Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం నిస్సారంగా, నిస్తేజంగా, ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు లేకుండానే ముగిసింది. అసలీ జాతరెందుకు జరిపారో మోడీ సర్కార్కే తెలియాలి. కేంద్ర హౌంమంత్రి అమిత్ షా ప్రసంగం మొత్తం 'ఆత్మస్తుతి.. పరనింద' అన్న తీరుగానే సాగింది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో యుద్ధమే అంటూ కారాలు మిరియాలు నూరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ సమావేశాని వెళ్లకుండా ముఖం ఎందుకు చాలేశారో ఆయనే చెప్పాలి. రాష్ట్రాల సమస్యలపై చర్చించే సమావేశానికి మాట్లాడకుండా మిన్నకుండి.. కేవలం రాజకీయ చర్చగా దీనిని తీసుకురావడం సమస్యను పక్కదారి పట్టించడమే. అత్యంత కీలకమైన ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావించే అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ హజరై ధాన్యం కొనుగోలు విషయం ప్రస్తావించి ఉంటే ఇతర రాష్ట్రాల మద్ధతు అయినా లభించి ఉండేది. ఆయా రాష్ట్రాలను కూడా కలుపుకొని కేంద్రంపై పోరాటానికి నాయకత్వం వహించాల్సింది. ఇది రాష్ట్ర రైతులకు నష్టదాయకం. తెలంగాణకు సంబంధించిన తేల్చుకోవాల్సిన అనేక అంశాలున్నాయి. అయినా ముఖ్యమంత్రి గైర్హాజరుకావడం విస్మయాన్ని కల్గిస్తోంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విభజన హామీల నుంచి నీటి పంపకాల వరకూ అనేక సమస్యలను ప్రస్తావించారు. కేంద్ర విధానాన్ని నిలదీశారు. ఆ రాష్ట్రం కోరుకునేది ఏమిటో దాపరికం లేకుండా కుండ బద్దలు కొట్టారు. అయినప్పటికి అమిత్ షా నుంచి ఏ ఒక్క అంశానికి జవాబు రాలేదు.
సమస్యలపై ఆందోళ నలు.. నిరసనలు అవస రమే. దానితో పాటు కేంద్రాన్ని నిలదీ సేందుకు ఏ చిన్నా అవకాశాన్ని కూడా వదులుకోకూడదు కదా! రాష్ట్ర ప్రతినిధులుగా హాజరైన రాష్ట్ర హౌం మంత్రి తాను తీసుకెళ్లిన పత్రం చదివారు. అంతకు మించి సాధించింది ఏమీలేదు. తెలంగాణ అధికారులే పలు అంశాలను లేవనెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిల గురించి సమావేశం దష్టికి తీసు కువచ్చారు. అన్ని విన్న అమాత్యులు అమిత్ షా ''ఇరు రాష్ట్రాలు మరోమారు సమావేశమై సమస్యలను మీరే పరిష్కరించుకోండి'' అని ఉచిత సలహా పడేశారు.
సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల మధ్య అభిప్రాయభేదాలు సహజం. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏడేండ్ల కాలంలో ప్రధానమైన నీటి సమస్యతోపాటు సంస్థల, ఆస్తుల పంపకాలు అలాగే ఉన్నాయి. అడుగడుగునా సమస్యలే. ధాన్యం కొనుగోళ్లపై ద్వంద్వ ప్రమాణాలే. నదీజలాల వివాదాలకు శాశ్వత పరిష్కారంటూ ఏర్పాటు చేసిన బోర్డుల అధికార పరిధులను ఇరు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. న్యాయం జరగలేదు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించే దిశగా కార్యాచరణ ఏదీ ఖరారు కాలేదు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల మధ్య చాలాకాలంగా పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయే తప్ప కనీసం చర్చకు నోచుకోలేదు. నేర పరిశోధన, న్యాయ పరిశీలన, భారత శిక్షాస్మతిలో మార్పులు చేర్పులపై చర్చించింది. ఒకటి రెండు మినహా వేటిపైనా లోతైన చర్చ జరగలేదు. పాలమూరు - రంగారెడ్డి సహా కొన్ని ప్రాజెక్టులపై నివేదికల సమర్పణ, అధ్యయన కమిటీల ఆవశ్యకత వంటి కొన్ని అంశాలపై సమావేశంలో తీర్మానాలను ఏకపక్షంగా ఆమోదించారు. వాటిని చర్చకు కూడా పెట్టకుండా, ఒక అవగాహనకు రాకుండానే ఆమోదించారు. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడలేదు.ఈ సమావేశం ద్వారా తెలంగాణ సర్కార్ ఏమాశించింది? ఏదైనా పరిష్కారాలు దొరుకుతాయనుకుందా? ఈ 'తంతే' నిరుపయోగం అనుకుందా? గోదా దాటి బయటకు వచ్చి తొడలు కొడ్తే ఏమి ఉపయోగం? ప్రజాస్వామిక వ్యవస్థ బలంగా ఉండాలంటే, రాష్ట్రాల మధ్య సయోధ్య అవసరం. రాష్ట్రాలతో కేంద్రానికి సత్సంబంధాలు ఉండాలి. అభివృద్ధే లక్ష్యంగా కలిసి పనిచేయాలి. ఫలితాలు రాబట్టాలి. కానీ, దేశంలో ఇలాంటి వాతావరణం లేదు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికిన కేంద్రమంత్రి అదే విధానాన్ని రాష్ట్రాల పట్ల ఎందుకు ఆచరించడం లేదన్నది ప్రశ్న. రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను కేంద్రమే పరిష్కరించాలి. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ''తాంబులాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి'' అన్నట్టు తాను అగ్నిహౌత్రావధానుల అవతారమెత్తింది. కేంద్రం దాగుడుమూతలు మానుకొని అర్థవంతమైన చర్చలు జరిగితేనే సమావేశాలకు సార్థకత. సమస్యలకు పరిష్కారం చూపని సమావేశాలు మాత్రం ఎన్ని జరిగితే ఏం ఉపయోగం. సమస్యలు పుల్.. పరిష్కారాలు నిల్ అన్నట్టుగానే దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరిగింది.