Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సారు కేంద్రంపై ''యుద్ధభేరి'' మోగించారు. ''మెడలు విరిచేస్తాం!'' ''నాలుక చీరేస్తాం!'' భాష వచ్చేసింది. ''బీజేపీ నేతల్ని పండనీయ్యం, నిలబడనీయ్యం!'' ''ఏడేండ్లలో దేశానికి ఏం ఒరగబెట్టిన్రు?'' అంటూ సీఎం బీజేపీపై విరుచుకు పడ్డారు. ఆ కోపంలో సీఎం మనసులోని నిజాలన్నీ బయటికి తన్నుకొచ్చాయి. ప్రతివారి అకౌంట్లో రూ.15లక్షలు వేస్తామన్నారు కదా! ఏమైందన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇచ్చారా? జీడీపీ మంట కలిసింది. ఆహార భద్రత నాశనం అయింది. మన పొరుగు దేశాల కంటే జీడీపీ దిగనాసిపోయిందన్నారు. ఎల్ఐసితో సహా ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు నాశనం చేస్తున్నారన్నారు. బియ్యం కొనం అన్నందుకే ఇంత కోపం వచ్చిందా? అయితే కొనం అని లేఖిచ్చినప్పుడే రావాలి కదా! లేదా సంజయుడి వ్యాఖ్యలపైనా? హుజురాబాద్ ఓటమిపైనా? 'సారు' కార్యాచరణని బట్టి ఈ సందేహ నివృత్తి అవుతుంది.
ఆలోచనా పరులెవరికైనా బీజేపీ పాలన దేశానికి పట్టిన చీడనే విషయం ఇట్టే అర్థమవుతుంది. విదేశీ పత్రికలు సైతం ఈ విషయంలో గళమెత్తుతున్నాయనే విషయం మొన్న 'టైమ్' మ్యాగజైన్ (అమెరికన్ పత్రిక) నిదర్శనం. ఏడు దశాబ్దాల పాటు నిర్మించుకున్న వ్యవస్థనే కాదు, విలువల్ని సైతం విధ్వంసం చేస్తోంది బీజేపీ పాలన. దాన్లో కీలకమైంది మన దేశంలో సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్ గ్రోత్)కి పునాదులేసిన ప్రభుత్వ రంగం. దాని ధ్వంసానికి బాటలు పరిచింది 1991లో కాంగ్రెస్ పాలన. ఆ విధానాల్నే మరింత నిష్కర్షగా, నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తున్నది బీజేపీ. పైగా బీజేపీ సైద్ధాంతికంగానే ప్రభుత్వరంగానికి వ్యతిరేకం. దాని ''దారంతా'' స్వేచ్ఛా వాణిజ్యమే! వాజ్‌పారు పాలనలో బాల్కో, హిందుస్థాన్ జింక్, విదేశీ సంచార్ నిగమ్, సెంటౌర్ హౌటల్స్తో ప్రారంభమై నేడు ఎల్ఐసి ఐపీఓ దాకా వచ్చింది. ''మీరంతా తలకిందులుగా తపస్సు చేసినా విశాఖస్టీల్ ప్లాంట్‌ను అమ్మే తీరతామ''ని మోడీ తెగేసి చెప్పేదాకా నేటి పరిస్థితి వచ్చింది. రియల్ ఎస్టేట్ల విందు భోజనానికి సిద్ధంగా ఉన్న జింక్ ఫ్యాక్టరీని చూసిన విశాఖ ప్రజలు, కాదు.. కాదు ఉత్తరాంధ్ర ప్రజలు యావత్తు 'ఉక్కు' రక్షణకై ఉద్యమిస్తున్నారు. ఎక్కడి పరిశ్రమ గురించో ఎందుకు? ఇక్కడి మన సింగరేణి స్థితి ఏమిటి? కోలిండియా 49శాతం వాటా కూడా రాష్ట్రామే వాల్చుకుంటుందని వంతపాట గాళ్లు భజన చేస్తూంటే ముసి ముసి నవ్వుల్తో మురిసిపోయిన మూలవిరాట్ మన సింగరేణిలో బొగ్గు బ్లాకుల వేలానికి తెగబడ్డ విషయంపై ఏమంటారు? కోలిండియా ప్రయివేటీకరణపై కనీసం సింగరేణిలో తమ గుర్తింపు సంఘమైనా గొంతు విప్పేలా చేయాలి కదా!
