Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్రోలు, డీజిల్‌పై హద్దు పద్దు లేకుండా పన్నులు బాది ధరాఘాతాన్ని మూట గట్టుకున్న మోడీ ప్రభుత్వం, ఇప్పుడు పిసరంత ఎక్సయిజ్ సుంకం తగ్గించి, అక్కడికేదో ప్రజలకు ఒరగబెట్టినట్లు ఫోజు పెడుతోంది. అంతేనా, మేం పన్నులు తగ్గించాం, రాష్ట్రాలూ మీ పన్నులు తగ్గించాలని ధర్మ సందేశం ఇచ్చింది. కేంద్రంలో ఏడేండ్ల బీజేపీ పాలనలో వడ్డించిన పెట్రో పన్నులతో పోలిస్తే లీటర్ డీజిల్‌పై రూ.10, లీటరు పెట్రోల్‌పై రూ.5 సెంట్రల్ ఎక్సయిజ్ సుంకం తగ్గింపు కొండను లాగి ఇసుక రేణువును వదిలేసిన చందం. ఇంధన ధరలతో ప్రతి రోజూ అన్ని వస్తువుల ధరలూ దీపావళి టపాసుల మాదిరి పేలుతుండగా, ప్రస్తుత సుంకం స్వల్ప తగ్గింపును ప్రజలకు దీపావళి కానుకగా బీజేపీ అభివర్ణించడం నయ వంచన. బీజేపీ వచ్చాక ఇంధన ధరలపై కేంద్ర పన్నులు ఏ స్థాయిలో పెరిగాయో సింహావలోకనం చేసుకుంటే దిమ్మ తిరుగుతుంది. 2014లో లీటరు పెట్రోలుపై ఎక్సయిజ్ సుంకం రూ.10 కాగా ఇప్పుడు రూ.33, డీజిల్‌పై రూ.5 కాస్తా రూ.32 అయింది. పెట్రో ఉత్పత్తుల విక్రయంపై పన్నుల ద్వారా కేంద్రానికి 2014లో రూ.75 వేల కోట్ల ఆదాయం రాగా 2021లో రూ.3.60 లక్షల కోట్లు. కరోనా మహమ్మారి సమయంలోనూ పన్నుల బాదుడు ఆగలేదు సరికదా అప్రతిహతంగా సాగింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగిందా అంటే అదీ లేదు. 2014లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 109 డాలర్లు కాగా ఇప్పుడు 81 డాలర్లు. కోవిడ్‌లో ఒక్కో రోజు 25-30 డాలర్లకు క్షీణించిన సందర్భాలూ ఉన్నాయి. పెట్రో ధరల పెంపునకు ఇంటర్నేషనల్ రేట్లతో సంబంధం లేదు. ఉన్నదల్లా కేంద్ర కాసుల కక్కుర్తి.
2014లో మల్లే కేంద్ర పన్నులుంటే లీటర్ పెట్రోలు రూ.66, లీటరు డీజిల్ రూ.55కు ప్రజలు పొందవచ్చు. తన పన్నుల నిర్వాకాన్ని కావాలనే బీజేపీ సర్కారు దాచి పెడుతోంది. ఇప్పుడు తీరిగ్గా రవ్వంత సుంకం తగ్గించడం సైతం రాజకీయమే. మొన్న కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు సమీపిస్తుండటంతో పరాజయం పాలవుతామన్న భయంతో ఇంధన సుంకం స్వల్పంగా తగ్గించిందన్నది అసలు రహస్యం. కొన్ని బీజేపీ రాష్ట్రాలలో స్వల్పంగా వ్యాట్‌ను తగ్గింపజేసి, ఇదే అదనుగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తగ్గించాలని రాజకీయం ఆడుతోంది. బీజేపీ వాదనపై కేరళ వామపక్ష ప్రభుత్వం దీటుగానే స్పందించింది. తాము ఆరేళ్లలో అదనంగా పన్నులేమీ వేయలేదని, ఒకసారి తగ్గించామని, కేంద్రం బేసిక్ ప్రైస్‌పై ఎక్సయిజ్ సుంకం తగ్గించడంతో, స్టేట్ ట్యాక్స్‌తో కలుపుకొని మొత్తంగా డీజిల్ ధర రూ.12.30, పెట్రోలు ధర రూ.6.56 తగ్గుతుందని వివరించింది. తమిళనాడు సైతం ఇప్పటికే పెట్రోలు ధర తగ్గించామని, ఇంకా వ్యాట్ తగ్గించను పొమ్మంది. ఎ.పి., తెలంగాణ ప్రభుత్వాలు కేంద్ర వ్యవహారాన్ని తప్పుబడుతూనే, తాము తగ్గించలేం పొమ్మన్నాయి. ఈ రెండు రాష్ట్రాలల్లో వ్యాట్ తగ్గించి ప్రజలకు ఎంతో కొంత ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత అటు వైసీపీ సర్కార్‌పైనా, ఇటు టీఆర్ఎస్ సర్కారుపైనా ఉంది. ఎందుకోసమైనా కేంద్ర సర్కారుపై కేసీఆర్ గొంతెత్తారు. ఆయన లేవనెత్తిన అంశాల్లో ఒక కీలకమైనది ఇంధన ధరలు. ప్రజలను పీక్కుతింటున్న ఇంధన ధరలపై సైతం అసలు దోషి బీజేపీ.
ఇంధన ధరలు పెరగడానికి నయా-ఉదారవాద విధానాలే కారణం. దేశంలో 1991లో పి.వి హయాంలో మొదలైన సరళీకరణ శకంతో క్రమంగా చమురు రంగాన్ని మార్కెట్ శక్తులపరం చేయనారంభమైంది. వాజ్‌పేయి ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేసేందుకు గట్టి ప్రయత్నం జరిగింది. యూపీఏ-1లో ఆ ప్రయత్నం జరిగినప్పటికీ లెఫ్ట్ మద్దతుపై ప్రభుత్వ మనుగడ ఆధారపడినందున అంతలా కుదరలేదు. యూపీఏ-2 ప్రభుత్వం వచ్చాక 2010లో పెట్రోల్‌పై కంట్రోల్ పూర్తిగా ఎత్తేశారు. 2014లో మోడీ రాగానే డీజిల్‌పైనా నియంత్రణ రద్దు చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వ కంట్రోల్ ఎత్తేశారో అప్పటి నుండి ఇంధన ధరలు రోజుకో తీరుగా మారుతున్నాయి. హేతుబద్ధత కొరవడింది. ఇంధన రంగ దిగ్గజాలైన రిలయన్స్ వంటివి సహజ వనరులను, మార్కెట్‌ను తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నాయి. ఈ విధానమే ఇంధన ధరల పెరుగుదలకు మూలం. సదరు విధానాలను ప్రజలు ప్రతిఘటిస్తేనే ఇంధన ధరల నుండి నిజమైన ఉపశమనం.