Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నేలమ్మ నేలమ్మ నేలమ్మా, నీకు వేల వేల వందనాలమ్మ. సాలేటి వానకు తుల్లింత, ఇంక సాలు సాలుకు నువ్వు బాలింత, నీళ్ళనే చనుబాలుగా, గాలినే ఉయ్యాలగా, పక్కల్ల బొక్కల్ల రెక్కల్ల నువ్వు సక్కంగ మోసేవు మొక్కల్ల!...'' అంటూ ఈనేలను తల్లిగా పోలుస్తూ అశోక్ తేజ రాసిన గీతంలో భూమిని అమ్మలా ప్రేమించాలన్న సందేశం ఉంది. అవును, భూమి అమ్మలాంటిదే, బిడ్డలు తన గురించి ఏమీ పట్టించుకోకపోయినా పిల్లలకు అన్నీ సమకూరుస్తూనే ఉంటది. భూమితల్లి పుట్టిన నాటి నుండి ఎన్ని ఇచ్చింది మనకు! తన చల్లని కడుపులో మనం పుట్టాక, తిండి, బట్ట, గూడు, నీడ, నీరు, నిప్పు సమస్తమూ అందించింది కదా! ఈ నేల ఆధారంగానే ఆకాశాన్నంతా తిరిగొచ్చామ్, మన మనుగడకు నెలవు అడుగులకు ఆదరువు నేల.
ఇప్పుడు మరి నేలమ్మకు సుస్తీ చేసింది. భూమి తల్లికి జ్వరం వచ్చింది. ఎవరు చూస్తారు? బాగు చేసేవారేరి? తల్లి వొడిలోనే ఉన్న తనయలందరూ జ్వర పీడితులుగా తల్లడిల్లు కాలం దగ్గరలోనే ఉన్నది. భూమిప్పుడు ఒక గ్రహమే కాదు. సకల జీవరాశుల భవిత. దీన్ని కాపాడుకోకపోతే మనమంతా ప్రమాదంలో పడిపోతాము. భూగోళం మనుగడకు, సకల జీవరాశుల ఉనికికి పెనుప్రమాదంగా వాతావరణమార్పు ముంచు కొస్తున్నదని ఎంతోమంది నిపుణులు దశాబ్దాల క్రితమే హెచ్చరించారు కూడా. అయినా ఎవరు వింటున్నారు? నటిస్తున్నారు! ''కేవలం పనికిరాని వాగ్దానాలతో సరిపుచ్చే ప్రపంచనేతలను చూస్తుంటే మా యువతరానికి కోపం, ఆవేశం వస్తోంది. మీకు చేతకాకుంటే చెప్పండి, మేం నాయకత్వం వహిస్తాం'' అంటూ పదిహేనేండ్ల తనీషా ఉమాశంకర్ నిలదీసినా ఉలుకూ పలుకూలేదు. స్కాట్లాండ్ రాజధాని గ్లాస్కోలో జరుగుతున్న 26వ అంతర్జాతీయ వాతావరణ సదస్సులో భూమి తల్లి గురించే చర్చ మొదలయింది. ప్రపంచ దేశాధినేతలూ, పర్యావరణ వేత్తలు, అధికారులు, స్వచ్ఛంద కార్యకర్తలు వేలాది మంది పాల్గొంటున్న ఈ సదస్సులో తమిళనాడుకు చెందిన వనీషా, అధినేతలను నిలదీసి సవాలు విసిరారు. 'అధికారంలో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులు మన భవిష్యత్తును సీరియస్‌గా తీసుకున్నట్లు నటిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా భూమిపైన కర్భన ఉద్గారాల తగ్గింపుపై చేసిన వాగ్దానాలు ఏమయ్యాయి. అయినా సిగ్గులేకుండా ఒకరినొకరు అభినందించుకొంటున్నారు' అని పర్యావరణ ఉద్యమకారణి థన్‌బెర్గ్ తీవ్రంగా స్పందించడం గమనిస్తే, సమస్య ఎంత తీవ్రమైనదో అర్థమవుతోంది.