మొన్న, నిన్న మీడియాతో కేసీఆర్ చెప్పినవన్నీ పరమ సత్యాలే! ఆ విధానాలపై పోరాటం నిరంతరం చేయాల్సిందే. టీఆర్ఎస్ రాజకీయ అవసరాల కోసం కాదు. అటువంటి పోరాటం తన కార్యకర్తల్నే కాదు, రాష్ట్ర ప్రజానీకాన్నే చైతన్యయుతం చేస్తుంది. బీజేపీ విధానాలపై పదును దేలుస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడో, దుబ్బాక ఎన్నికలప్పుడో, హుజూరాబా ద్లో ఓడిన తర్వాతనో, జబ్బలు చరుచుకుని, లంగోటీలు బిగిస్తే గెలిచే కుస్తీ పోటీ కాదిది. మూడు రైతు చట్టాలపై టీఆర్ఎస్ లైనేంటి? 2020 డిసెంబర్ 8న భారత్ బంద్‌లో పాల్గొని, ''ఆ యిద్దర్నీ'' కల్సిన తర్వాత యూటర్న్ ఎందుకు తీసుకున్నారో రాష్ట్ర ప్రజలకి చెప్పాలి కదా!? రైతు చట్టాలైనా, మరోటైనా తమ పార్టీ విధానం ఫలానా అని ఉండాలి. పార్లమెంటులో ఏమీ చెప్పరు. వాకౌట్ చేస్తారు. ఎవరికి ఉపయోగం ఆ విధానం?
కేసీఆర్ తుస్సుమన్న అస్త్రాల్లో ఫెడరల్ ఫ్రంట్ ఒకటి. దేశంలోని ఇతర ప్రతిపక్ష పార్టీల దృష్టిలో ఆయనను పలచన చేసినవి. ''ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్‌డీడ్'' అనే విషయం తెలీని వ్యక్తి కాదు ఆయన. బీజేపీతో సంకుల సమరం చేస్తున్న పార్టీల తరుఫున ఒక్క రోజైనా ప్రచారం చేసి ఉంటే ఆయన విశ్వసనీయత పెరిగేది. రైతు చట్టాలైనా, కార్మిక కోడ్లైనా, ప్రయివేటీకరణలైనా 2019లో రెండవసారి అధికారంలోకి రాగానే బీజేపీ చెప్పిన వందరోజుల ప్రణాళికలోవే. ప్రజల కోసం నిలబడే వార్వెవరైనా వీటిపై నిరంతరం పోరాటంలో ఉండాలి. ఆ ప్రణాళిక దేశానికే నష్టదాయకం. దేశంలోని కార్పొరేట్లకి మాత్రమే అనుకూలం. దేశం దెబ్బతిన్న తర్వాత అందులో భాగమైన రాష్ట్రం బావుకునేదేముంటుంది? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ నిలబడాలనే తెలంగాణ సమాజం కోరేది. రెండు రోజులు మీడియాతో నాలుగు గంటలపాటు ముచ్చటించిన ముఖ్యమంత్రి మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటారా? లేదా ? అని అడిగారు కానీ. ఇప్పటివరకు వాటిని పార్లమెంటులో వ్యతిరేకించిన దాఖలాలు లేవు. ఆ చట్టాలున్నంత కాలం వరి కాదు కదా ఏదీ ప్రభుత్వం సేకరించకూడదు. మద్దతు ధర ఇవ్వదు. ఈ విషయాల్ని అటు తన క్యాడర్‌కు ఇటు రాష్ట్ర రైతాంగానికి తెలియచెప్పకుండా ఈ యుద్ధంలో విజయం సాధించటం అసాధ్యం. ప్రభుత్వరంగం కాపాడబడ్తే, కార్మికులు, రైతులు చల్లగా ఉంటే మిగతా దేశంతో పాటే తెలంగాణ పచ్చగా ఉంటుంది. సారు ''పలవరించే'' బంగారు తెలంగాణ అప్పుడే సాధ్యం.