Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ పేరు వినగానే తీపి తీపి మిఠాయిలు.. ఇల్లంతా పరుచుకునే దీపాల వెలుగులు.. పటాకుల పేలుళ్లు.. వాటి అమ్మకాలతో సందడిగా ఉండే మార్కెట్లు గుర్తుకొస్తాయి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లోని వ్యాపారులు, వర్తకులతోపాటు సాధారణ ప్రజలు... లక్ష్మి దేవిని పూజించటం ద్వారా తమకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు. తమ పిల్లాపాపలు సిరి సంపదలతో తులతూగుతారని ఆశిస్తారు. ఇవి వారి సెంటిమెంట్లు. ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ పండుగను వివిధ రూపాల్లో జరుపుకోవటం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాల్లో దసరా, సంక్రాంతి తర్వాత అంతటి ప్రాధాన్యతగల పర్వదినమిది. మిగతా పండగల తరహాలో పిండి వంటలు, కొత్త బట్టల మాటెలా ఉన్నా... బాణాసంచా కాల్చటమే దీనికి ప్రధాన ఆకర్షణ. చిన్నారి చిచ్చుబుడ్డి నుంచి పెద్ద పెద్ద లక్ష్మి బాంబుల దాకా... కాకర పువ్వొత్తుల నుంచి ఒకేసారి భారీ శబ్దాలతో పేలే అత్యాధునిక టపాకాయల దాకా పండక్కి నాలుగైదు రోజుల ముందు, పండగ అయిపోయాక నాలుగైదు రోజుల వరకూ గల్లీ గల్లీలోనూ సందడి చేస్తాయి. అయితే గత కొద్దికాలంగా సరదాగా సాగిపోవాల్సిన దీపావళి ప్రభ కాస్తా... మసకబారుతున్నది. ఈ యేడాది హైదరాబాద్పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను పరిశీలిస్తే అది మరింత ప్రస్ఫుటమవుతున్నది. ప్రతిరోజూ పైపైకి ఎగబాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం సరుకు రవాణా రంగం మీద బాగా పడింది. ఈ క్రమంలో నిత్యం వండుకుతినే కూరగాయలతోపాటు పండగొచ్చినప్పుడు కాల్చి సంబరపడే టపాసుల రేట్లూ తారాజువ్వలా ఆకాశానికి చేరాయి. ఈ దెబ్బకు వాటిని కొనేవారి సంఖ్య పడిపోయి వ్యాపారుల మొహాలు... ఆ ధరలను చూసి భయపడి ప్రజల మొహాలు వెలవెలబోతున్నాయి. కరోనాతో ఉపాధి, ఉద్యోగాలు ఊడిపోయి... జనాల చేతుల్లో లక్ష్మే (డబ్బులు) లేని ప్రస్తుత తరుణంలో వారు పండగ ఆనందాన్ని ఎలా ఆస్వాదించగలరు..?
మరోవైపు గత కొన్నేండ్లుగా పటాకులు పేల్చటం.. బాణాసంచా కాల్చటమనే ప్రక్రియలు శృతి మించి రాగాన పడుతుండటం ఆందోళనకరం. నిర్ణీత సమయంలో కాకుండా తెల్లవారు ఝామునుంచి అర్థరాత్రి దాటిన తర్వాత కూడా వీటిని కాల్చటం వల్ల విపరీతమైన ధ్వని, వాయు కాలుష్యాలేర్పడుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్ధారించిన డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దంతో వీటిని కాల్చటం వల్ల అటు వాటిని పేల్చిన వారికి, ఇటు ఆ శబ్దాలను విన్నవారికి దీర్ఘకాలంలో వినికిడి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బాణాసంచా తయారీలో వాడే అల్యూమినియం, బేరియం, పొటాషియం నైట్రేట్ తదితర రసాయనాల మూలంగా పర్యావరణానికీ, మన ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. నిర్జన ప్రదేశంలో, ఎవరికీ హాని కలగని రీతిలో మందుగుండ్లను పేల్చాల్సిన తరుణంలో... అందుకు భిన్నంగా గ్రామాలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ప్రధాన రహదారులపై కూడా వాటిని వినియోగించటం వల్ల వాహనదారులు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ఘటనలను మనం చూస్తున్నాం.
ఈ నేపథ్యంలోనే 'హరిత బాణాసంచా లేదా హరిత పటాకులు...' అనే అంశం తెరమీదికొచ్చింది. ఎక్కువ రసాయనాలు, అత్యధిక పేలుడు స్వభావం కలిగిన వాటి కంటే ధ్వని, వాయు కాలుష్యాలను వీలైనంత తగ్గించగలిగే 'హరిత టపాసుల' వైపు మొగ్గు చూపాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఆదేశించిన విషయం విదితమే. గతంలో వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలకు బదులు... మట్టి విగ్రహాలను వాడాలంటూ తెలంగాణ హైకోర్టుతోపాటు వివిధ న్యాయస్థానాలు సూచించిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే ఇప్పుడు హరిత టపాసుల అంశం ప్రస్తావనకొచ్చింది.
వాస్తవానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో టపాసులు, బాణాసంచా తయారీ రంగం మీద ఆధారపడి కొన్ని కోట్ల మంది జీవనోపాధి పొందుతున్నారు. వాటిని తయారు చేయటం ద్వారా వీరికి ఏడాదంతా పని దొరుకుతుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అతిపెద్ద పటాకుల పరిశ్రమలున్నాయి. అందువల్ల ఇప్పుడిది అతి సంక్లిష్టమైన సమస్యగా తయారైంది. ఒకవైపు పండగ వేళ ప్రజల ఆనందం.. మరోవైపు విపరీతమైన కాలుష్యం.. దీనికితోడు అతి కీలకమైన ఉపాధి అంశం... ప్రస్తుతం ఈ మూడు ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగున్న అంశాలు. వీటిని వేర్వేరుగా చూడలేం. అందువల్ల మొదట బాణాసంచా తయారీ రంగం మీద ఆధారపడిన వారి కోసం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలి. ఇందుకోసం నిపుణులతో అధ్యయనం చేయించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కార్మికులు, కూలీలకు తగు శిక్షణనిచ్చి.. ఆర్థిక సహకారాన్ని అందించటం ద్వారా వారిని వేరే ఉపాధి మార్గాల వైపు మళ్లించాలి. వీటితోపాటు ధ్వని, వాయు కాలుష్యాల నివారణకు వివిధ దేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలి. వాటిని మన దగ్గర అమలు పరచటం ద్వారా వాతావరణాన్ని కాపాడుకోవాలి. అప్పుడే న్యాయస్థానాలు ఆదేశించిన, పర్యావరణ నిపుణులు సూచించిన 'హరిత టపాకాయలు...' సుసాధ్యమవుతాయి. దీంతోపాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా వాటి ధరలను, నిత్యావసరాల రేట్లను నియత్రించినప్పుడే మన ప్రజల మోముల్లో చిరునవ్వుల దీపాలు వెలుగుతాయి.