Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని తేదీలూ, సంవత్సరపు సంకేతాలు కేవలం అంకెలు మాత్రమే కాదు, అవి చరిత్రకు సాక్ష్యాలు, త్యాగాలకు ఆనవాళ్ళు, ఉద్వేగపూరిత జ్ఞాపకాలు. అంతేకాదు, చైతన్యాన్నిచ్చే ప్రేరణలు, వీరత్వానికి ధీరత్వానికి ప్రతీకలు. అందుకే ఆ అంకెలూ సంఖ్యలూ కదలిస్తాయి. బోలెడంత జ్ఞానాన్ని అందిస్తాయి. ఎన్నెన్నో మరుపురాని సంఘటనలను గుర్తు చేస్తాయి. కానీ ఆ తేదీల, అంకెల వెనకాల చరిత్ర తెలియని అజ్ఞానులకు అవేమీ బోధించవు. ఇక పిచ్చి వాళ్ళకయితే పిచ్చిగీతల్లాగే కనిపించవచ్చు. మూర్ఖులు కొత్త అర్థాలనూ వెతక్కుంటారు. మసిపూసి మారేడుకాయగా మార్చేస్తారు. ఉన్మాదులు ఏం చేస్తారో ఎవరికేమీ తెలుస్తుంది గనుక!
1857 అనగానే ఎంత చరిత్ర కళ్ళముందు కదలాడుతుంది. ఎన్ని ప్రాణాలు ఎదురొడ్డిన పోరాటం స్ఫురణకు వస్తుంది! అది నాలుగంకెల సంవత్సరమే కావచ్చు. కానీ ప్రథమ స్వాతంత్య్ర సమరశంఖారావం గుండెల్లో ధ్వనించదూ! ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియాతోపే, నానాసాహెబ్ మొదలైన భారతీయులు ఆంగ్లేయులపై చేసిన తిరుగుబాటు సమర దృశ్యం మదిలో కదలాడదూ! 1905 అనగానే బెంగాల్ విభజన, దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాట చరిత్రలోకి మనసు కదిలిపోతుంది కదా! 1942 అనగానే క్విట్ ఇండియా ఉద్యమ నినాదం మారుమ్రోగుతుంది. 1947 సంవత్సరాన్ని తలచుకోగానే భారతీయుల గుండె ఉప్పొంగిపోతుంది. ఆగస్టు 15 మదిలోకి రాగానే ఒక స్వేచ్ఛా ఉత్సవ సంబురం గుండెలనంటుతుంది. రెండువందల యేండ్ల దాస్య శృంఖలాలు బద్దలయి స్వాతంత్య్రపు వెలుగు పులుగు రెక్కలిప్పిన మహౌన్నత ఘట్టం మన ముందు పరచుకుంటుంది. ప్రాణాలకు తెగించి, మాతృభూమి విముక్తి కోసం ఉరికంబాలెక్కిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ అజాద్‌లు, అల్లూరి, వీరపాండ్య కట్టబ్రహ్మన, సుబాస్చంద్రబోసు, కుదిరాంబోస్ మొదలైన వేలాది వీరులు చరిత్రలో నిలిచి స్ఫూర్తినిస్తూనే ఉంటారు. మహాత్మాగాంధీ సత్యాగ్రహౌద్యమం, బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరారుల త్యాగం అన్నీ గుర్తుకు వస్తూనే ఉంటాయి.
ఇప్పుడు ఈ తేదీల ఘట్టాల ప్రస్తావనెందుకంటే.. మొన్నీమధ్య 'ఉత్త'మోత్తమ నటనకు గాను ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డునందుకున్న నటి కంగనారనౌత్ విసిరిన అజ్ఞానోక్తికి అందరూ ఉలిక్కిపడ్డారు. అదేమంటే మన దేశానికి అసలైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు 2014లోనే వచ్చాయని ఆమె నొక్కి వక్కాణించింది. 1947లో కేవలం బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్య్రం అనే దానిని గాంధీజీ భిక్ష పాత్రలో వేసారని, భిక్షగా వేసింది స్వాతంత్య్రమెలా అవుతుందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండే మనకు నిజమైన స్వేచ్ఛ లభించిందన్న ఆమె మాటలు భారతీయుల ఆత్మగౌరవాన్ని, వారసత్వాన్ని తీవ్రంగా గాయపరుస్తున్నవి. మన దేశ స్వాతంత్య్ర పోరాటం గురించి కానీ, ఉద్యమ త్యాగాల గురించి గానీ ఏమీ తెలియని అజ్ఞాన మూఢత్వమా లేక పోరాటపు వారసత్వమే లేని వారి ఆత్మ పలుకుతున్న చిలుక పలుకులా! ఏమో! స్వాతంత్య్ర పోరాటాన్ని వ్యతిరేకించి బ్రిటిష్‌వారికి జీహుజూర్ అన్న వారి ఏలుబడిలో ఇంతకన్నా ఘనమైన వ్యాఖ్యానాలను ఏమి వినగలం మనం. నిజంగా ఇలాంటి వారిని చూసి సిగ్గుపడాల్సివస్తోంది. మన దేశ విముక్తి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వాళ్ళను అవమానపరచడం అసలైన దేశ ద్రోహం. వీళ్ళను శిక్షించాలి. త్యాగాల చరిత్రపై వీరి అశుద్ధవాక్కులను భారతీయులు క్షమించరు గాక క్షమించరు. వీటిని పిచ్చిమాటలని కొట్టివేయటానికీ లేదు. ఎందుకంటే మాట్లాడింది 'పద్మశ్రీలు.. మాటలు మాత్రం 'కమల'శ్రీలవి.
