Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు లాంటివి. నరేంద్రమోడీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ ఫలితాలు అద్దంపడుతున్నాయి. బీజేపీ అధికారంలో కొనసాగుతున్న హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, కర్నాటకలో ఆ పార్టీకి భంగపాటు ఎదురైంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు డిపాజిట్లను కూడా ఆ పార్టీ కోల్పోయింది. 3 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న జరిగిన ఉప ఎన్నికల ఫలితాల తరువాత లోక్‌సభలో బీజేపీ సంఖ్యాబలంలో ఒకటి తగ్గింది. అనేక రాష్ట్రాల శాసనసభల్లో సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. ఉప ఎన్నికలు జరిగిన ఈశాన్య రాష్ట్రాల్లో వ్యక్తమైన సానుకూలత బీజేపీ బలానికన్నా స్థానిక ప్రాంతీయ పార్టీల దన్ను, ప్రతిపక్షాల వ్యూహ రాహిత్య ఫలితాలేనని విశ్లేషణలు వస్తుండటం గమనార్హం. ఈ ఉప ఎన్నికలను కూడా బీజేపీ ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. విజయం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందుబాటులో ఉన్న అన్ని వనరులను ప్రయోగించింది. సినిమా నటులను తిప్పింది. పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేసినట్లు, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అనేక హామీలను ఎరగా వేసిందని, ఆ పార్టీకే ప్రత్యేకమైన ప్రజలను చీల్చే ఎత్తుగడులకు కూడా అనేక చోట్ల దిగిందని వార్తలు వచ్చాయి. అయితే, వీటిని ప్రజలు ఏకోన్ముఖంగా తిరస్కరించడం ఈ ఎన్నికల ప్రత్యేకత.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడుతూ నరేంద్రమోడీ ప్రభుత్వం రూపొందించిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాది కాలంగా రైతాంగం చేస్తున్న పోరాట ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించింది. దీంతో పాటు చుక్కలను దాటి దూసుకుపోతున్న పెట్రో, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా ప్రజలను ప్రభావితం చేశాయి. కరోనా కష్టకాలంలోనూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు మొండి చేయి చూపడం, కార్పొరేట్ల మీద రాయితీల వర్షం కురిపించడం వంటివి కూడా ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారాయి. ఫలితంగా పశ్చిమబెంగాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అన్ని చోట్ల టిఎంసి అభ్యర్థులు గెలవగా, సీపీఐ(ఎం)కు గతంతో పోలిస్తే గణనీయంగా ఓట్లు పెరగడం ఒక సానుకూల పరిణామం. ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి హర్యానాలో ఏకంగా మాజీ సైనికుడిని రంగంలోకి దించి, దేశభక్తి పేరుతో ఓట్లు చీల్చడానికి బీజేపీ చేసిన ప్రయత్నం విఫలమైంది. రైతు ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేసిన ఐఎన్ఎల్డీ నేత అభరు చౌతలా వైపే అక్కడ ప్రజానీకం నిలబడింది. ఒక లోక్‌సభ, మూడు శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సమయంలోనే అధిక ధరల అంశం ఒక ఎజెండాగా ముందుకొచ్చింది. ఘోర ఓటమి తరువాత బీజేపీ నాయకత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉందంటూ ప్రచారం ప్రారంభమైంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ కొంచెం అటు, ఇటుగా ఇదే పరిస్థితి!
మొత్తంమీద దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఉప ఎన్నికలతో నరేంద్రమోడీ మీద, బీజేపీ మీద ప్రజలకు వ్యతిరేకత పెరుగుతోందన్న విషయం స్పష్టమవుతోంది. మోడీకి దీటైన ప్రత్యామ్నాయం లేదు గనుక మాదే గెలుపని విర్రవీగడం ఇక మీదట కుదరదు. తెలంగాణలో హుజురాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్ గెలుపొందారు. బీజేపీ బలం కన్నా ఈటలపై వ్యక్తమైన సానుభూతి, ఆయనకు స్థానికంగా ఉన్న పలుకుబడి ఇక్కడ విజయానికి దారి తీశాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. బీజేపీని రాజకీయంగా ఎదుర్కోవడంలో అధికార టీఆర్ఎస్ విఫలమైంది. రాష్ట్రాల హక్కులపై చేస్తున్న దాడి, సమైక్య రాష్ట్ర విభజన తరువాత తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయం, రైతాంగ వ్యతిరేక చర్యలు వంటి అంశాలను నామమాత్రంగా కూడా ప్రస్తావించకుండా ప్రజలను ప్రలోభపెట్టే వ్యూహానికి పరిమితం కావడం టీఆర్ఎస్ను దెబ్బతీసింది. ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకత్వం ఈ విషయాన్ని గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్‌లో బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బరిలో లేనందున వైఎస్ఆర్సిపి గెలుపు ముందే ఖరారైపోయింది. అందుచేత ఈ ఎన్నికల ఫలితాలు ప్రజలు తమ పాలనకిచ్చిన తీర్పు అని వైసీపీ భావిస్తే అది పొరపాటు అవుతుంది. ఈ ఎన్నికల ప్రచారంలోనైనా బీజేపీ రాష్ట్రానికి చేసిన ద్రోహం గురించి వైఎస్ఆర్సీపీ ప్రచారం చేయకుండా ఉపేక్షించడం, తెలుగుదేశం, జనసేనలు బీజేపీకి సహకరించడం, పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నాయకులు వ్యవహరించడం మనం చూశాం. దేశవ్యాప్తంగా అపప్రధ మూటగట్టుకుంటూ, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న బీజేపీ పట్ల రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అనుసరిస్తున్న వైఖరి మన రాష్ట్ర ప్రయోజనాలకు నష్టాన్నే కలుగచేస్తుంది.