Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ముడుపులు ముట్టజెప్పడానికి తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించినట్లు ఫ్రెంచి వెబ్సైట్ 'మీడియా పార్ట్' తాజాగా వెల్లడించిన నేపథ్యంలో ఇప్పటికైనా ఆ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తునకు మోడీ ప్రభుత్వం అంగీకరించడం అవసరం. కమలనాథులు అడ్డగోలుగా అందరినీ బుకాయించి, చివరకు సుప్రీం కోర్టును కూడా తప్పుదారి పట్టించి దేశంలో సద్దుమణగజేసినా 'వదల బొమ్మాళీ...' అన్న చందంగా ఇప్పుడు ఫ్రాన్స్‌కు చెందిన వెబ్సైట్ ఆ కుంభకోణ వివరాల కుండ బద్దలు కొట్టింది. 2007-2012 మధ్య కాలంలో రక్షణ దళారీ సుషేన్ గుప్తాకు దసాల్ట్ ఏవియేషన్ 75లక్షల యూరోలకు (సుమారు రూ.65 కోట్లు) పైగా ముడుపులు చెల్లించేందుకు నకిలీ ఇన్వాయిస్లను వినియోగించారని మీడియా పార్ట్ బయటపెట్టింది. గత పదిహేనేండ్లుగా దసాల్ట్, థేల్స్లతో గుప్తాకు గల వాణిజ్య సంబంధాలను మీడియా పార్ట్ ప్రచురించిన నివేదికలు బట్టబయలు చేశాయి. సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ కోసం రూపొందించిన ఇన్వాయిస్లను ఉపయోగించి విదేశాల్లోని ఖాతాలకు, డమ్మీ కంపెనీలకు ముడుపులుగా లక్షల యూరోలను చెల్లించారని ఈ నివేదికలు పేర్కొన్నాయి. గుప్తాకు రహస్య ముడుపులుగా 2018 అక్టోబరు నుంచి 75లక్షల యూరోలను దసాల్ట్ చెల్లించిందని, అందుకు సిబిఐ వద్ద రుజువులున్నాయని ఆ వెబ్సైట్ పేర్కొంది. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి అవినీతి జరిగిందంటూ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, బీజేపీ మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరిల నుండి అధికారికంగా ఫిర్యాదు అందిన వారం రోజులకే ఆ పత్రాలు కూడా అందాయి. ఈ కేసుకు సంబంధించి అవినీతి ఫిర్యాదు, మారిషస్ నుండి సమాచారం సిబిఐకి అందాయని మీడియా పార్ట్ తెలిపింది. 'డబ్బులివ్వకపోతే పని జరగదు. పైగా జైల్లో పెడతారు' వంటి వ్యాఖ్యలున్న సుషేన్ గుప్తా ఉత్తరాలు కూడా ఇడి వద్ద ఉన్నాయి. అలాగే 2015లో తుది విడత చర్చలు జరిగినప్పుడు గుప్తా ద్వారా దసాల్ట్‌కు చేరిన వివరాల విషయమూ మన దర్యాప్తు సంస్థలకు తెలుసు. ముడుపులిచ్చినట్లుగా పత్రాలు 2018 అక్టోబరు నుండి అందుబాటులో వున్నప్పటికీ వీటిపై దర్యాప్తు చేయడంలో భారత దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయని మీడియా పార్ట్ ఎద్దేవా చేసింది. కాబట్టి భారతీయ దర్యాప్తు సంస్థలకూ ఇది మాయని మచ్చ. మన దర్యాప్తు సంస్థలు అధికారంలో వున్న పెద్దల కనుసన్నల్లో నడుస్తాయే తప్ప సాక్ష్యాధారాలను బట్టి దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను కటకటాల వెనక్కు పంపించే పని చేయబోవని చెప్పకనే చెప్పినట్టయింది.
అయితే, యూపీఏ హయాంలో అగస్టా హెలికాప్టర్ల కొనుగోలులో సుషేన్ గుప్తా ద్వారా ముడుపులు ముట్టాయని పదేపదే చెప్పిన బీజేపీ నేతలు తమ పాలనలో రాఫెల్ తుది విడత చర్చల సందర్భంలోనూ ఆ పెద్దమనిషినే ఎందుకు మధ్యవర్తిగా పెట్టుకున్నారో వారే వెల్లడించాలి. అలాగే కాంగ్రెస్ పాలనలో జరిగిన ఒప్పందాన్ని మోడీ సర్కారు పూర్తిగా రివైజ్ చేయడం వెనుకగల కారణాలూ వారే వివరించాలి. భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌లో 108 విమానాలను తయారుచేసి ఇవ్వాలన్న నిబంధనను మార్చి అనిల్ అంబానీ సంస్థను ముందుకు తేవడం ఏ విధమైన దేశభక్తి అవుతుందో సంఘ పరివారమే సెలవివ్వాలి. కొత్త ఒప్పందం చేసుకోవడంలో సాక్షాత్తూ ప్రధానమంత్రి కార్యాలయం ప్రత్యక్ష పాత్ర ఉందని హిందూ పత్రిక కథనాలతో సహా అనేక ఆధారాలు వెల్లడయ్యాయి. సిబిఐ అధినేత అలోక్‌వర్మ అర్థరాత్రి బదిలీ కూడా ఈ కుంభకోణంతో ముడివడిందేనన్నది జగమెరిగిన సత్యం. ఇన్ని విధాలుగా భ్రష్టు పట్టిన రాఫెల్ కుంభకోణంపై రానున్న పార్లమెంటు సమావేశాల్లో మళ్లీ ప్రకంపనలు రాక తప్పదు. అంతకు ముందుగానే ఇప్పటికైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు మోడీ సర్కారు అంగీకరించడం అవసరం. ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ తప్పుడు వ్యవహారాలపై ధ్వజమెత్తిన బీజేపీ తాను అధికారంలోకి వచ్చాక అవినీతిలో కాంగ్రెస్‌ను తలదన్నేలా వ్యవహరించడమేగాక, ఆ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి అధికార దుర్వినియోగానికీ తారాస్థాయిలో పాల్పడుతోందని సుషేన్ గుప్తా ఉదంతం మరోమారు రుజువు చేస్తోంది.