కాశ్మీరు గురించో, ఢిల్లీ అల్లర్ల గురించో, వ్యవసాయ చట్టాలు, లఖింపూర్ హత్యల గురించి గళమెత్తితే దేశద్రోహులనే ముద్ర. ఒక్క ప్రశ్నను ఎక్కుపెడితే, ప్రజా స్వామ్యాన్ని గూర్చి నిలదీస్తే దేశద్రోహులే. కానీ దేశ స్వాతంత్య్రాన్ని భిక్ష అని వక్కాణిస్తే దేశభక్తీనా? ఇదెక్కిడి న్యాయం? ఇదేమి సంస్కారం! ఇంత నీచత్వమా!
మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నుండి స్వేచ్ఛ వచ్చిన మాట నిజం. కానీ ఎవరికి ఆ స్వేచ్ఛ అనేదే ముఖ్యం. అశేష ప్రజానీకానికా ఆశ్రిత జన సమూహానికా అనేది జాగ్రత్తగా గమనించండి. స్వేచ్ఛగా రైతులను కార్లతో తొక్కి కాల్పులు జరిపి చంపారు. అవును ఆ స్వేచ్ఛ వచ్చాకే అంబానీ ఆదానీ ఆదాయాలు వందలరెట్లు వృద్ధి చెందాయి. సామాన్యుల బతుకు ఆకలితో దిగజారింది. స్వేచ్ఛతోనే వేల కోట్లతో విగ్రహాలను, పార్లమెంటు విస్టాలను నిర్మించుకొంటున్నది. అవునవును స్వేచ్ఛలేకుంటే పి.ఎం.కేర్స్ నిధుల లెక్కలు చెప్పాల్సిన అవసరమే లేదని ఎలా చెప్పగలరు!? ఆ స్వేచ్ఛతోనే కదా మన జాతి పితను చంపిన గాడ్సేకు గుడికట్టింది. అందుకే కదా వలస కార్మికులు రోడ్లపై, రైలు పట్టాలపై పడి స్వేచ్ఛగా చస్తున్నది. హత్రాస్‌లో అత్యాచారం, హత్య చేసిన వారికి స్వేచ్ఛ కోసం ప్రదర్శనలు తీయగలిగింది. ఆ స్వేచ్ఛతోనే అక్లాక్‌ను యధేచ్ఛగా చంపగలిగింది. ఆ స్వేచ్ఛతోనే కదా నేడు ధరలన్నీ తమ ఇష్టం వచ్చినట్లు పైపైకి ఎగబాకుతున్నది. ప్రజల ఆస్తులు స్వేచ్ఛగా ఒక్కొక్కటి బహిరంగంగా అమ్ముకోగలుగుతున్నది!
ఇంతకంటే 2014 నుండి ఏమి గొప్ప స్వేచ్ఛను చూడగలిగాము మనం. రనౌత్కేదో కమల కామెర్లు వచ్చి ఉండాలి. వైద్యం అత్యవసరం ఆమెకు. అంత తేలికగా, చులకనగా, హీనంగా మాటలను వొదలకూడదనే ఎరుకను ఆమెకూ ఆమెలా ఆలోచించే వారికీ అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం దేశభక్తులైన మనందరిపైనా ఉంది. 1947 కేవలం తేదీ కాదని, మహౌద్యమ సాఫల్యపు యాది అని ముఖంపై చరిచి చెప్పాల్సి ఉంది.