర్నాలకు దిగిన చోద్యాలు ఏనాడైనా చూశామా..? ఓటుకు గిట్టుబాటు ధర చెల్లించడం లేదంటూ రోడ్లెక్కి రాస్తారోకోలు చేసిన సిత్రాలు ఎప్పుడైనా ఎరిగామా..? ఎన్నికల్లో డబ్బు పంచడమనేది బహిరంగ రహస్యమే అయినా మరీ ఇంత బరితెగింపు మున్నెన్నడూ ఎరుగనిది. ప్రజల్ని మరీ ఇంతటి దుస్థితికి దిగజార్చిన ''ఘనత'' ఎవరిది? కులం, మతం, ప్రాంతం, మద్యం వంటి అనేక ప్రలోభాల మాట అటుంచితే, ఓటుకు దాదాపు పన్నెండు వేల వరకూ ధర నిర్ణయించిన ''మహానుభావు''లది కాదా..? ఇది ''ప్రజలనుండి ప్రజలచేత ప్రజలకొరకు'' అన్న ప్రజాస్వామ్య సూత్రాలను అపహాస్యం చేయడం కాదా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమంటే ప్రజల్నీ అవమానించడమే. మరి ఇంతటి అవమానాన్ని ప్రజలకు మిగిల్చి సాధించిన గెలుపు ఏ విలువలకు కొలమానం?! మార్క్స్ చెప్పినట్టు మనుషులే కాదు, వారి భావోద్వేగాలతో సహా సమస్తమూ సరుకులుగా మారిపోవడమంటే ఏమిటో నేటి రాజకీయాలు కండ్లకు కడుతున్నాయి.
కేంద్రంలో రాష్ట్రంలో అధికార పార్టీలుగా ఉన్న రెండు ప్రధాన పార్టీల ప్రత్యర్థులిద్దరూ సమవుజ్జీలుగా పోటీపడి ప్రలోభాలకు గురిచేస్తుంటే, ప్రజలకు నిజాయితీగా స్పందించడానికి మరో ప్రత్యామ్నాయమే లేకుండా పోయింది..! ఆకాశాన్నంటిన ధరలు, అడుగంటిన ఉపాధి అవకాశాలు, అక్కరకురాని వ్యవసాయం, అంతులేని అవినీతి మధ్య చిక్కుకుని ప్రజాజీవితం ఇంతటి సంక్షోభంలో ఉంటే... వారి సమస్యలూ, వాటిని పరిష్కరించే విధానాలేవీ అసలు చర్చకే రాకుండాపోయాయి..!! ఎన్నికలు కేవలం ఓట్లను కొనుగోలు చేసుకునే సంతలుగా మారిపోయాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి..? ఏ పార్టీ ఎంత ఖర్చుపెట్టిందో అంచనాలకు అందడం లేదంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చూస్తూ కూడా ఎన్నికల సంఘం, ఇతర అధికార గణాలు నిద్ర నటించడం మామూలే అయినా, మరీ ఇంత బాహాటంగా జరుగుతున్నా పట్టనట్లుగా వ్యవహరించడం మహా దారుణం. డబ్బులిచ్చిన వారిపైనే కాదు, తీసుకున్న వారిపైనా చర్యలుంటా యని హూంకరించిన అధికారులు, ఇద్దరినీ ఒకే గాటిన కట్టడం ఆపి ప్రజలకు ఈ స్థితి కల్పించిందెవరో తేల్చుకోవాలి. ''మన ప్రజాస్వామ్యం మేడిపండు' అన్న ఆరుద్ర వాక్కులు ఎంతటి అక్షర సత్యాలో ఈ హుజూరాబాద్ ఎన్నిక సిత్రాలు ఎరుకపరుస్తున్నాయి.
ఈ సిత్రాల సంగతి కాసేపు పక్కన పెడితే, అంతిమ ఫలితం దేనికి సంకేతమన్నది గమనించాల్సిన అంశం. తన రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టని టీఆర్ఎస్కు ఈ ఓటమి ఓ గుణపాఠం. ఇక గెలిచింది ఈటల రాజేందరే అయినా, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి, దేశాన్నే అమ్మకానికి పెట్టిన బీజేపీ అభ్యర్థిగా ఆయన గెలుపొందడం రాష్ట్ర ప్రజలకో హెచ్చరిక. ప్రజాస్వామ్య విలువలకూ, లౌకిక విధానాలకూ ఓ ప్రమాద సూచిక.