భూమి తల్లికి జ్వరం ఎందుకు వచ్చింది? వేడిమి ఎందుకు హెచ్చింది? గత డెబ్భయియేండ్లుగా భూ ఉష్ణోగ్రత పెరుగుదలకు ఎక్కువ భాగం మానవ చర్యల వల్లనే అనే దానికి ఆధారాలు లభించాయి. అడవుల్ని నరికేస్తున్నారు, నేలను తొలిచేస్తున్నారు, కాలుష్యాన్ని చిమ్మేస్తున్నారు, ఆవరణాన్ని అంతా చెరిపేస్తున్నారు. ఎందుకలా చేస్తున్నారు? ఈ నేలపైన అందరూ బ్రతకటానికి హక్కున్నది. మనుషులతో పాటు, సకల జీవులకూ చెట్టు చేమలకూ పురుగు పుట్టకూ సమానమైన హక్కే ఉన్నది. ఆ హక్కును మనం గౌరవించడం లేదు. భూమి అనేక సంపదలగని. మన అవసరాలు తీర్చడానికి ఉన్నాయి. కానీ దురాశలను తీర్చడానికి కాదు. బ్రతుకు దెరువు కోసం, అవసరాల కోసం ప్రకృతిని మనం ఉపయోగించుకోవచ్చు. దానివల్ల నష్టమేమీ ఉండదు. కానీ మనిషి అవసరాల కోసం కాక లాభం కోసం ఉపయోగించడం ఆరంభమయిన వ్యవస్థలో అంతా విధ్వంసమే ఉంటుంది. పెట్టుబడిదారీ విధానంలో మానవులు తమ చుట్టూ ఉన్న అన్నింటిని భూమి, సహజవనరులు, శ్రమని కూడా మార్కెట్లో లాభం సంపాదించిపెట్టే అవకాశం గల సరుకులుగా పరిగణిస్తారు. నేల రియల్ ఎస్టేట్‌గా, అడవులు కలపగా, సముద్రాలు మత్స్య సంపదగా, ఇంకుడు గుంటలుగా మారిపోతుంటే సజీవ గ్రహం నిర్జీవంగా మారిపోతుంది. భూమిని మనకు సంబంధించిన ఒక సరుకుగా పరిగణిస్తున్నాం కాబట్టి దాన్ని దుర్వినియోగపరుస్తున్నాం. అలాకాక భూమిని మన ఉనికికి మూలాధారంగా పరిగణించినప్పుడు దాన్ని ప్రేమతోనూ, గౌరవంతోనూ వినియోగిస్తాము.
భూమి ఎక్కువగా వేడెక్కడానికి కారణమైన గ్రీన్హౌస్ వాయువుల కార్భన్డైఆక్సైడ్ విడుదలలు అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లోనే ఎక్కువ. పర్యావరణ విధ్వంసకరమైన విధానం నుంచీ పెట్టుబడి సంచయనం నుంచీ పెట్టుబడిదారీ వ్యవస్థ బయటపడలేదు. ఈ పర్యావరణ విధ్వంస క్రమాన్ని వెనక్కుతిప్పలేదు. ఎందుకంటే త్వరగా ధనవంతులైపోవాలనే దాని లక్ష్యం ముందు జీవావరణానికి ఎటువంటి ప్రాధాన్యతా లేదు. అన్న సామాజికవేత్తల వివరణ సత్యంగానే కనపడుతున్నది. అవసరాలకు, సౌకర్యాలకు మించిన వస్తు ఉత్పత్తి, అనవసర సరుకుల ఉత్పత్తి, వినియోగం కోసం కాక లాభాల కోసం చేసే విచ్ఛలవిడి సరుకుల ఉత్పత్తి వ్యవస్థ వల్లనే ఎదురవుతున్నది జనావళికి విపత్తు.
ఈ విపత్తు, విధ్వంసం ఇలానే కొనసాగితే జీవన లయగతి తప్పు తుంది. కవులు వర్ణించే వసంత రుతువులు లేని ప్రపంచం గురించి రూపకాలం కారికంగా మాట్లాడుకోవలసి రావచ్చు. ఎందుకంటే భూగోళం యొక్క ప్రాథమిక జీవ భౌగోళిక రసాయన ప్రక్రియలు మానవుడి రూపాంత రీకరణ వల్ల ప్రమాదంలో పడ్డాయి. మేల్కొనాలి. భవితను ప్రశ్నార్థకం చేసే విధానా లను తిప్పికొట్టాలి. ప్రకృతిలో మనిషి భాగమనీ, జీవావరణం, పర్యావరణం సహజీవనం సమభావనతో సాగాలి. నేలమ్మను కాపాడుకోవాలి.