Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశానికి రైతే వెన్నెముక.. అందుకే ''ఎద్దేడ్సిన ఎవుసం, రైతేడ్సిన రాజ్యం బతికిబట్టకట్టిన దాఖలాల్లేవు...'' అంటారు. ''దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాత గురించీ, అతని గొప్ప తనాన్ని గురించీ ఎప్పటి నుంచో చెబుతున్న మాటలివి. 'రైతే రాజు' అని కూడా సంబోధించటాన్నిబట్టి అతడి ఔన్నత్యాన్ని మనం గుర్తించవచ్చు. కానీ ఈ నినాదాలు, మాటలు నేడు అన్నదాతను కడగండ్ల నుంచి గట్టెక్కించటం లేదు. చెరువుకు గండి పడ్డా... అనుకోకుండా వానపడ్డా... అతడి బాధలు వర్ణనాతీతం. ఆరుగాలం పండించిన పంట నీటి పాలై, వరదలో కొట్టుకుపోయినప్పుడు గుండెలవిసేలా రోదించే రైతు, ఇంకోవైపు పాలకుల నిర్లక్ష్యపు వరదలోనూ కొట్టుకుపోతున్నాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోయా, పత్తి పంటలు తుపాన్ దెబ్బకు కకావికలం కావటంతో శివ చరణ్ అనే యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ కోవకు చెందిందే.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (పీఎమ్‌కేఎస్‌వై) నుంచి రైతుబంధు, రైతు బీమా దాకా పాలకులు ప్రవేశపెట్టిన అనేక పథకాలు వ్యవసాయదారుడికి ధీమా ఇవ్వలేకపోతున్నాయి. వ్యవసాయాన్ని ఉద్ధరించటానికంటూ ప్రభుత్వాధి నేతలు సాగుకు చేస్తున్న ఆర్థిక సాయాలు... తాత్కాలిక ఉపశమనాలు గానే మిగిలిపోతున్నాయి తప్ప శాశ్వత పరిష్కారాలను చూపటం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో పంటలు నష్టపోయినప్పుడు రైతును ఆదుకునేందుకు ఎలాంటి పథకాలూ లేకపోవటం విస్మయపరిచే అంశం. అకాల వర్షాలు, తుపాన్లు, కరువు కాటకాలొచ్చి పంటలు పాడైనప్పుడు ప్రభుత్వం ఆయా పంటల నష్టాన్ని అంచనా వేయాలి. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఎంతమేర నష్టపోయామనే వివరాలను పంపాలి. కానీ తెలంగాణ సర్కారు ఆ దిశగా చర్యలు చేపట్టటం లేదు సరికదా... కనీసం పంట నష్టం అనే మాటను కూడా ఉచ్ఛరించటానికి ఇష్టపడటం లేదు. పదిహేనో ఆర్థిక సంఘం నుంచి పంట నష్ట పరిహారం కోసం రూ.499 కోట్లు మనకు వస్తాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు నిధులను జోడించుకునే వెసులుబాటుంది. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర ఇదే రకంగా ఆ నిధుల్ని వాడుకుంటున్నాయి. కానీ టీఆర్ఎస్ సర్కారు మాత్రం ఆ దిశగా ఆలోచించకపోవటం విస్తుగొలిపే అంశం. వాస్తవానికి ఏదైనా కారణం వల్ల రైతు మరణించినప్పుడు అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉద్దేశించిన 'రైతు బీమా...' అనేది మంచి పథకం. దీని వల్ల అనేక కుటుంబాలు లబ్దిపొందాయన్నది విస్మరించలేని విషయం. కానీ అతడు బతికున్నప్పుడు పంటను కాపాడగలిగితే, ఒకవేళ పంట నష్టపోయినప్పుడు పరిహారాన్ని ఇవ్వగలిగితే... అసలు ఈ ఆత్మహత్యలు, మరణాలు ఉండనే ఉండవు కదా...? అన్నది ఇక్కడ కీలకాంశం. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పంటల బీమా పథకం అటకెక్కటం కూడా రైతులకు శాపంగా మారింది. ఈ పథకం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతోపాటు రైతు కూడా పదిశాతం వాటాను చెల్లించాల్సి ఉంటుంది. కానీ కేంద్రం గతేడాది తన వాటాను తగ్గించుకుని... రాష్ట్రాలకు అధిక వాటాను కేటాయించటంతో తెలంగాణ సర్కార్ ఆ పథకం నుంచి బయటకొచ్చింది. దీంతో రైతును ఆదుకునేవారే కరువయ్యారు.
ఇలాంటి విషయాలకు సంబంధించి టీఆర్ఎస్ సర్కారు వైఖరి మరీ విచిత్రంగా ఉందంటూ రైతు సంఘాలు వాపోతుండటం గమనార్హం. 'మేమే అసలైన రైతులం. వ్యవసాయం గురించి మా కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు..? ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టాం...' అంటూ వ్యాఖ్యానించటం ప్రభుత్వాధినేతలకు పరిపాటిగా మారింది. ఈ క్రమంలో రైతు సంఘాలు, రైతు నేతలు, వ్యవసాయ నిపుణులు, విశ్లేషకుల అభిప్రాయాలు, సూచనలను వారు పెడచెవిన పెడుతున్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్ఎస్ స్వామినాథన్‌ను సచివాలయ ద్వారం నుంచి స్వయంగా తోడ్కొని వచ్చి... సన్మానం చేసి పంపిన ముఖ్యమంత్రి, ఆయన చేసిన సిఫారసులను మాత్రం విస్మరించారు. రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ లాంటి పథకాలు కౌలు రైతులకు వర్తించబోవు, అసలు వారితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని చెప్పటం ద్వారా అసలు సిసలైన సాగుదారుడికి సీఎం మొండి చేయి చూపుతున్నారు. సంవత్సరకాలం నుంచి ఉత్తర భారత రైతులు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో... వాటి వ్యతిరేకతపై ఊగిసలాట ధోరణి స్పష్టంగా కనబడుతున్నది. ధాన్యం కొనుగోళ్ల అంశం తెరపైకి వచ్చిన తర్వాత గానీ టీఆర్ఎస్ సర్కారు కండ్లు తెరవలేదంటే... వ్యవసాయ విధానాల పట్ల దాని చిత్తశుద్ధి ఏ పాటిదో విదితమవుతున్నది. ఈ క్రమంలో ఎన్ని పథకాలు, కార్యక్రమాలను అమల్జేసినా... అన్నదాతల ఆత్మహత్యలను నివారించలేకపోతున్నాం. అందువల్ల వ్యవసాయం, రైతుల సమస్యలు, వారి ఇబ్బందులు, ఈతిబాధలు, ముంచుకొస్తున్న కేంద్ర విధానాల ముప్పుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత అవసరం. అది అనివార్యం. అప్పుడే మన రైతును అన్ని రకాలుగా కాపాడుకోగలం, వ్యవసాయాన్ని రక్షించుకోగలం.