Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడి.. సాగుబడి.. ఆస్పత్రి.. అంగన్వాడీ, రోడ్డు.. రైలు... ఇవన్నీ కచ్చితంగా మనకు అవసరమైనవే. పోస్టాఫీసులు.. బస్టాండ్లు, మార్కెట్లు.. డంపింగ్ యార్డులు, ప్రాజెక్టులు.. పరిశ్రమలు ఇవి కూడా అత్యంత ఆవశ్యకమైనవే. ఒకరకంగా చెప్పాలంటే ఇవన్నీ అభివృద్ధికి ఉపయోగపడే చర్యలు. ఏ ప్రభుత్వమైనా.. మరే పాలకులైనా వీటి గురించి ఆలోచించాల్సిందే, వాటిని ఏర్పాటు చేసి తీరాల్సిందే. విస్తృత ప్రజా ప్రయోజనాలరీత్యా వాటికి ఆ ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం భూములిచ్చేవారు పడుతున్న గోసను మనం దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాం. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో వాటి కోసం భూములను కోల్పోయిన బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదనే వాస్తవాన్ని మరువలేం. దీన్నిబట్టే నిర్వాసితులపట్ల ప్రభుత్వాల వైఖరేమిటనేది తేటతెల్లమవు తున్నది.
తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడి అవసరాలకు అనుగుణంగా పలు ప్రాజెక్టులు, వాటికి అనుసంధానంగా కాల్వల నిర్మాణాన్ని చేపట్టారు. మరోవైపు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఫార్మారంగం ఊపందుకున్నది. కొత్తగా పలు పరిశ్రమలూ ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో ఆయా ప్రాజెక్టులు, కంపెనీల కోసం ఇండ్లు, భూములు, పశువులు, ఇతర ఆస్తులను పోగొట్టుకున్న వారికి ప్రభుత్వం చట్ట ప్రకారం.. సరైన రీతిలో నష్టపరిహారం చెల్లించలేదు. మల్లన్న సాగర్, కాళేశ్వరం నిర్వాసితుల పరిస్థితీ ఇదే. ఇప్పుడు తాజాగా నల్లగొండ జిల్లా కిష్టరాయిన్‌పల్లి ప్రాజెక్టు, మెదక్ జిల్లా చిన్న చింతకుంటలో నిర్మించతలపెట్టిన ఫార్మా కంపెనీ బాధితుల దుస్థితి కూడా ఇదే. ఇందులో మొదటిది తాము కోల్పోయిన భూములకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లించని నేపథ్యంలో రైతులు పడుతున్న బాధ... ఇక రెండోది కంపెనీ ఏర్పాటుతో తమ ప్రాంతాల్లోని భూగర్భ జలాలు కలుషితమవుతాయి, ఫలితంగా భూముల విలువలు పడిపోతాయనే ఆందోళనలోంచి వచ్చిన ఆవేదన. ఈ రెండు సంఘటనల్లో మొదటిదానికి సంబంధించిన బాధితులు సీఐ కాళ్లు మొక్కితే, రెండో ఘటనలో ఊర్లో ఉన్న మహిళలు ఎమ్మెల్యే పాదాలపై పడి బోరున విలపించారు. ఈ రెండు ఘటనలు జరిగిన జిల్లాలు వేరయినా... మొత్తంగా రాష్ట్రంలో ఉన్న భూ నిర్వాసితులపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు ఇవి అద్దం పట్టేవే.
వాస్తవానికి అభివృద్ధి పనులు, సంబంధిత నిర్మాణాలకు ఎక్కడో ఒక చోట భూములు తీసుకోవాల్సిందే. ఇది ఏ ప్రభుత్వానికైనా తప్పకపోవచ్చు. కాకపోతే వాటిని ప్రజలు లేదా రైతుల నుంచి తీసుకునే క్రమంలో ఆయా పాలకులు అనుసరిస్తున్న తీరును మనం పరిశీలించాలి. ప్రజలను ఒప్పించి, మెప్పించి, వారి అనుమానాలను నివృత్తి చేసిన తర్వాతే భూములను తీసుకోవాలి. ఈ క్రమంలో 2013 భూ నిర్వాసితుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. అనేక పరిధులు, పరిమితులు ఉన్నప్పటికీ దేశంలో ఇప్పటి వరకూ ఉన్న చట్టాలన్నింటిలో కొంత మేలైనది 2013 చట్టమే. దీంతోపాటు అతి ముఖ్యమైనది, కీలకమైనది పునరావాసం. ఎవరైతే బాధితులు తమ భూములు, ఆస్తులను కోల్పోయారో వారికి మార్కెట్ ధరతో పోల్చి మూడు రెట్లు అధిక ధరను నిర్ణయించి పరిహారాన్ని (దీన్ని కూడా 2013 చట్టంలోనే పేర్కొన్నారు) చెల్లించాలి. ఈ క్రమంలో ఏ ఒక్క బాధితుడికి లేదా నిర్వాసితుడికి అన్యాయం జరక్కుండా చూడాలంటూ చట్టం చెబుతున్నది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సరైన వసతులు, సౌకర్యాలతో ఇండ్లను నిర్మించి.. బాధితులకు అందజేయటం గురించి. కానీ ఉమ్మడి రాష్ట్ర పాలకులైనా, నేటి తెలంగాణ ప్రభుత్వ అధినేతలైనా... వీటిని పట్టించుకోకపోవటమే ఇప్పుడున్న అతి పెద్ద సమస్య. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిర్వాసితుల సమస్యలు పునరావృతమవుతున్నాయి. నివాసయోగ్యమైన భూములు, పంట పొలాల్లోనూ ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయటం అనేక రకాలుగా నష్టదాయకం. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో తాగు, సాగు నీరు కలుషితం కావటంతోపాటు ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదం వాటిల్లే ముప్పు పొంచి ఉంది. దీనికి సంబంధించి అనేక రాష్ట్రాలతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల అనుభవాలను పరిశీలించిన ప్రజలు... వాటిని తమ గ్రామాలు, ప్రాంతాల్లో స్థాపించాలనే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. వాటిని ఏర్పాటు చేయొద్దంటూ వేడుకుంటున్నారు. నిబంధనలు, చట్టం ప్రకారం... ఫార్మా కంపెనీలను జనావాసాల్లో ఏర్పాటు చేయకూడదు. వ్యవసాయానికి పనికిరాని భూముల్లోనే పరిశ్రమలు, కంపెనీలను నెలకొల్పాలనే నియమం కూడా ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణ సర్కార్ సైతం వీటన్నింటినీ తోసిరాజని.. నిబంధనలకు యధేచ్ఛగా తూట్లు పొడుస్తున్నది కాబట్టే నిర్వాసితులు, బాధితులు బోరుమంటున్నారు. మన ఏలికలు ముందు వారి గోసను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత వారికున్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలి. అప్పుడే ప్రాజెక్టులు, పరిశ్రమలకు ఎలాంటి అవరోధాల్లేకుండా పునాదులు పడతాయి.