Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఏడాది టి-20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు చేరుకోకుండానే భారత జట్టు ఇంటిముఖం పట్టడం దేశంలోని చాలా మంది క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశపరచింది. న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించి చివరి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవడంతో అప్పటివరకు మిణుకుమిణుకు మంటున్న ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి. చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియాపై భారత్ గెలుపు టి-20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్న కోహ్లీకి ఊరటనిచ్చేదే. ఐసిసి టి-20 టోర్నీల్లో భారత్ నాకౌట్‌కు చేరుకోలేకపోవడం గత తొమ్మిదేండ్లలో ఇదే మొదటిసారి. ఈ ఘోర వైఫల్యానికి కోహ్లీ సేనను మాత్రమే నిందించడం సరికాదు. ఈ పాపంలో బిసిసిఐకి కూడా వాటా ఉంది. ఆటగాళ్లను ఊపిరి సలపనీయకుండా టూర్లు మీద టూర్లు ఏర్పాటు చేయడంతో దుబారు టోర్నీకి ఆటగాళ్లు పూర్తి సన్నద్ధం కాలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి.
టి-20 వరల్డ్‌కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో తలపడాల్సి రావడంతో వారిపై ఒత్తిడి మరింత పెరిగింది. సాధారణంగా భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ రేపుతుంది. అందులోనూ చాలా గ్యాప్ తరువాత రెండు జట్లు ముఖాముఖి తలపడుతుండడంతో భారత జట్టుపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇది మన ఆటగాళ్లపై మరింత ఒత్తిడిని పెంచింది. పరిస్థితికి తగినట్లుగా రాణించడంలో భారత్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ విఫలం కావడంతో ఆ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. తరువాత న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌పైన దీని ప్రభావం పడింది. మొదటి రెండు మ్యాచ్‌లలో ఎదురైన ఓటమితో భారత్ ఈ టోర్నీలో నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు సన్నగిల్లాయి. క్రికెట్ కూనలైన ఆఫ్ఘనిస్తాన్, నమీబియా వంటి జట్లపై విజయం సాధించినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితికి ఆటగాళ్లలో సామర్థ్యం లేకపోవడం కారణమని అనుకోలేం. వ్యక్తులవారీ రికార్డులు పరిశీలిస్తే అందరూ దిట్టలే. టెస్టుల్లోను, వన్డేల్లోను భారత్‌కు అసాధారణ విజయాలందించినవారే. క్రికెట్లోని మిగతా ఫార్మేట్ల కన్నా టి-20 అత్యంత అనిశ్చితితో కూడుకున్నది. ఇంతవరకు జరిగిన ఐసిసి టి-20 టోర్నీలో ఒకసారి విజేతగా నిలిచిన జట్టు రెండోసారి టైటిల్ సాధించలేకపోవడానికి ఇదే కారణం. టెస్టుల్లో, వన్డేల్లో బాగా రాణించిన వాళ్లు ఈ పొట్టి ఫార్మేట్ క్రికెట్లో చతికిలపడిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఏదో రెండు మ్యాచ్‌లలో ఓడిపోయినంత మాత్రాన జట్టు పని అయిపోయిందని ఒక అంచనాకు రావడం ఎంతమాత్రం సరికాదు.
ప్రతి పోటీలోను మన జట్టు గెలవాలని కోరుకోవడం సహజం. కాని రెండు జట్లు పోటీ పడితే ఏదో ఒక జట్టే గెలుస్తుంది. మన జట్టు ఓడిపోతే ఆ ఓటమిని స్వీకరించి గెలిచిన జట్టును అభినందించడమే నిజమైన క్రీడా స్ఫూర్తి. కాని భారత జట్టు ఓటమి పట్ల క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం చేతకాని మూకలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని నానా యాగీ చేశాయి. భారత టాప్ బౌలర్లలో ఒకరైన మహ్మద్ షమీ జాతీయతను, దేశభక్తిని శంకించేలా వ్యాఖ్యలు చేయడం వీటి విద్వేష రాజకీయాలకు పరాకాష్ట. షమీపై అసహన శక్తులు చేసిన ఈ దాడిని కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వంటి వారు గట్టిగా ఖండించారు. భారత్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన పాక్ జట్టు ఆటగాళ్లను కోహ్లి అభినందించడాన్ని కూడా ఈ శక్తులు ఓర్వలేకపోయాయి. ఆటలకు మతం రంగును పులిమే ఇటువంటి క్షుద్ర రాజకీయాలు క్రికెట్‌కే కాదు, దేశ సమైక్యత, సమగ్రతలకే ప్రమాదకరం. 54 టెస్టుల్లో 194 వికెట్లు, 79 వన్డేల్లో 148 వికెట్లు, పన్నెండు అంతర్జాతీయ టి-20 మ్యాచ్‌లలో డజను వికెట్లు పడగొట్టిన షమీ ప్రపంచ టాప్ బౌలర్లలో ఒకడు. 2015లో అడిలైడ్‌లో పాక్‌తో జరిగిన వన్డేలో 35 పరుగులకే నాలుగు వికెట్లు తీసి భారత్‌కు ఘన విజయం చేకూర్చడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. ఒక్క మ్యాచ్‌లో రాణించలేకపోయినంత మాత్రాన ఆ ఆటగాడి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సంఫ్‌ు పరివార్ మూకలకే చెల్లింది. ఇది ఎంతవరకు వెళ్లిందంటే... ఈ విద్వేషవ్యాఖ్యలను ఖండించినందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురు పసిగుడ్డును సైతం రేప్ చేస్తామని బెదిరించేదాకా వెళ్లింది. ఇలాంటి మత విద్వేషాలను క్రీడలకు సైతం వ్యాపింపజేసే ఇటువంటి ధోరణులను ఆధునిక సమాజం ఎంతమాత్రం అనుమతించకూడదు. క్రీడలను క్రీడలుగానే చూడాలి.