Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బీ ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్!' అన్నారు. 2031 వరకు ప్రతి సంవత్సరం క్రికెట్ పండుగకు రంగం సిద్ధమవుతున్నవేళ క్రికెట్ భాషే ఉత్తమం! కెసిఆర్, బీజేపీల ఫ్రెండ్లీ మ్యాచ్ అనంతంగా సాగిపోతూనే ఉంది. ఒకరు కేంద్రంలో, మరొకరు రాష్ట్రంలో అధికారంలో ఉండటంవల్ల ఏర్చికూర్చిన సమాచారం పత్రికల్లో కుమ్మరిస్తూనే ఉన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను మాత్రం రాష్ట్రంలో చర్చకు రాకుండా బహు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును తాటాకు చప్పుళ్లలా కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వ్యతిరేకిస్తుందా? లేదా? ఇప్పటికే వ్యతిరేకించే రాష్ట్రాలతో జట్టు కడ్తుందా? కట్టదా? జట్టుకట్టి జంగ్ చేస్తుందా? చేయదా? ఇవన్నీ శేష ప్రశ్నలుగానే మిగిలి, తాము మునుగుతామేమోనన్న భయం రాష్ట్ర రైతాంగం మనసులను తొలుస్తూనే ఉంది.
తమ కోళ్లు కూయందే పొద్దే పొడవదనే నిరక్షరకుక్షులైన 'పద్మశ్రీ'లు 2014లోనే మన దేశానికి స్వాతంత్య్రమొచ్చిందనడం కాకతాళీయంకాదు. సీదా బహుళజాతి కంపెనీల ఒళ్ళోనే తెల్లవారిన మోడీ స్వాతంత్య్ర ప్రధాత అయిన తర్వాత అప్పటిదాకా జరిగినదంతా 'హుళక్కే' కదా! సుమారు 33 లక్షల చ.కి.మీ. వైశాల్యంకల్గి, మొదటి ప్రణాళిక (1952) నాటికి 39 కోట్ల మంది జనాభా వున్న దేశంలో అందరికీ ఐదువేళ్లూ నోట్లోకి పోయేలా చూడటం నాటి పాలకుల ముందున్న సవాలు. వరిగానీ, గోధుమకాని దేశమంతా పండవు. దేశమంతా తినరు. మిగులున్న చోట కొనాలి. తరుగున్న చోటకి పంపిణీ చేయాలి. ఆ అవసరాల కోసమే 1956లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఆవిర్భవించింది. లేకుంటే అమెరికా వారి 'పీఎల్ 480' కింద దిగుమతులే దిక్కయ్యేది. దేశవ్యాపిత రైతాంగ ఉద్యమానికి తలొగ్గి నాటి కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర(ఎమ్ఎస్పీ) విధానం 1982లో ప్రకటించింది. అంతకుముదు నీటిపారుదల సౌకర్యాల ఏర్పాటుకు ప్రాజెక్టులు, ఎరువుల వినియోగం మొదలైనవి హరిత విప్లవంలో సాకల్యమైనాయి. పెద్దఎత్తున పండిన వ్యవసాయోత్పత్తుల్ని ఎఫ్‌సీఐ, సీసీఐ, నాఫెడ్ల ద్వారా కేంద్రం కొనుగోలు చేసింది. ఇదీ దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి అయిన తీరు. 80వ దశకారంభానికి మన దేశం ఆహారధాన్యాల ఎగుమతి సామర్థ్యం సాధించింది.
1985లో రాజీవ్‌గాంధీతో మొగ్గతొడిగిన సరళీకృత ఆర్థికవిధానాలు మోడీ కాలానికి మానయినాయి. వీటి పరాకాష్టే మూడు వ్యవసాయ చట్టాలు. అమెరికా వంటి దేశాల గోదాముల్లో పెద్దమొత్తంలో పడున్న ఆహారధాన్యాలను మనలాంటి దేశాల్లోకి కుమ్మరించాలి. అందుకే మనదేశంలో ఆహార పంటలను రైతులు పండించకుండా, ఆ పంటలకు కనీస మద్దతుధర ఇవ్వకుండా వ్యవసాయ చట్టాలు అడ్డుకుంటు న్నాయి. 'మా వరి కొనాలి' అనే రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ సహేతుకమే. అయినా పై వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకించకపోతే మన రాష్ట్ర రైతాంగం నోట్లో మట్టేననే తెలివిడి రాష్ట్ర పాలకులకుందా? బాయిల్డ్ రైస్ ఎగుమతికి బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలకు ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలించదా? పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండెందుకు చేయదు?
'వరి వేస్తే ఉరే' అని పెద్దాయనంటే.. వరిపై ఏ నిర్ణయం తీసుకోలేదని వ్యవసాయమంత్రి అంటాడు. మెదక్ కలెక్టర్ వేయచ్చంటే.. నిన్ననే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సిద్ధిపేట కలెక్టర్ వద్దంటాడు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలనే నిర్ణయం అధినాయకుడికుంటే.. రాష్ట్ర మంత్రులు, అధికారులు తలా ఒక మాట మాట్లాడాల్సిన పరిస్థితి రాదు. రైతుల్ని పరేషాన్ చెయ్యాల్సిన అవసరం రాదుకదా!
రాష్ట్ర జాబితాలోని వ్యవసాయాన్ని, విద్యను, ఉమ్మడి జాబితాలోని విద్యుత్‌ను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది. జీఎస్టీ ద్వారా రాష్ట్రాల వనరుల్ని కబ్జా పెట్టింది. ఫెడరల్ ఫ్రంట్ అని ఎగుర్లాడినాయన ఈ విషయాల్ని వ్యతిరేకించాలా వద్దా?! నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాల తర్వాత 'కారు' ఢిల్లీ వెల్తుందనుకన్న వారికి నిరాశ మిగిల్చి.. ధర్నా చౌక్‌కే పరిమితం చేయడంవల్ల ఏమి ప్రయోజనం? ఇంకా చప్పటి లేఖాస్త్రాలకే పరిమితమయితే, రాష్ట్ర రైతుల ప్రయోజనం ఎవరు కాపాడతారు?
మట్టి పిసుక్కునేవాడికి మల్టీ నేషనల్ కంపెనీల, కార్పొరేట్ల మంత్రాంగం ఏమర్థమవుతుందిలే అనేది బీజేపీ ధైర్యం. పుష్కళంగా నీటిపారుదల ఉన్న రాష్ట్రాల ఉత్తర భారత రైతులు ఢిల్లీని గేరి వేశారు. వేగుచుక్కలై పోరు సాగుచేస్తున్నారు. మరో వారంలో వారి త్యాగాలకు సంవత్సరాది పండుగ. హైదరాబాద్‌లో జరుగుతున్న సీఐటీయూ జనరల్ కౌన్సిల్ ఆ ఉద్యమానికి సంఘీభావంగా మొన్ననే పొలికేక పెట్టింది. పోరు పతాకనెత్తింది. దేశ కార్మికవర్గం రెండు రోజుల సమ్మెకు సన్నద్ధమౌతోంది. కెసిఆర్ నిజమైన టెస్ట్ మ్యాచ్‌కి సిద్ధపడతారా లేదా తేల్చుకోవాలి.